Home తాజా వార్తలు ఇక్రిశాట్‌తో నీటిపారుదలశాఖ ఒప్పందం

ఇక్రిశాట్‌తో నీటిపారుదలశాఖ ఒప్పందం

Study on effects of Mission Kakatiya results

మిషన్ కాకతీయ ఫలితాలు ప్రభావాలపై అధ్యయనం

మన తెలంగాణ / హైదరాబాద్ : రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్ఠాత్మకంగా చేపట్టిన ‘మిషన్ కాకతీయ’ ఫలితాలను, రైతులకు కలిగిన ప్రయోజనాన్ని, ప్రకృతి వనరులు ఏ మేరకు పెరిగాయి తదితరాలపై అంతర్జాతీయ సంస్థ అధ్యయనం చేయనుంది. ఇప్పటికే నాబార్డుకు అనుబంధ సంస్థ అయిన ‘నాబ్కాన్స్’ (నాబార్డు కన్సల్టెన్సీ సర్వీసెస్) అధ్యయనం చేయగా ఇప్పుడు అంతర్జాతీయ సంస్థ ‘ఇక్రిశాట్’ అధ్యయనం చేయనుంది. అయిదు దశల మిషన్ కాకతీయ- ఫలితాలు-, వాటి ప్రభావంపై ఇక్రిసాట్‌తో రాష్ట్ర నీటి పారుదల శాఖ శుక్రవారం ఒక ఒప్పందాన్ని కుదుర్చుకుంది. నీటి పారుదల శాఖ మంత్రి కార్యాలయంలో మంత్రి హరీశ్ రావు సమక్షంలో ప్రభుత్వం తరపున ‘కాడా’ కమిషనర్ మల్సూర్, ఇక్రిసాట్ తరపున ఆ సంస్థ డిప్యూటీ డైరక్టర్ జనరల్ కిరణ్ శర్మ సచివాలయంలో ఒప్పందం పై సంతకాలు చేశారు. ఈ ఒప్పందం ప్రకారం మిషన్ కాకతీయ ఫలితాలు- వాటి ప్రభావంపై ఇక్రిసాట్ రెండేళ్ల పాటు అధ్యయనం చేసి ప్రభుత్వానికి నివేదికను అందజేయనుంది. ఐదు విడతలలో పునరుద్ధరించిన చెరువుల ఫలితాల ప్రభావంపైన సమగ్రమైన అధ్యయనంతో పాటు చెరువు మట్టి ద్వారా రైతులు ఎలాంటి లాభాలు పొందారు, పంట దిగుబడి ఎంత పెరిగింది, చెరువుల పునరుద్ధరణ జరిగి ప్రాంతాల్లో భూగర్భ జలాలు ఏ మేరకు పెరిగాయి, చెరువు మట్టి ద్వారా పంట దిగుబడిలో వచ్చిన పెరుగుదల, రైతుకు ఆర్థికంగా ఒనగూరిన లాభాలు తదితర అంశాలపై ఇక్రిసాట్ అధ్యయనం చేయనుంది.

ఇది సమగ్ర అధ్యయనం : మంత్రి హరీశ్‌రావు
ఇక్రిశాట్‌తో కుదిరిన ఒప్పందం గురించి మంత్రి హరీష్ రావు మాట్లాడుతూ హైదరాబాద్ నగరంలో గత కొన్నిదశాబ్దాలుగా ఆ సంస్థ వ్యవసాయ పరిశోధనలు చేస్తూ ఉన్నదని, ఇప్పుడు మిషన్ కాకతీయ ప్రభావాలు, ఫలితాల అధ్యయనం కోసం ఒప్పందం కుదుర్చుకోవడం సంతోషంగా ఉందని అన్నారు. రాష్ట్ర సాగునీటిపారుదల శాఖ పలు ప్రతిష్టాత్మక సంస్థలతో కలిసి పని చేస్తున్నదని, సమాచార వ్యవస్థను రూపొందించడానికి గతంలో ‘ఇస్రో’తో కూడా ఒక ఒప్పందాన్ని కుదుర్చుకున్నదని అన్నారు. ఆ సంస్థ రూపొందించిన సమాచార వ్యవస్థ ఆధారంగా ప్రభుత్వం గొలుసు కట్టు చెరువులను మేజర్, మీడియం ఇరిగేషన్ ప్రాజెక్టులతో కాళేశ్వరం ప్రాజెక్టును అనుసంధానం చేస్తున్నామని అన్నారు. వర్షాభావ సంవత్సరాల్లో కూడా చెరువులను నింపాలని ప్రభుత్వం భావిస్తున్నదని అన్నారు. గతంలో మిషన్ కాకతీయపై కొన్ని సంస్థలు, విశ్వ విద్యాలయాలు పరిమితులతో కూడిన అధ్యయనాలు చేశాయని , కానీ ప్రస్తుతం ఇక్రిసాట్ ద్వారా సమగ్ర అధ్యయనం చేయించాలని ప్రభుత్వం భావించి ఆహ్వానించిందని అన్నారు. ఇటువంటి అధ్యయనాలు చేయడంలో ఆ సంస్థకు అనుభవం ఉన్నదని, గతంలో రూపొందించిన నివేదికలు మిషన్ కాకతీయ చాలా ఉపయోగపడ్డాయని అన్నారు. రెండేళ్ళ పాటు రాష్ట్రంలో అధ్యయనం తర్వాత సూచనలు, సలహాలతో ప్రభుత్వానికి నివేదిక అందజేస్తుందని మంత్రి పేర్కొన్నారు.ఇక్రిశాట్‌తో ఒప్పందం కుదుర్చుకునే కార్యక్రమం లో మైనర్ ఇరిగేషన్ చీఫ్ ఇంజనీర్ శ్యాం సుందర్, ఓఎస్‌డి శ్రీధర్ రావు దేశ్‌పాండే , మైనర్ ఇరిగేషన్ డిప్యూటి చీఫ్ ఇంజనీర్ అజయ్ కుమార్, ఇక్రిశాట్ డెవలప్ మెంట్ సెంటర్ అధిపతి శ్రీనాథ్ దీక్షిత్, కమ్యునికేషన్ విభాగం అధిపతి జయశ్రీ బాలసుబ్రమణ్యన్‌లు పాల్గొన్నారు.