Home తాజా వార్తలు సబ్సిడీ గొర్రెల పంపిణీ పథకం దేశంలోనే అమోఘం

సబ్సిడీ గొర్రెల పంపిణీ పథకం దేశంలోనే అమోఘం

Talasani Srinivas Yadav
మన తెలంగాణ/యాచారం: బడుగు బలహీన వర్గాల అభ్యున్నతే ప్రభుత్వ ధ్యేయమని రాష్ట్ర పాడి పరిశ్రమ, పశు సంవర్థక శాఖ మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ అన్నారు. యాచారం మండలంలోని చింతపట్ల గ్రామంలో మంగళవారం గొర్రెలకు, మేకలకు నట్టల నివారణ మందు, పశువులకు దాణా పంపిణీ కార్యక్రమాన్ని స్థానిక ఎమ్మెల్యే మంచిరెడ్డి కిషన్‌రెడ్డితో కలిసి ఆయన ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ 75శాతం సబ్సిడీతో గొల్ల, కుర్మలకు అందజేస్తున్న సబ్సిడీ గొర్రెల పంపిణీ కార్యక్రమం దేశంలోనే అమోగమని, అది వారికి మంచి జీవనాధారమని మంత్రి కితాబిచ్చారు. ప్రభుత్వం గొల్ల, కుర్మల అభివృద్ధికి ప్రవేశపెడుతున్న సంక్షేమ పథకాలను సద్వినియోగం చేసుకోవాలని సూచించారు. సిఎం కెసిఆర్ బడుగు బలహీన వర్గాల అభివృద్ధే లక్షంగా ముందుకు సాగుతున్నారని పేర్కొన్నారు. పల్లెలు, తండాలలో మౌళిక సదుపాయాల కోసం ప్రభుత్వం వేల కోట్ల రూపాయలు ఖర్చుచేస్తుందని తెలిపారు. గతంలో ఏడాదికి రెండుసార్లు జీవాలకు నట్టల మందుల పంపిణీ జరిగేదని వాటి ఎదుగుల బాగా ఉండాలని ప్రస్తుతం మూడు సార్లు డీవార్మింగ్ చేపడుతున్నట్లు పేర్కొన్నారు.

పశువులకు కూడా ఆధార్ కార్డులు అందజేసి వాటి ఆధారంగా నాణ్యమైన వైద్య సేవలు అందించనున్నట్లు మంత్రి వెల్లడించారు. జీవాలకు అంబులెన్స్ సౌకర్యం కల్పించామని 1962 టోల్ ఫ్రీ నెం.కు ఫోన్ చేసి వైద్య చికిత్సలు పొందవచ్చని పశు యజమానులకు తెలియజేశారు. రాబోయే రోజులలో గ్రామీణ ప్రాంతాల్లోని పశువైద్య శాలలను ఆధునీకరించి, ఎన్‌ఆర్‌జిఎస్ పథకం ద్వారా షెడ్లు, నీటి తొట్లు ఏర్పాటు చేస్తామని వివరించారు. ఇప్పటికే 75శాతం సబ్సిడీపై గొర్రెలు, గడ్డి విత్తనాలు ఇస్తున్నట్లు తెలిపారు. సబ్సిడీపై ఇచ్చిన గొర్రెలు ఒకవేళ చనిపోయినట్లయితే దాని స్థానంగా మరో గొర్రెను అబ్ధిదారుడికి ఇవ్వనున్నట్లు మంత్రి పేర్కొన్నారు. వర్షాలకు ముందే జీవాలకు నట్టల నివారణ మందు వేసినట్లయితే అవి రోగనిరోధక శక్తి పెంచుకొని మంచి ఎదుగుదల ఉండి రైతుకు మంచి లాభదాయకంగా ఉంటుందని అన్నారు. ఎమ్మెల్యే మంచిరెడ్డి కిషన్‌రెడ్డి మాట్లాడుతూ.. మూగజీవాలకు తప్పకుండా నట్టల నివారణ మందులు వేయించాలని దీంతో సీజనల వ్యాధులు రాకుండా వాటిని కాపాడుకోవచ్చని తెలిపారు.

వర్షాకాలంలో జీవాలకు వచ్చే వ్యాధుల పట్ల అప్రమత్తంగా ఉండాలని ఆయన పేర్కొన్నారు. సబ్సిడీపై అందజేసిన గొర్రెలకు, మేకలకు మందులు, దాణా అందజేస్తున్నట్లు జీవాల యజమానులకు వివరించారు. ఈ కార్యక్రమంలో పశుసంవర్థక శాఖ ప్రిన్సిపల్ సెక్రటరీ సందీప్‌కుమార్ సుల్తానియా, ఎండి లక్ష్మరెడ్డి, సిఇఒ మంజువాణి, జెడి కెఎల్ నర్సింహ్మరావు, ఆర్డీఓ అమరేందర్,స్థానిక తహసీల్దార్ పుష్పలత, ఎంపిడిఒ వినయ్‌కుమార్, ఎంపిపి వడ్తావత్ రజితరాజూనాయక్, జడ్పీటీసీ కర్నాటి రమేష్‌గౌడ్,పిఎసిఎస్ చైర్మన్ సుదర్శన్‌రెడ్డి,స్థానిక సర్పంచ్ లిక్కి సరితారెడ్డి,మాజీ సర్పంచ్ ఎ.మల్లకార్జున్,తలారి మల్లేష్‌తో పాటు వివిధ గ్రామాల ప్రజాప్రతి నిథులు,సంబందిత అధికారులు,జీవాల యజమానులు తదితరులు పాల్గొన్నారు.

subsidy sheep distribution scheme in Telangana