Home కెరీర్ పక్కా ప్రణాళికతోనే విజయం!

పక్కా ప్రణాళికతోనే విజయం!

kereer

జీవితం ఎంతగానో మారిపోతోంది. సామాజిక జీవితంలో ప్రాధాన్యతలు మారిపోతు న్నాయి. వేగం పెరిగిపోతోంది. చదువుల్లో విద్యార్థి, ఉద్యోగ ప్రయత్నాలలో యువత, ఉద్యో గాల్లో ఒత్తిడితో కూడిన  బాధ్యతల్లో ఉద్యోగులు నలిగిపోతున్నారు. పెరుగుతున్న ఆర్ధిక భారాలు, వృత్తిగతంగా, వ్యక్తిగతంగా చేయవలసిన పనుల్లో కుదరని సమన్వయం, ఉమ్మడి కుటుంబాల విచ్ఛిన్నం, ఇలా అనేక కారణాలవల్ల బతుకు ముఖచిత్రం మారిపోతోంది. ఎవరి జీవితానికి వారే భరోసాగా నిలవాల్సివస్తోంది. ఇంత హడావుడి జీవితంలోనూ చేయవలసిన  పనుల్లో ప్రాధాన్యతలు ఏర్పాటు చేసుకుంటే ఎంతో కొంత పనిభారం తేలికవుతుంది. 

పెద్దలైనా, పిల్లలైనా, యువతైనా అనుకున్న పనులు సక్రమంగా, సమర్ధవంతంగా పూర్తి చేసి అనుకున్న లక్ష్యాన్ని సాధించాలంటే ఏది? ఎప్పుడు? ఎక్కడ ఎలా? అనే ప్రాధాన్యతలు (Priorities) ఏర్పాటు చేసుకోవాలి. ఈ ప్రాధాన్యతల వల్ల చేయబోయే పనులపట్ల ఒక స్పష్టత ఏర్పడి ఎటువంటి గందరగోళానికి ఆస్కారం లేకుండా అనుకున్నపనిని విజయవంతంగా పూర్తి చేయొచ్చు.
ఒక క్రమ పద్ధతిలో చేయవలసిన పనులను ఆచరణలో పెడితే పని ఫలితం కచ్చితంగా సానుకూలంగా ఉంటుంది. ప్రాధాన్యతల ప్రకారం పనులు ఆచరణలో పెట్టడం వల్ల చేసే పనిలో ఎటువంటి తొట్రుపాటూ,కంగారు లేకుండా ప్రశాంతంగా పని పూర్తి చేయవచ్చు. అందుకే జీవితంలో ఏ పనిలో నైనా ప్రాధాన్యతలు (Prioties) అనేవి చాలా అవసరం.
ఇందులో చిన్న పనైనా పెద్ద పనైనా ఒకటే. ఒక వ్యక్తి ఒక రోజులో అనేక పనులు చేయవలసి ఉంటుంది లేదా హాజరు కావాల్సిఉంటుంది. దీన్నే మల్టీటాస్క్ చేజింగ్ (multi task chaging)అంటారు. ఏ పని ముందు ఏ పని తర్వాత అనే ప్రాధాన్యతల వలన అనుకున్న పనులు సక్రమంగా పూర్తి చేయవచ్చు. మన రోజువారీ జీవితంలో దీనికి సంబంధించి ఎందరో వ్యక్తులు తారసపడుతుంటారు. వారిని జాగ్రత్తగా గమనిస్తే ప్రాధాన్యతల విలువేమిటో మనకు తెలుస్తుంది. కొందరు వ్యక్తులు అనవసరంగా కంగారుపడి, హడావుడిపడి, పెద్దగా ఒత్తిడి పెంచుకుని పనులన్నీ కలగాపులగం చేస్తూ చివరికి ఏ పనిని సక్రమంగా పూర్తి చేయలేరు. ఫలితంగా నిరాశ..