Home దునియా సప్తవర్ణ శోభితం తిరుప్పురకుండ్రం

సప్తవర్ణ శోభితం తిరుప్పురకుండ్రం

Subramanyeswar

 

“శక్తిహస్తం విరూపాక్షమ్ శిఖివాహమ్ షడాననమ్
దారుణం రిపురోగఘ్నం భావయే కుక్కుట ధ్వజం”
ఏ నామం పలికితే అనంతమైన శక్తి జనిస్తుందో, ఏ నామాన్ని ఉచ్చరిస్తే ఆత్మవిశ్వాసం ఇనుమడిస్తుందో ఆ నామమే సుబ్రహ్మణ్య నామం. సుబ్రహ్మణ్యేశ్వరుడిగా, మురుగన్‌గా, కార్తికేయుడిగా భక్తులచే నీరాజనాలందుకుంటున్న ఆ స్వామి శక్తి ప్రదాత. అడిగిందే తడవుగా అన్నీ ప్రసాదించే అపారకరుణా సముద్రుడు. సాక్షాత్తు శివపార్వతుల ముద్దుల తనయుడిగా, అయోజనుడిగా కొలుపులందుకుంటున్న సుబ్రహ్మణ్యేశ్వరుడు కొలువుదీరని క్షేత్రంగానీ, ప్రాంతం గానీ లేదంటే అతిశయోక్తి కాదు. ఆ స్వామి కొలువుదీరిన అపురూప క్షేత్రమే తిరుప్పుర కుండ్రం. తమిళనాడు రాష్ట్రం మదురై నగరానికి సుమారు ఎనిమిది కిలోమీటర్లు దూరంలో ఉన్న ఈ దివ్యక్షేత్రంలో స్వామి దేవసేన అమ్మవారి సహితంగా కొలువుదీరాడు.

ప్రశాంతమైన వాతావరణం, ప్రకృతి అందాలకు నెలవుగా ఉన్న ఈ దివ్యాలయం ఓ గుహాలయం. నిలుచున్న ఏనుగు ఆకారంలో ఉన్న కొండమీద వెలసిన ఆలయమిది. ఓ అనితర సాధ్యమైన అనుభూతులను సొంతం చేసే దివ్యాలయమిది. తమిళనాడులోని ఆరు సుబ్రహ్మణ్య క్షేత్రాలలో అగ్రగణ్యమైనదిగా విరాజిల్లుతున్న దివ్య క్షేత్రం తిరుప్పురకుండ్రం. తిరుప్పురకుండ్ర ఓ చిన్ని గ్రామం. మదురై జిల్లాలో ఉన్న ఈ దివ్యక్షేత్రంలోని ఈ ఆలయం దేశంలోనే ప్రఖ్యాతమైన మురుగన్ ఆలయంగా ఖ్యాతికెక్కింది.

తమిళ ప్రజలకు సుబ్రహ్మణ్యేశ్వరుడు ఆరాధ్యనీయుడు. ఆ స్వామిని వారు మురుగన్ అని భక్తితో పిలుచుకుంటారు. కుండ్రం అంటే కొండ అని అర్ధం. నిలుచున్న ఏనుగు ఆకారంలో ఉన్న కొండ గుహలో స్వామి వారు దేవసేన అమ్మవారి సహితంగా వెలిశారు కనుక ఈ క్షేత్రానికి తిరుప్పురకుండ్రం అని పేరొచ్చింది. ఓ అపురూపమైన ఆధ్యాత్మికానందాన్ని సొంతం చేసే ఈ దివ్యాలయ రాజగోపురం అల్లంత దూరం నుంచే దృశ్యమానమవుతుంది. వివిధ దేవీదేవతల సమన్విత శిల్పాలతో, సప్తవర్ణ శోభితంగా ఇది దర్శనమిస్తుంది.

ఈ ఆలయానికి సమీపంలో పుష్కరిణి ఉంది. ప్రశాంతమైన వాతావరణం, ప్రకృతి అందాలు వేదికగా ఉన్న ఈ పుష్కరిణి జలాలు అత్యంత మహిమగలవని భక్తులు చెబుతారు. దేశంలోని అతి పవిత్రమైన నదులన్నీ ఈ పుష్కరిణి జలాల్లో కలుస్తాయని ఇక్కడి స్థల పురాణాల ద్వారా తెలుస్తోంది. ఆ కారణంగా ఇక్కడ స్నానం, జపం వల్ల అనంతమైన పుణ్యఫలాలు సొంతమవుతాయంటారు. పుష్కరిణి మధ్య భాగంలో నెమలి మండపం కానవస్తుంది. స్వామి వారికి ఏటా జరిగే తెప్పోత్సవాలను ఈ పుష్కరిణిలో నిర్వహిస్తారు.

