Home ఎడిటోరియల్ సామాజిక పార్టీల ఆత్మహత్య…

సామాజిక పార్టీల ఆత్మహత్య…

Social Parties

 

ఉత్తరప్రదేశ్, బీహార్‌లను చిరకాలం ప్రభావితం చేసి ఆ రెండు రాష్ట్రాలను సుదీర్ఘంగా పాలించిన సామాజిక న్యాయ సాధన శక్తుల కూటమి ఈ లోక్‌సభ ఎన్నికల్లో ఎందుకిలా డీలా పడిపోయిందనే ప్రశ్న సహజం. కనీవినీ ఎరుగని రీతిలో ఎస్‌పి, బిఎస్‌పి ఏకమై ఉత్తరప్రదేశ్‌లో నిర్మించిన ఐక్య కూట మి భారతీయ జనతా పార్టీ మహా గాలికి పేల పిండిలా కొట్టుకుపోయింది. బిజెపి సొంతంగా 62 స్థానాలు, మిత్ర పక్షంతో కలిసి 64 సీట్లు గెలుచుకోగా బిఎస్‌పి 10తో, ఎస్‌పి 5తో సరిపెట్టుకోవలసి వచ్చింది. ప్రధాని మోడీ పాలనకు తెర దించే లక్షంతో ఏకమైన ఈ రెండు పార్టీలు ఆశించిన శిఖరాలను అందుకోలేకపోయాయి.

2014 ఎన్నికలతో పోల్చుకుంటే బిజెపి అప్పటికంటే ఈసారి తక్కువ స్థానాలు గెలుచుకున్న మాట వాస్తవం. 80 లోక్‌సభ స్థానాలున్న ఈ రాష్ట్రంలో గత ఎన్నికల్లో బిజెపి 71 సీట్లు సాధించుకున్నది. ఈసారి 62కే పరిమితమైంది. అయినా అది ఘనమైన విజయమే. ఎందుకంటే బిజెపి ప్రభంజనాన్ని కల్లగా నిరూపిస్తామంటూ కలిసి కట్టుగా ఎన్నికల యుద్ధ రంగంలో దిగిన బిఎస్‌పి, ఎస్‌పిలు దానికి అతి దూరంలో ముగిసిపోయాయి. సమాజ్ వాదీ పార్టీ (ఎస్‌పి) 2014లో మాదిరిగానే ఈసారీ 5 స్థానాలతో సంతృప్తి పడవలసి వచ్చింది. బహుజన సమాజ్ పార్టీ (బిఎస్‌పి) 2014లో ఒక్క స్థానాన్నీ గెలుచుకోకపోగా ఈసారి 10 సీట్లు సాధించుకున్నది. ఈ రెండు పార్టీల మధ్య కుదిరిన అంగీకారం మేరకు పరస్పర ఓట్ల బదలాయింపు పాక్షికంగా, ఏకపక్షంగా మాత్రమే జరిగినట్లు తెలుస్తున్నది.

ఎస్‌పి ఓట్లు బిఎస్‌పికి పడ్డాయిగాని అటునుంచి ఇటు బదలాయింపు జరగలేదని అర్ధమవుతున్నది. దళితులకు ప్రాతినిధ్యం వహిస్తున్న బిఎస్‌పి, బిసిలకు ముఖ్యంగా యాదవులకు ప్రతినిధిగా ఉన్న ఎస్‌పికి మధ్య ఒకప్పుడు కుదిరిన సఖ్యత ఉత్తరప్రదేశ్ రాజకీయాలను విశేషంగా ప్రభావితం చేసింది. 1993 ఎన్నికలలో అప్పటి ఉమ్మడి యుపిలో రెండు పార్టీలు కలిసి పోటీ చేసి అధికారాన్ని సాధించుకున్నాయి. “కాన్షీరామ్ (బిఎస్‌పి) ములాయం (ఎస్‌పి) లు కలిశారు, జై శ్రీరాం (బిజెపి) గాలికి కొట్టుకుపోక తప్పదు” అనే నినాదం హోరెత్తిపోయింది. 1995 నాటికి ఈ పొత్తు చిత్తయిపోయింది. తన పార్టీ ఓట్లను ఎస్‌పి కబళిస్తున్నదన్న అభియోగంతో పొత్తుకు మాయావతి స్వస్తి చెప్పారు. దానితో ఆమెపై ఎస్‌పి కార్యకర్తలు దాడి చేశారు. అప్పటి నుంచి ఆ ఇంటి కాకి ఈ ఇంటి మీద వాలని రీతిలో రెండు పార్టీల మధ్య దశాబ్దాల పాటు పచ్చి గడ్డి కూడా భగ్గుమన్నది. చాలా కాలంపాటు తమిళనాడులో మాదిరిగా ఈ సామాజిక పార్టీలు ఒక దాని తర్వాత ఒకటి యుపిని పాలించాయి.

