Home వార్తలు విజయమే తరువాయి

విజయమే తరువాయి

a

దక్షిణాఫ్రికా లక్షం 310  ప్రస్తుతం 32/2

తొలిఇన్నింగ్స్‌లో 79 పరుగులకే చాపచుట్టేసిన సఫారీలు
రాణించిన అశ్విన్, జడేజా భారత్ రెండో ఇన్నింగ్స్ 173

నాగ్‌పూర్ : మూడోటెస్టులో టీమిండియా విజయానికి చేరువైంది. బంతి గింగరాలు తిరుగుతున్న పిచ్‌పై కోహ్లిసేన నిర్దేశించిన 310 పరుగుల భారీ లక్షానికి దిగిన దక్షిణాఫ్రికా రెండోరోజు ఆటముగిసే సమయానికి 14 ఓవర్లలో 32/2తో నిలిచింది. మరో మూడు రోజులు మిగిలి ఉన్న ఆటలో దక్షిణాఫ్రికా విజయానికి ఇంకా 278 పరుగులు అవసరమవగా, భారత్‌కు 8 వికెట్లు కావాలి. అంతకుముందు స్పిన్ ద్వయం అశ్విన్(5/32), జడేజా (4/33) మ్యాజిక్‌కు దక్షిణాఫ్రికా 33.1 ఓవర్లలో 79 పరుగులకే కుప్పకూలింది. జట్టులో డుమిని (35) టాప్‌స్కోరర్ కాగా, స్పిన్నర్ హర్మర్(13), డుప్లెసిస్(10) రెండంకెళ స్కోరు నమోదుచేసిన బ్యాట్స్‌మెన్‌లు. అనంతరం రెండో ఇన్నింగ్స్‌కు దిగిన భారత్ 46.3 ఓవర్లలో 173 పరుగులకు ఆలౌటైంది. జట్టులో ఓపెనర్ ధావన్(39), పుజారా(31) కీలక ఇన్నింగ్స్‌లు ఆడారు. తాహీర్(5/38), మోర్కెల్(19) రాణించారు.
అలా వచ్చి ఇలా..
ఓవర్‌నైట్ స్కోరు 11/2తో రెండో రోజు తొలి ఇన్నింగ్స్ కొనసాగించిన దక్షిణాఫ్రికాను భారత స్పిన్ ద్వయం అశ్విన్, జడేజా బెంబేలెత్తించారు. రెండోరోజు ఇన్నింగ్స్ తొలి ఓవర్ ఐదోబంతికే ఓవర్‌నైట్ బ్యాట్స్‌మన్ ఎల్గర్(7)ను క్లీన్‌బౌల్డ్ చేసి దక్షిణాఫ్రికా పతనానికి శ్రీకారం చుట్టిన అశ్విన్ తన రెండోఓవర్ తొలిబంతికే ఆమ్లా(1)ను అవుట్ చేశాడు. ఇక మరుసటి ఓవర్‌లోనే ప్రమాదకర డివిల్లియర్స్(0)ను జడేజా రిటర్న్ క్యాచ్‌తో పెవిలియన్‌కు చేర్చడంతో దక్షిణాఫ్రికా 12 పరుగులకే ఐదు వికెట్లు కోల్పోయింది. ఇక డుప్లెసిస్(10) జతగా డుమిని(35) వికెట్ల పతనాన్ని కొద్దిసేపు అడ్డుకున్నాడు. ఆరోవికెట్‌కు 23 పరుగులు జోడించిన తరువాత స్వల్పవ్యవధిలో డుప్లెసిస్, విలాస్ క్రీజు వదిలినా స్పిన్నర్ హర్మర్(13)తో కలిసి జట్టును ఆదుకునే ప్రయత్నం చేశాడు డుమిని. ఓ ఏడు ఓవర్లు పాటు భారత్‌కు వికెట్ దక్కకపోయినా హర్మర్‌ను అశ్విన్ క్లీన్‌బౌల్డ్ చేయడంతో మరో నాలుగు ఓవర్లకే దక్షిణాఫ్రికా తొలి ఇన్నింగ్స్ ముగిసింది.
ఆదుకున్న ధావన్, పుజారా
సఫారీలను తక్కువ స్కోరుకే కుప్పకూల్చి రెండో ఇన్నింగ్స్‌కు దిగిన భారత్‌కు ఆదిలోనే షాక్ తగిలింది. ఫామ్‌లో ఉన్న విజయ్(5) జట్టుస్కోరు ఎనిమిది పరుగులుకే పెవిలియన్ చేరాడు. అయితే ధావన్(39), పుజారా(31) జట్టును ఆదుకున్నారు. ఇద్దరూ ధాటిగా ఆడుతూ బౌండరీలు బాదడంతో భారత్ ఆధిక్యం 200లకు చేరింది. అయితే పుజారాను డుమిని అవుట్ చేయడంతో భారత్ వికెట్ల పతనం వేగంగా సాగింది. సఫారీ స్పిన్నర్ తాహీర్ విజృంభించడంతో స్వల్ప విరామాల్లో వికెట్లు కోల్పోయిన భారత్ 173 పరుగులకే ఆలౌటైంది. కోహ్లి(16), రహానె(9), రోహిత్(23), సాహా(7) విఫలమయ్యారు.
మళ్లీ మొదలెట్టారు
భారీ లక్షఛేదనకు దిగిన దక్షిణాఫ్రికాను భారత స్పిన్నర్లు మళ్లీ దెబ్బతీశారు. ఏడు ఓవర్ల పాటు క్రీజులో నిలిచిన ఓపెనర్ వాన్‌జిల్(7)ను అశ్విన్ పెవిలియన్‌కు చేర్చితే నైట్‌వాచ్‌మెన్‌గా వచ్చిన ఇమ్రాన్‌తాహీర్(8)ను వికెట్ల ముందు దొరకబుచ్చుకున్నాడు. అయితే మరో ఓపెనర్ ఎల్గర్(10), కెప్టెన్ ఆమ్లా(3) మూడు ఓవర్లు పాటు ఓపిగ్గా బ్యాటింగ్ చేసి మరో వికెట్‌పడకుండా రెండోరోజును ముగించారు.