నిస్పృహ. అందువల్ల చిన్నతనంతో తమని తాము తక్కువ చేసుకుంటారు. ప్రాధాన్యతలు ఏర్పాటు చేసుకొనే వారికి విజయం నల్లేరు మీద బండి నడక! ఈ మధ్య కాలంలో IAS, IPS, CA, IIT వంటి పోటీ పరీక్షలలోనైనా, ఆటల్లోనైనా టాపర్స్ అయిన వారిలో ఎవరిని కదిలించినా వారందరూ దాదాపుగా చెప్పే విషయం ఒక్కటే..‘చేయవలసిన పనుల్లో ప్రాధాన్యతలు ఏర్పాటు చేసుకోవటం వల్లనే విజయం పొందామని’! అందరూ కష్టపడతారు కానీ విజయం కొందరే సాధిస్తుంటారు. దానికి ప్రధాన కారణం ప్లానింగ్. ప్లానింగ్ పక్కాగా ఉంటే విజయం ఖాయం. తేడా ఉంటే ఫలితం అటుఇటు అయ్యే అవకాశం ఉంటుంది. పడే కష్టం ఒక్కటే అయినా అందులోనూ ఒక క్రమపద్ధతి ఉంటే విజయసాధన తేలికవుతుంది.
టైంపాస్ కోసం సినిమాకు వెళ్ళాలంటేనే వంద రకాల ప్రయార్టీస్ లెక్కలు వేసి చూసుకుంటాం. ఇంటినుండి సినిమా హాలుకు వెళ్లెవరకు అనేక అంచలు దాటాల్సి ఉంటుంది..అవునా! అటువంటిది జీవితాన్ని సెటిల్ చేసే చదువులలోనైనా, ఆటల్లోనైనా, ఉద్యోగప్రయత్నాలలోనైనా, వ్యాపారాలలోనైనా, ఉన్నత పదవులు పొందే విషయంలోనైనా ప్రాధాన్యాలు (Priorities) అవసర మా?  కాదా? ఆలోచించండి!
మానసిక ఒత్తిడి తెచ్చిపెడుతున్న అంశాలను గుర్తించి ఆ పరిస్థితులను సవరించి పనికి తగిన వాతావరణం ఏర్పాటుచేసుకోవాలి. అందుకే ఏ స్థాయిలో వారైనా క్రమశిక్షణతో ఒత్తిడి లేని విధంగా ప్రాధాన్యతలు ఏర్పాటు చేసుకోవాలి. ఈనాటి సమాజంలోని కుటుంబవ్యవస్థ చిన్న చిన్న కుటుంబాలుగా మారుతున్న పరిణామ క్రమంలో ఎవరి పని వారు చేసుకొనే పరిస్థితులు వచ్చి పడ్డాయ్ ! ఉమ్మడి కుటుంబాల విచ్ఛిన్నమైనందువల్ల పక్కవారి నుంచి ఎలాంటి సాయం ఆశించే పరిస్థితి ఉండడంలేదు. మన పని మనమే చేసుకోవాలి. మన బతుకుకు మనమే భరోసా కల్పించుకోవాలి.
1. చేయబోయే పనిపట్ల అవగాహన పెంచుకోవాలి. ఆ పని ఎప్పుడు..ఎక్కడ..ఎలా అనే ప్రాధాన్యతలను నిర్ధారించుకుని ఒక పట్టిక తయారు చేసుకోవాలి. 2. మొదలు పెట్టిన పనిని మధ్యలో విడిచిపెట్టి మరో పనిలో తలదూర్చకుండా ఉండాలి. ప్రాధాన్యతల పట్టిక ప్రకారం పని చేసి అనుకున్న పనులన్నిటిలోనూ విజయం సాధించాలి.
