Home రాజన్న సిరిసిల్ల మంత్రి సభలో కూలీ ఆత్మహత్య యత్నం

మంత్రి సభలో కూలీ ఆత్మహత్య యత్నం

suicide-image

రైతుబంధు చెక్కుల పంపిణీలో సంఘటన
మూడెకరాల భూమి ఇవ్వలేదని ఆవేదన

ఇల్లంతకుంట: సాక్షాత్తు రాష్ట్ర ఐటి, మున్సిపల్ శాఖ మంత్రి కెటిఆర్ సభలోనే ఓ దళితుడు పురుగుల మందు తాగి ఆత్మహత్య యత్నానికి పాల్పడ్డాడు. ఇల్లంతకుంట మండల కేంద్రంలో రైతుబంధు చెక్కుల పంపిణీ కార్యక్రమాన్ని ఏర్పాటు చేశారు. ఈ కార్యక్రమానికి స్థానిక ఎంఎల్‌ఏ రసమయి బాలకిషన్ తో కలసి కెటిఆర్ పాల్గొన్నారు. చెక్కులు పంపిణీ చేస్తున్న క్రమంలో ఒక్కసారిగా ఓగులాపూర్ గ్రామానికి చెందిన ఇల్లందుల కిష్టయ్య(45) అనే కూలీ తనకు మూడెకరాల భూమి ఇవ్వడం లేదని పురుగుల మందు తాగి పడిపోయాడు. దీంతో ఈ విషయం తెలుసుకున్న పోలీసులు వెంటనే అప్రమత్తమై అందుబాటులో ఉన్న అంబులెన్స్‌లో ఇల్లంతకుంట ఆస్పత్రికి తరలించారు. అక్కడి నుండి మళ్లి మెరుగైన వైధ్యం కోసం కరీంగనర్ ఆస్పత్రికి తరలించారు. ప్రస్తుతం వైద్యుల పర్యవేక్షణలో కూలీ చికిత్స పొందుతున్నాడు. రాష్ట్ర ఆహారభద్రత కమీషన్ సభ్యుడు వొరుగంటి ఆనంద్ దగ్గరుండి స్వయంగా ఆరోగ్య పరిస్థితిని చూసుకుంటున్నారు. ప్రస్తుతానికి ఆందోళన చెందాల్సిన అవసరంలేదని వైధ్యులు తెలిపినట్లు ఆనంద్ ఓ ప్రకటనలో తెలిపారు. గత పదిరోజుల క్రితమే జిల్లా కలెక్టర్ కృష్ణభాస్కర్‌కు తనకు సెంటు భూమి లేదని, మూడెకరాల భూమిని ఇవ్వాలని ధరఖాస్తు పెట్టుకున్నాడు. కిష్టయ్యకు భార్య భాగ్య, కొడుకు, కూతురు ఉన్నారు.