Home ఎడిటోరియల్ గ్రామాన్ని అధ్యయనం చేయాలి

గ్రామాన్ని అధ్యయనం చేయాలి

                           Villages

గ్రామాన్ని ఆయా గ్రామాల్లోని పెద్దలు, విద్యావంతు లు, యువకులు తమకు తామే అధ్యయనం చేయాలి. ‘మీ ఊరిని మీరే అధ్యయనం చేయండి’ అనే పేరుతో 2006లోనే ఒక పుస్తకం వెలువడింది. అలాంటి విశ్లేషణను, పరిశీలనను మరింత ముందుకు తీసుకు పోవాలి.
సేకరించాల్సిన ముఖ్యాంశాలు వాటి ద్వారా విశ్లేషణ

1.ఆ గ్రామ జనాభా, 2. కులాలవారీగా జన సంఖ్య, 3. కులాలవారీగా వారు ఉపాధి పొందుతున్న తీరు, 4. వయస్సుల వారీగా కుటుంబంలోని సభ్యుల స్థితి, 5.ప్రతి కులంలో, ప్రతి కుటుంబంలో చదివిన వారు, చదువుకుంటున్న వారు, బాలబాలికల వివరాలు,

1. ఆ గ్రామంలో ఉన్న మొత్తం భూమి, 2. మొత్తం భూమిలో వ్యవసాయ యోగ్యమైన భూమి ఎంత?, 3. అందులో తరి ఎంత?, కుష్కి ఎంత?, 4. రెండు పంటలు పండే భూములు ఎన్ని ఎకరాలు, 5. ఒక పంట పండే చేలు, చెలకలు, పెరండ్లు ఎన్ని?, 6. చెరువులు ఎన్ని?, 7. చెరువు పారకం, ప్రాజెక్టు కెనాల్స్ పారకం ఎన్ని ఎకరాల కు?, 8. బోర్లు ఎన్ని… ఎన్ని ఎకరాలకు? వాటికైన ఖర్చు ఎంత?, 9. పండించే పంటలు ఏవేవి?, 10. తాము తినడా నికి ఉంచుకున్నవి, కూలీలకు ఇచ్చినవి పోగా అమ్ముకున్న పంటలు ఏవేవి? ఎంతెంత?, 11. అమ్మకానికి వచ్చే పంట లే పట్టణాలకు, నగరాలకు, పారిశ్రామిక వాడలకు తిండి పెడతాయి.

ఇంటికో సైకిల్, బర్రె, వంద వనరాజ, గిరిరాజ కోళ్లు ఉంటే అదనపు సంపాదన, జీవన ప్రమాణాలు పెరుగు తాయని కొందరి ప్రతిపాదన. ఇలా ఇంటి పెంపకంలో కోళ్లు, గొర్రెలు, బర్రెలు మొదలైనవి ఎవరెవరికి, ఎన్నెన్ని ఉన్నాయి?
వ్యవసాయంలో ఏయే కులాలకు ఎంతెంత భూమి ఉంది? కుటుంబం వారీగా లెక్కలు తీయాలి. కేవలం వ్యవసాయం మీద ఆధారపడి మరో వృత్తి, ఉపాధి, ఉద్యోగం, ఆదాయం లేకుండా బ్రతుకుతున్న కుటుంబాలు ఎన్ని? అవి ప్రతి కులంలో, కులంవారీగా లెక్కలు తీయాలి.
ఊరిలో ఎన్ని గొర్రెలు, ఎన్ని మేకలు, ఎన్ని ఎడ్లు, ఎన్ని ఆవులు, ఎన్ని బర్రెలు, పోతులు, ఎన్ని కోళ్లు, బాతులు, కుక్కలు, పందులు ఉన్నాయి? ఏయే కులాలకు, ఏయే కుటుంబాలకు ఎన్నెన్ని ఉన్నాయి?

ఎన్ని తాళ్లు, ఎన్ని ఈదులు, ఎన్ని మగ్గాలు, ఎన్ని నాగండ్లు, ఎన్ని ట్రాక్టర్లు, ఎన్ని టీవీలు, ఎన్ని డిష్‌లు, ఎన్ని ఆటోలు, కార్లు, బైక్‌లు, సైకిళ్లు ఉన్నాయి? ఎన్ని మామిళ్లు, ఎన్ని జామచెట్లు, చింతచెట్లు, తుమ్మచెట్లు, బత్తాయి చెట్లు, నిమ్మచెట్లు ఎవరెవరికి ఎన్నెన్ని ఉన్నాయి?
ఏడాదికో గ్రామ సావనీర్

స్కూల్లో ఏడాదికి ఒక సావనీర్ తీసే సంప్రదాయం ఉండేది. ఆయా గ్రామాలలో అధ్యయనం చేసి రికార్డు చేసి వెనకట జిల్లా కలెక్టర్ కార్యాలయంలో రాజపత్రం, గ్రామ రికార్డులు వంటి పేర్లతో రికార్డులు భద్రపరిచే వారు. 1950-60ల్లో తెలంగాణలో భూమి సర్వే రికార్డులు సర్వే నెంబర్లతో రికార్డు చేశారు. దీన్ని మళ్లీ రివ్యూ చేయలేదు. మళ్లీ సేకరించలేదు. పదేళ్లకోసారి భూమి సర్వేలు అవ సరం. గూగుల్ అనే ప్రైవేట్ సంస్థ మూడు నెలలకో సారి భూమి, నగరాలు వివరాలను అప్‌డేట్ చేస్తున్నది. ప్రభుత్వాలు అంతకన్నా వేగంగా రికార్డులు కంప్లీట్ చేయాలి. ప్రతి గ్రామం ఏడాదికొక గ్రామ సావనీర్ వెలువరించాలి.

