Sunday, June 23, 2024

సుమంత్ అద్భుత సెంచరీ

- Advertisement -
- Advertisement -

Sumanth

 

పట్టు బిగించిన హైదరాబాద్

హైదరాబాద్: ఇక్కడి ఉప్పల్ రాజీవ్ గాంధీ స్టేడియంలో కేరళతో జరుగుతున్న రంజీ ట్రోఫీ మ్యాచ్‌లో మూడో రోజు హైదరాబాద్ ప్రత్యర్థిపై గట్టి పట్టు సాధించింది. తొలి ఇన్నింగ్స్‌లో కేరళను 164 పరుగులకే కట్టడి చేసిన హైదరాబాద్ రెండో రోజు ఆట ముగిసే వేళకు 8 వికెట్ల నష్టానికి 198 పరుగులు చేసిన విషయం తెలిసిందే. ఈ ఓవర్‌నైట్ స్కోరుతో మూడో రోజు ఆట ప్రారంభించిన హైదరాబాద్ 228 పరుగులకు ఆలౌట్ అయింది. వికెట్ కీపర్ బ్యాట్స్‌మన్ కె. సుమంత్ అద్భుతంగా ఆడి 111 పరుగులతో నాటౌట్‌గా నిలిచి జట్టు తొలి ఇన్నింగ్స్ ఆధిక్యత సాధించడానికి తోడ్పడ్డాడు. కేరళ బౌలర్లలో సందీప్ వారియర్ ఐదు వికెట్లతో రాణించాడు.

కాగా తొలి ఇన్నింగ్స్‌లో 64 పరుగులతో వెనుకబడ్డ కేరళ రెండో ఇన్నింగ్స్‌లో సై తం ఆదే పేలవమైన ఆటను కొనసాగించింది. విష్ణు వినోద్, రోహన్ ప్రేమ్‌లు చెరి 44 పరుగులు చేయడమే కాకుండా ఆరో వికెట్‌కు 53 పరుగులు జోడించడంతో కేరళ జట్టు తిరిగి కోలుకుంటున్నట్లు కనిపించింది. అయితే ఈ ఇద్దరు కూడా భారీ స్కోరు చేయలేక పోయారు. దీంతో మూడో రోజు ఆట ముగిసే వేళకు కేరళ తన రెండో ఇన్నింగ్స్‌లో 7 వికెట్ల నష్టానికి 204 పరుగులు మాత్రమే చేయగలిగింది. ఇప్పటివరకు కేవలం 140 పరుగుల ఆధిక్యత కలిగిన కేరళ మరో మూడు వికెట్లు మాత్రమే మిగిలి ఉండడంతో చివరి రోజు ఏ మేరకు పోరాటం సాగిస్తుందో చూడాలి.

ఆంధ్ర పై చేయి
కాగా జైపూర్‌లో రాజస్థాన్‌తో జరుగుతున్న మరో మ్యాచ్‌లో ఆంధ్ర మ్యాచ్‌పై పూర్తి ఆధిక్యత సాధించింది. రాజస్థాన్‌ను తొలి ఇన్నింగ్స్‌లో 151 పరుగులకే కుప్ప కూల్చిన ఆంధ్ర తన తొలి ఇన్నింగ్స్‌లో257 పరుగులకు ఆలౌట్ అయింది. దీంతో ప్రత్యర్థిపై కీలకమైన తొలి ఇన్నింగ్స్ ఆధిక్యత సాధించింది. కాగా మూడో రోజు ఆట ముగిసే వేళకు రాజస్థాన్ కేవలం 23 పరుగులకే రెండు వికెట్లు కోల్పోయింది. దీంతో ఇంకా 83 పరుగులు వెనుకబడి ఉన్న రాజస్థాన్ రెండో ఇన్నింగ్స్‌లో ఎంత మేరకు పోరాటం సాగిస్తుందో చూడాలి. ఆంధ్ర ఇన్నింగ్స్‌లో జ్ఞానేశ్వర్ 73 పరుగులతో రాణించగా శశికాంత్ 54 పరుగులు చేశాడు.

Sumanth Awesome Century
- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News