Home వార్తలు వేసవిలో విహారం

వేసవిలో విహారం

వేసవిలో ఎండలు మండిపోతాయి. పైగా ఈసారి వేడి 50డిగ్రీలకు పైనే ఉండబోతోదంటున్నారు. పిల్లలకూ వేసవి సెలవులు ఇచ్చేస్తారు. ఇంకేముంది! చిన్న సమ్మర్ ట్రిప్ వేస్తే పోలా..ఆ ట్రిప్ కూడా వేసవి నుంచి ఉపశమనం పొందేలా ఉండాలి. అలా అని జేబులు ఖాళీ అయ్యే విధంగానూ ఉండకూడదు. తక్కువ ఖర్చుతో కూడుకుని ఉండాలి. పిల్లలు, పెద్దలు ఎంజాయ్ చేసేటట్టు ఉండాలి. అలా అనువుగా, సౌకర్యవం తంగా ఉండే టూరిస్ట్ ప్రదేశాలు మన దేశంలో కోకొల్లలు. ప్రకృతి ఒడిలో సేదదీరడానికి, దైనందిన జీవితంలో ఒత్తిళ్లు, కష్టాలు మరచిపోవడానికి మళ్లీ తిరిగి వచ్చేటప్పుడు కొత్త శక్తిని శరీరంలో, మనసులో నింపుకోడానికి ఈ ప్రదేశాలు వెళ్లి చూడండి. 

tawang1అరుణాచల్ ప్రదేశ్‌లో అధిక జనాభా ఉండే ప్రదేశం తవాంగ్. మే జూన్‌లలో కాని, సెప్టెంబర్, అక్టోబర్‌లలో కాని వెళ్లడానికి అనువైన ప్రదేశం. సముద్ర మట్టం నుంచి పదివేల అడుగుల ఎత్తున ఉండే ఆహ్లాదకరమైన ప్రదేశం. అయిదవ దలైలామా కట్టిన పధ్నాలుగవ శతాబ్దపు తవాంగ్ బౌద్ధ మొనాస్ట్రీ ఉంది. అంతా కొండ ప్రాంతం. ప్రయాణంలో జాగ్రత్తగా ఉండటం అవసరం. ఇండియా, చైనా సంబంధాలు, వాటి ప్రభావం అక్కడి ప్రజల మీద బాగా కనిపిస్తుంది. జస్వంత్ ఘర్, బూమియ లాటి ప్రదేశాలను చూసినప్పుడు ఒళ్ళు పులకిస్తుంది.
ఒత్తిడికి ఉపశమనం తవాంగ్
బుమ్లా అనే ప్రదేశం సిమ్లాను మరిపిస్తుందంటారు. ఇండో చైనా బార్డర్ (ఇక్కడి నుంచి టిబెట్ 450 కిలోమీటర్లు, బీజింగ్ 4500 కిలోమీటర్లు ఉంటుంది. అరుణాచల్ ప్రదేశ్ నుంచి తేజ్‌పూర్(అసోమ్) నుంచి బొండిలా దిరాంగ్‌లో వేడి నీటిబుగ్గలు, సముద్రమట్టం నుంచి 14000 కిలోమీటర్ల ఎత్తులో ఉన్న సేల అనే ప్రదేశం ఉంది. జనవరి 19 నుంచి మంచు కురవడం మొదలైపోతుంది. మంచు కురవడం చూసే ఆ అనుభూతి ఎప్పటికీ మరచి పోలేనిది. సముద్ర మట్టం నుంచి 3500 మీటర్ల ఎత్తున హిమాలయ పర్వతాలలో ఉన్న అందాల తవాంగ్ చూసి తీరాల్సిన ప్రదేశం. భూతల స్వర్గం అంటారు. ఎటు చూసినా పర్వతాల అందాలు, ప్రకృతికి పుట్టినిల్లు అనే భావన కలిగిస్తుంది తవాంగ్. ఎత్తైన పర్వతం మీద పదిహేడవ శతాబ్దపు తవాంగ్ మొనాస్ట్రీ ఉంటుంది. ఆధ్యాత్మిక పరిసరాలు నల్లటి మేఘాలు నాస్తికులను సైతం ఆకట్టుకొని తన్మయత్వానికి గురి చేస్తాయి. ఒత్తిడితో కూడిన జీవితం గడిపేవారికి తవాంగ్ టూర్ పెద్ద ఉపశమనం. తవాంగ్ వెళ్లే దారిలో ఊపిరిబిగబట్టుకోవాల్సి వస్తుంది. దారి పొడుగునా ప్రకృతి సౌందర్యం నిశ్చేష్టులను చేస్తుంది. ప్రకృతి అందాల విందు- ముందుగా కొండలు, వాటి చుట్టూ తెల్లటి మంచుతో ఉన్న కొండలు ఎంత చూసినా తనివి తీరదు.