ఆదర్శగ్రామాలనుండి నేర్చుకోవాల్సిన అంశాలు ఏమిటి?

వరంగల్‌లోని గంగదేవిపల్లిలో ఉన్నదేమిటి? గంగ దేవి పల్లి దేశంలో ఆదర్శంతమైన గ్రామంగా ఎదగడానికి చేసిన కృషి ఏమిటి? మన గ్రామంలో లేనివేమిటి? అలా సాధించడానికి ఏమేం చేయాలి? అలాగే నిజామాబాద్ జిల్లా అంకాపురం రాష్ట్ర వ్యాప్తంగా అత్యధికంగా పంట దిగుబడి తీసే గ్రామం. వారినుండి ఏమేం నేర్చుకోవాలి? అన్నా హజారే రాలేగాంసిద్ధిలో ఉన్నవేమిటి? మన గ్రామంలో లేనిదేమిటి? వాటిలాగ ఎదగడానికి చేయా ల్సిందేమిటి? పరిశీలించాలి. ప్రణాళికలు రచించాలి.

ఒక గ్రామంలో వెయ్యి కుటుంబాలు, ఐదువేల జనాభా ఉందనుకుంటే…

ఉదాహరణకు ప్రతి గ్రామంలో వెయ్యి కుటుంబా లతో ఐదు వేల జనాభా ఉందనుకుందాం. సాధారణంగా ఇలాంటి గ్రామానికి ఒక చెరువు, ఒక కుంట, రెండు వేల ఎకరాల పంట భూమి, ఓ యాభై ఎకరాల బీడు భూమి, ఓ గుట్ట ఉండవచ్చు. గుట్టపై కొంత అడవి పెరగవచ్చు. కొన్నిచోట్ల తునికి ఆకు, బీడీ ఆకు కోసం తెంపే రెండు నెలల కూలి దొరకవచ్చు.

40 శాతం ఆదాయం పొదుపు చేయడం అవసరం

సాధారణంగా జీతంలో, ఆదాయంలో 40 శాతం పొదుపు చేయాల్సి ఉంటుంది. ఇలా పొదుపు చేసిన ఆదాయం ప్లాటు కొనుక్కోవడానికి, ఇల్లు కట్టుకోవ డానికి, పెళ్ళిళ్ళ ఖర్చులకు, అనారోగ్యాలకు, పై చదువుల ఫీజులకు ఉపయోగపడతాయి. ఉపయోగ పడాలి. అందు వల్ల 30 వేల లోంచి 12 వేల రూపా యలు పొదుపు చేయాలి. 18 వేలు నెల నెలా ఖర్చులకు, పండుగలకు, బట్టలకు, ఫీజులకు, తిండికి, ఇన్సూరెన్స్, టీవీ కనెక్షన్, సెల్‌ఫోన్, బైక్ మెయింటెనెన్స్, పెట్రోల్ వాటన్నిటికి ఖర్చు పెట్టాలి. ఇందులోనే తల్లిదండ్రులకు కూడా ఖర్చు పెట్టాలి. ఈ రీత్యా చూసినప్పుడు 18 వేలలో ఐదో వంతు ఉద్యోగి ఖర్చు పెట్టాలి. అనగా నెలకు 3500 మాత్రమే ఖర్చు పెట్టు కోవాలి. అనగా సంపాదించే నెలవారీ సంపాదనలో సుమారు 12 శాతం మాత్రమే ఖర్చు పెట్టుకోవాలి. మహా అయితే 20 శాతం వరకు సంపాదించే మగవాళ్ళు ఖర్చు పెట్టుకోవచ్చు. అనగా నెలకు 6 వేలు ఖర్చు పెట్టుకోవచ్చు. అన్ని ఖర్చులు అందులోనే. ఇలా 18 వేలల్లో 6 వేలు స్వంతానికి ఖర్చు పెట్టుకొని 12 వేలు కుటుంబానికి కేటా యించాలి. ఇది ఒక సగటు లెక్క. ఇంతకన్నా బ్యాలన్సు తప్పిన ఖర్చు కుటుంబాన్ని అతలాకుతలం చేస్తుంది. సామాజిక సంపద, ఉత్పత్తి, అతలాకుతలం అవుతుంది.
ఈ రీత్యా గ్రామీణ కుటుంబాలను అధ్యయనం చేయాలి. ఇంటిలోని స్త్రీలు సంపాదించే ఆదాయం ప్రత్యే కంగా లెక్కించాలి. అది సాధారణంగా పిల్లల చదువుల కు, చీరలకు, బంగారం కొనడానికి, పండుగలకు ఉపయోగపడవచ్చు. లేదా మరో రీత్యా మొత్తం కుటుంబా నికి ఉపయోగపడవచ్చు. దీన్ని కూడా ప్రత్యేకంగా స్త్రీ, పురుష ఆదాయాలు వేరుగాను, వాటిని ఎవరెవరు దేని దేనికి ఖర్చు చేస్తున్నారో, సంపాదించే ఆదాయంపై అధికారం ఎవరిది అనేది కూడా లెక్కించాలి.