ఆ విధంగా రామ జన్మభూమి నేపథ్యంలోని బిజెపిని అధికారం దరిదాపుల్లోకి రాకుండా చేయగలిగాయి. మళ్లీ బీహార్‌లో లాలూ ప్రసాద్ యాదవ్ ప్రయోగించి చూపించిన మాదిరి మహాఘట్ బంధన్‌గా కలిసిన తర్వాత ఎస్‌పి, బిఎస్‌పిలు కీలకమైన ఉప ఎన్నికల్లో బిజెపిని మట్టి కరిపించాయి. ఆ ఉత్సాహంతో ఈ లోక్‌సభ ఎన్నికల్లో యుపిలోని అత్యధిక స్థానాలను గెలచుకోగలమని భావించి రెండు పార్టీలూ కలిసి బరిలోకి దిగాయి. ఎస్‌పి తరపున ములాయం, అఖిలేశ్‌లు గెలిచారుగాని వారి కుటుంబ సభ్యులు ఓడిపోయారు. యాదవ భూమిగా పేరొందిన కాన్పూర్ నుంచి ఆగ్రా వరకు గల 12 స్థానాల్లో ఒక్క ములాయం సింగ్ యాదవ్ పోటీ చేసిన మైన్‌పురిలో మినహా ఎక్కడా ఎస్‌పి అభ్యర్థులు గెలవలేకపోయారు. అఖిలేశ్ యాదవ్ భార్య డింపుల్ యాదవ్ కూడా ఓడిపోయారు. బీహార్‌లో సైతం ఇదే పరిస్థితి. లాలూ ప్రసాద్ యాదవ్ దర్శకత్వంలో 2015లో ఏర్పాటయిన మహా ఘట్ బంధన్ ఆ ఏడాది అసెంబ్లీ ఎన్నికల్లో అధికారం సాధించుకోగలిగింది.

ఆయన పార్టీ ఆర్‌జెడి 81 స్థానాలు గెలుచుకొని అతిపెద్ద పార్టీగా వచ్చింది. నితీశ్ కుమార్ ముఖ్యమంత్రిగా ప్రభుత్వం ఏర్పాటయింది. తర్వాత కొంత కాలానికి నితీశ్ కుమార్ ఆ కూటమికి స్వస్తి చెప్పి బిజెపితో కలిసి మళ్లీ ముఖ్యమంత్రి కావడం, లాలూ ప్రసాద్ యాదవ్ పై పశుగ్రాసం కేసును తిరగదోడి ఆయనను జైల్లో పెట్టడం జరిగిపోయాయి. ఈ నేపథ్యంలో లాలూ లేని మహాఘట్ బంధన్ బీహార్‌లో ఈ ఎన్నికల్లో ఘోరాతి ఘోరమైన పరాజయాన్ని చవిచూసింది. యుపి, బీహార్‌లోని ఈ పరిణామాలు అక్కడి కుల రాజకీయాలకు తెర దించాయనే విశ్లేషణలు వస్తున్నాయి. అదేమైనప్పటికీ అణగారిన కులాలైన ఎస్‌సి, బిసిలు రాజ్యం చేసిన ఒక అధ్యాయం అంతమొందినట్టే అనుకోవాలా? సమాజం అంచుల్లోని బలహీన శక్తుల రాజ్యాధికార కాంక్షను నెరవేర్చిన సామాజిక న్యాయ పార్టీలు తమతమ నాయకత్వాల కుటుంబ రాజకీయాల కొలిమిలోపడి ఆత్మహత్య చేసుకున్నాయని భావించాలా?

 

Suicide of Social Parties