తిరుప్పుర కుండ్రం శ్రీసుబ్రహ్మణ్యేశ్వర స్వామి ఆలయం ఒక గుహాలయం. ఒకప్పుడు ఇది జైనుల గుహగా ఉండేది. ఆరవ శతాబ్దానికి ముందు ఈ గుహాలయం జైన సన్యాసులు ఆధ్యాత్మిక కేంద్రంగా ఉండేదని, అయితే అనంతరం వచ్చిన పాండ్యన్ రాజు కూన్ పాండ్యన్ నేతృత్వంలో జైనాలయాన్ని హిందూ ఆలయంగా మార్పు చేసినట్లు ఇక్కడి ఆధారాలు చెబుతున్నాయి. 8వ శతాబ్దంలో వచ్చిన నాయకన్ రాజుల ఆధ్వర్యంలో ఈ ఆలయ అభివృద్ధి చెందినట్లు ఇక్కడి ఆధారాల ద్వారా అవగమవుతోంది.

ఈ ఆలయాన్ని మదురై మీనాక్షి అమ్మవారి ఆలయానికి పూర్వం నాటిదని చెబుతారు. సంగం రాజుల కాలం నుంచీ ఈ ఆలయం జన బాహుళ్యంలోకి వచ్చినట్లు ఇక్కడి ఆధారాల ద్వారా తెలుస్తోంది. తమిళనాట ప్రముఖ కవిసార్వభౌముడు నక్కిరన్ స్వామి వారి అచంచల భక్తుడు. నిత్యం స్వామి వారి సేవలో తరించేవాడు. నక్కిరన్ ఈ క్షేత్రాన్ని తిరుముట్టుపడై అని పిలిచేవాడు. ఆయన ఇక్కడ అనేక పాశురాలు గానం చేశాడు.

ఈ ఆలయ ముఖమండపంలో అద్భుతమైన శిల్పసహిత స్తంభాలు దర్శనమిస్తాయి. పార్వతిమాత, నృత్యగణపతి, మహేశ్వరుడు, దుర్గ, విష్ణువు, మహాలక్ష్మి, రాణిమంగమ్మాల్, కవి పండితుడు నక్కిరన్, శివతాండవ దృశ్యం, శివుడు వృషభవాహనంపై ఎక్కి నాట్యం చేస్తున్న దృశ్యంతో పాటు అనేక శిల్పాలు దర్శనమిస్తాయి. ఇదే ప్రాంగణంలో మరో పక్క కర్పణ స్వామి మందిరం ఉంది. తిరుప్పురకుండ్రం శ్రీ సుబ్రహ్మణ్యేశ్వర స్వామి వారి ఆలయానికి క్షేత్రపాలకుడు కర్పణ స్వామి.

ఆలయానికి రెండో ప్రాకారంలో ధ్వజస్తంభం దర్శనమిస్తుంది. స్వర్ణమయ కాంతులీనే ఈ ధ్వజస్తంభం పంచలోహ సమన్వితంగా దర్శనమిస్తుంది. ధ్వజస్తంభానికి కుడివైపున స్వామి వారి ఉత్సవమూర్తుల మందిరం ఉంది. ఈ మందిరంలో సుబ్రహ్మణ్యేశ్వరుడు దేవసేన అమ్మవారితో సహా కొలువుదీరాడు. ఒక చేతిలో దండాయుధపాణిని ధరించి, అభయ వరద హస్తంతో పంచలోహ విగ్రహ రూపంగా దర్శనమిస్తాడు. స్వామి వారి పక్కన అమ్మవారు కొలువుదీరారు. ఇదే ప్రాంగణంలో వివిధ దేవతా శిల్పాలు దర్శనమిస్తాయి. గర్భాలయానికి ముందు భారీ సైజులో ఉన్న నంది కానవస్తుంది. మనోహరమైన శిలగా కొలువుదీరిన ఈ నందికి పక్కగా ఓ పక్క సుబ్రహ్మణ్యేశ్వరుడి వాహనం నెమలి, మరో పక్క వినాయకుడి వాహనం ఎలుకలు దర్శనమిస్తాయి. వీటిని దర్శించుకున్న భక్తులు మెట్ల మీదుగా గర్భాలయంలోకి చేరుకుంటారు.