ఇలా వెళ్లొచ్చు

విమానంలో వెళితే హైదరాబాద్ నుంచి రాయపూర్‌కి 3082 రూపాయలు చార్జి. అక్కడి నుంచి సక్తికి ట్రైన్‌లో వెళ్లాలి. దానికి 140 రూపాయలు చార్జి. అక్కడి నుంచి తవాంగ్‌కి కారులో 120 రూపాయల వరకు ఖర్చవుతుంది. లేకుంటే గౌహతికి వెళ్లి అక్కడి నుంచి తేజ్‌పూర్, తర్వాత తవాంగ్ వెళ్లచ్చు. తవాంగ్‌లో రైల్వే స్టేషన్ లేదు. దానికి దగ్గరి రైల్వేస్టేషన్ గౌహతి. అది కాక తవాంగ్‌ని అనుసంధానించే స్టేషన్ తేజ్‌పూర్. ప్లేన్‌లో వెళ్తే, మధ్యలో ట్రైన్, క్యాబ్ ఖర్చు కలుపుకుని ఒక మనిషికి రాను పోను ప్రయాణపు ఖర్చు ఏడువేల వరకు ఉంటుంది.

coorg1కర్నాటక: ఈ ఈ అందమైన హిల్ స్టేషన్‌ని మనదేశానికి స్కాట్‌లాండ్ అంటారు. కూర్గ్ కర్నాటకలో ఉంది. కూర్గ్‌ని కొడగు అని కూడా అంటారు. కర్నాటకలో చిన్న ప్రాంతం ఇది. అక్కడి ఆచార వ్యవహారాలు, సంస్కృతి, సంప్రదాయం విభిన్నంగా ఉంటాయి. ఎటు చూసినా పచ్చదనమే. కొండలు, ఆకుపచ్చటి లోయ ప్రాంతాలు, హరిత వనాలు, ఊపిరి బిగబట్టి చూడాల్సిన జలపాతాలు, కూర్గ్ సందర్శకులను కట్టి పడేస్తాయి. కాఫీ తోటలు,కమలా పండ్ల తోటలు, ఏలకుల తోటలు, మిరియాల చెట్లు, ఇంకా, ఘనమైన, చిక్కని అడవి మనసుకు ఆహ్లాదాన్ని కలిగిస్తాయి. కావేరి నది దక్షిణ భారత నదుల్లో ఒకటి. కూర్గ్ నుంచి 54 కిల్లోమీటర్ల దూరంలో తలకావేరి నది ఉంది. మొదటి రోజు సాయంత్రం ప్రకృతి అందాలు తనివితీరా చూసిన తర్వాత రాత్రి హోటల్‌లో బస చేసి ఏమాత్రం ఆలస్యం చేయకుండా తెల్లవారి ఉదయం నుంచి ప్రకృతి సౌందర్యాన్ని ఆస్వాదించడానికి సమయం కేటాయించాలి.
తేనెలూరే చోటు
అందమైన పెయింటింగ్‌లు, అద్భుతమైన కళా సంపదను చూడచ్చు. మధ్యాహ్నం నుంచి కూర్గ్ దగ్గరలో ఉన్న చిన్న టౌన్ కక్కబే చూడటానికి వెళ్లచ్చు. ఆగ్నేయ ఆసియాలో అతి పెద్ద తేనె ఉత్పాదక కేంద్రం అదే. 1792లో కట్టిన నల్లకొండ ప్యాలెస్ ఉంది. ఇగుత్తప్ప గుడి ఉంది. కూర్గ్ మొత్తం కనిపించే వ్యూ పాయింట్ తడియాండమోల్ అనే ఎత్తైన కొండ. మొత్తం మీద కూర్గ్ ట్రిప్‌లో ఎన్నో సాహసాలు చేయదగ్గ ప్రదేశాలు, చూసేవారిని ఆశ్చర్యానికి గురిచేసే ప్రకృతి సోయగాలకు అంతే ఉండదు. యూరోవ్యాలీ ఎప్పటికీ గుర్తుండిపోయే స్పాట్. అబే జలపాతాలు, దుబ్బారే ఎలిఫెంట్ క్యాంప్, కాఫీ ప్లాంటేషన్స్, రివర్ ర్యాఫ్టింగ్, ఎటివి రైడ్స్ మంచి అనుభూతులను మిగులుస్తాయి.