వెయ్యి కుటుంబాల్లో ఉపాధి దొరుకుతున్నది ఎంత మందికి?

నమూనా గ్రామంలో ఉండే వెయ్యి కుటుంబాల్లో 450 కుటుంబాలు వ్యవసాయం పై ఆధారపడి బతుకు తాయి. మిగతావారు ఆయా వృత్తులు చేసుకుంటూ కొంత వ్యవసాయం, ఆసరాతో బతుకుతుంటారు. కొత్త వృత్తులైన హోటల్, కిరాణా షాపు, సైకిల్ ట్యాక్సీ, ఆటో, ఇటుక బట్టీలు, ట్రాక్టర్ కిరాయి, ప్రైవేటు స్కూలు, కరెంటు మోటర్ల రిపేరు, మెకానిక్‌లు, భవన నిర్మాణ మేస్త్రీలు, కూలీలు మొదలైన వృత్తులతో కొంత ఆదాయం పొందుతారు.

చేతి వృత్తి కులాలు పొందుతున్న ఉపాధి

గ్రామంలో వడ్రంగం, చేనేత, కల్లుగీత, గొర్రెల పెంపకం, చేపల పెంపకం, రజక, నాయీ బ్రాహ్మణ తదితర సేవా వృత్తుల ద్వారా కొంత ఆదాయం పొందు తుంటారు. ఇలా చూసినప్పుడు గ్రామంలో వ్యవసాయం పూర్తిగా 30 శాతం జనాభాకు ఉపాధి కల్పిస్తుంది. మిగతావారిలో 20-30 శాతం ప్రత్యక్షంగా, పరోక్షంగా వ్యవసాయంతో ఆసరా పొందుతారు. ఉపాధి లభిస్తుంది. వెయ్యి కుటుంబాల్లో నేడు కనీసం 450 కుటుంబాలు సరియైన ఆదాయం లేక పాత వృత్తులు గిట్టుబాటు కాక, వ్యవసాయంపై ఆధారపడలేక, వ్యవసాయభూమి లేక, పాతవృత్తులు చేయలేక, వలసబాట పడుతున్నారు. పట్టణాలకు, నగరాలకు, పారిశ్రామిక వాడలకు, గల్ఫ్ దేశాలకు వలసబాట నడుస్తున్నది.

40 శాతం జనాభాకు ఉపాధి కల్పన, జీవన ప్రమాణాల పెరుగుదల కోసం నైపుణ్యాల శిక్షణ

ఇలా 40 శాతం జనాభాకు ఆధునిక జీవన ప్రమాణా లకు అనువుగా ఉపాధి కల్పన, సంపద సృష్టి, అవకాశాలు పెంచాలి. అప్పుడే గ్రామం నుండి వలసలు ఆగిపోతాయి. ఒక్కమాటలో చెప్పాలంటే 40 నుండి 55 శాతం జనాభా ప్రతి గ్రామంలో నిరుద్యోగులుగా ఉపాధి అవకాశాలు లేక సంపద సృష్టించే అవకాశాలు మృగ్యమై పోతున్నాయి. ప్రపంచీకరణ ఈ స్థితిని మరింత దుస్థితికి నెట్టివేసింది. ఈ దశను అర్థం చేసుకొని ఆయా కులాల కులవృత్తులను ఆధునీకరించడం, ఉపాధి కల్పించడం, అందుకు అవసర మైన పెట్టుబడి, నైపుణ్య సహకారం, టెక్నాలజీ అందిం చడం, నూతన వృత్తులు చేపట్టడంలో శిక్షణ, మార్కెటింగ్ అవకాశాలు పెంచడం ద్వారా స్థానిక ఉత్పత్తులను, సేవల ను ఉపయోగించు కోవడం ద్వారా అందరికీ ఉపాధి కల్పించే అవకాశాలు పెరుగు తాయి. గ్రామం పునాదిగా సామాజిక శావేత్తలు, అర్థశావేత్తలు, పార్టీలు ఈ కోణాల్లో ఆలోచిస్తే అనేక కొత్త కోణాల వెలికి వస్తాయి. నూతన ప్రణాళికలు రూపుదిద్దుకుంటాయి.
* ఎ.బి.ఆనంద్