ఇక్కడ స్వామి వారు కొలువై ఉండడానికి పురాణగాధ ఒకటి ప్రచారంలో ఉంది. సూరపద్మ అనే రాజు వర మదాంధుడై దేవతలను విపరీతంగా హింసించ సాగాడు. ఒకానొకప్పుడు సూరపద్మ దేవలోకానికి వెళ్ళి దేవేంద్రుడి భార్య ఇంద్రాణిని తన సొంతం చేసుకోవాల నుకుంటాడు. దీంతో దేవేంద్రుడు సుబ్రహ్మణ్యేశ్వరుడ్ని శరణు వేడగా, ఆ స్వామి సూరపద్మతో ఘోర యుద్ధం చేసి అతన్ని మట్టుబెడతాడు. దీనికి సంతోషించిన దేవేంద్రుడు తన కూతురు దేవయానినిచ్చి సుబ్రహ్మణ్యేశ్వరుడికి వివాహం జరిపిస్తాడు. కార్తికేయుడు, దేవయానిని వివాహమాడిన ప్రదేశమే తిరుప్పురకుండ్రంగా ఇక్కడి స్థల పురాణాల ద్వారా అవగతమవుతోంది.

ఇతర ఆలయాలకు మల్లే కాకుండా స్వామి వారి గర్భాలయం వైవిధ్యంగా ఉంటుంది. గర్భాలయం ఓ గుహాలయం. అత్యంత చీకటిగా ఉండే ఈ గర్భాయలంలో ముందుగా విఘ్నేశ్వరుడి భారీ మూర్తి ఉంది. ఈ ప్రాంగణంలోకి ప్రవేశించిన భక్తులు ముందుగా విఘ్న వినాయకుడ్ని దర్శించుకుంటారు. వినాయకుడికి కొంచెం సమీపంలో దుర్గా మాత దర్శనమిస్తుంది. గణపతికి కుడివైపున మహేశ్వర లింగం కానవస్తుంది.

శివ పరివార గణానికి నిలయమైన ఈ ప్రాంగణంలో మరో పక్క సుబ్రహ్మణ్యేశ్వర స్వామి దర్శనమిస్తారు. దేవసేన అమ్మవారి సహితంగా కానవచ్చే ఆ స్వామి దర్శనం పూర్వ జన్మలపుణ్యఫలంగా భక్తులు భావించి నీరాజనాలర్పిస్తారు. సాక్షాత్తు శివతత్వానికి నిదర్శనంగా దర్శనమిచ్చే గర్భాలయ ప్రాంగణానికి సమీ పంలో మరో పక్క లక్ష్మీకుండం ఉంది. స్వామివారి ఆల యానికి వెనుకవైపున ఆది సుబ్రహ్మణ్యేశ్వర స్వామి వారి ఆలయం ఉంది. ఈ ఆలయంలో పరమేశ్వరుడు, పంచ లింగాలు, సప్తమాతృకలు, సుబ్రహ్మణ్యేశ్వరుడు దర్శనమి స్తారు. ఇక్కడే మరో పక్క రావి వృక్షం కింద పెద్ద పుట్ట ఉంది.

ఇక్కడే నాగ సర్పాలు శిల్పరూపంలో భక్తులకు దర్శనమిస్తాయి. అలాగే ఇక్కడే రామలింగేశ్వరుడు దర్శనమిస్తాడు. రామలింగేశ్వరుడి దర్శనం సకలపాపహ రణం. స్వామి వారి ఆలయానికి సమీపంలో గుహాలయం ఉంది. ప్రశాంతమైన వాతావరణం, ప్రకృతి అందాల నేపథ్యంగా అలరారుతున్న ఈ గుహాలయంలో మనోహ రమైన శిల్పాలు దర్శనమిస్తాయి. కొండపై భాగంలో సుబ్రహ్మణ్యేశర ఆలయం, పరమేశ్వరాలయం దర్శనమిస్తా యి. ఆయా ఆలయాలకు చేరుకోవడానికి విధిగా ఆలయా నికి వెనుకవైపు నుంచి మెట్లు నిర్మించారు. దాదాపు 800 మెట్లను దాటుకుని వెళితే కొండపై భాగానికి చేరుకోవచ్చు.

ఎలా చేరుకోవాలి?

ఓ అపురూపమైన ఆధ్యాత్మికానందాన్ని సొంతం చేసే ఈ దివ్యాలయాన్ని చేరుకోవడానికి తమిళనాడు రాష్ట్రంలోని మదురై వరకు వచ్చి అక్కడ నుంచి ఏదైనా వాహనంలో చేరుకోవచ్చు.

                                                                                              – దాసరి దుర్గాప్రసాద్
Subramanyeswar is worshiper of Tamil people