3. ఏ పనినినైనా అనుకున్న సమయానికి టంచనుగా ప్రారంభించాలి. అందువల్ల చివరి వరకు ప్రతీ దశలోనూ కావలిసినంత సమయం దొరుకుతుంది. లేకపోతే పనిని ముగించేటపుడు ఒత్తిడికి గురి కావాల్సి వస్తుంది. 4. అయిన పని అయినట్టు టిక్కుపెట్టుకోవాలి. అందువల్ల చేసిన పనినే మళ్ళీ మళ్ళీ చేసే ప్రమాదం తప్పుతుంది.
5. ఏ సబ్జెక్టు మొదలు పెట్టాలి.. మొదలు పెట్టిన సబ్జెక్టులో ఏ ఏ పాఠాలకు ప్రాధాన్యతలు ఇవ్వాలి.. ఉద్యోగ ప్రయత్నాలలో ఐతే మన సబ్జెక్టు నాలెడ్జి..సామాజిక అంశాల అవగాహన..ఎంత అనేది బేరీజు వేసుకోవాలి. అందుకు తగ్గట్టుగా ఆచరణను కొనసాగించాలి. 6. పని కొనసాగే దశలో ప్రాధాన్యతలకు అనుగుణంగా ఏ పని ఎప్పుడు పూర్తవుతుందనే అంచనాలలో తేడాలు వుండవచ్చు. కానీ ఒకటి రెండు ప్రయత్నాలు చేస్తే సమయానికి సంబంధించిన అంచనాలు అర్ధమౌతాయి. అందువలన సమయం వృథా కాదు. అందుబాటులో ఉన్న సమయం సక్రమంగా సద్వినియోగమవుతుంది. 7. చదువుల్లో నైనా, ఉద్యోగాల్లో నైనా, వ్యాపారాల్లో నైనా ప్రాధాన్యతల్లో అవగాహన లేకపోతే అనుభవజ్ఞుల సలహాలు తీసుకోవటంలో ఏ మాత్రం సంశయించవద్దు. కొన్ని సందర్భాలలో అనుభవజ్ఞుల సలహాలే కలిసివస్తాయి.
ఇలా మేల్కొందాం
ఒక పనిలో నిమగ్నమై ఉన్నప్పుడు అత్యవసరంగా మరో పనికి హాజరు కావాల్సి వస్తే చేస్తున్న పని ఎంతవరకు వచ్చిందో గుర్తించి అక్కడ ఒక కొండగుర్తు రాసుకోవాలి. దీనివలన ప్రాధాన్యతల వరుస దెబ్బతినదు. జ్ఞాపకం చెదరదు. పని సజావుగా సాగుతుంది.
ఉదా: ఒక పనిలో తలమునకలుగా ఉండగా సెల్ ఫోన్‌కాల్ అటెండవ వలసి వస్తుంది. ఆ కాల్ ఎంత సేపు సాగుతుందో తెలియదు. అవతలి వ్యక్తి ఎప్పటికి వదులుతాడో తెలియదు. అలా అని ఆ కాల్‌ను నిర్లక్షం చేయడానికి లేదు. అందుకని చేస్తున్న పని ఎక్కడి వరకు వచ్చిందో గుర్తించేందుకు వీలుగా ఒక కొండగుర్తు వేసుకోవాలి. ఆ ఫోన్‌కాల్ పూర్తయ్యాక మొదలుపెట్టిన పనిలోకి వెతుకులాట అక్కర్లేకుండా కంటిన్యూ చేయడానికి వీలవుతుంది.
టైం వేస్టనేది ఉండదు. కంగారు,భయం,బాధ,ఒత్తిడి లేకుండా మనం అనుకున్న పనులు పూర్తవ్వాలంటే ప్రాధాన్యతలు గుర్తించాలి. అప్పుడే అన్ని పనులలోనూ పురోగతి ఉంటుంది. ఎదిగిన, ఎదుగుతున్న, ఎదగాలనుకుంటున్న వారిలో ఎవరికైనా సరే ప్రాధాన్యతల్లోనే పరమార్ధం కనిపిస్తుంది.