ఇలా వెళ్లొచ్చు

కూర్,్గ హైదరాబాద్‌కి 797 కిలోమీటర్ల దూరంలో ఉంటుంది. కార్‌లో ప్రయాణం చేస్తే పదమూడు గంటలు పడుతుంది. బుత్‌పూర్, పెబ్బూరు, దేవరకొండ, గూటీ, రుద్రంపేట, గుట్టూరు, సుగూరు, కుడూరు, రామనాథపురా, సుంటికొప్ప మీదుగా కూర్గ్ చేరుకోవచ్చు. దారిపొడుగునా ఎటిఎమ్ సెంటర్‌లు, పెట్రోల్ పంపులు చాలా ఉంటాయి. పెట్రోల్ ఖర్చు కిలోమీటర్‌కి 25  రూపాయల (అప్పటి రేటును బట్టి మారుతూ ఉంటుంది) చొప్పున ఖర్చు లెక్క వేసుకోవచ్చు. పిల్లలు, పెద్దలు, కుటుంబం అంతా వెళ్లి ఎంజాయ్ చేయదగ్గ ట్రిప్ ఇది. హైదరాబాద్ నుంచి కూర్గ్‌కి బస్‌లో వెళ్తే 14 గంటలు పడుతుంది. ప్లేన్‌లో వెళ్లాలనుకుంటే హైదరాబాద్ నుంచి మంగుళూరుకు వెళ్లాలి. అక్కడి నుంచి కూర్గ్ 140 కిలోమీటర్లు ఉంటుంది. అక్కడి నుంచి క్యాబ్‌లో వెళ్లచ్చు. ట్రైన్‌లో వెళ్లాలనుకుంటే హైదరాబాద్ నుంచి మైసూర్‌కి వెళ్లడానికి పదహారు గంటలు పడుతుంది. మైసూర్ నుంచి కూర్గ్ 117 కిలోమీటర్లు ఉంటుంది. క్యాబ్ తీసుకుని కూర్గ్ చేరుకోవచ్చు.

sikkim2సిక్కిం: ఈశాన్య భారతంలో చూడదగిన ప్రదేశం సిక్కిం. తీస్తా నది పారే సిక్కిం పర్యాటకులకు ప్రత్యేక అనుభవాన్ని అనుభూతిని ఇస్తుంది. కొండల మీద ట్రెక్కింగ్ అనుభవాన్ని సొంతం చేసుకోవాలన్నా, బౌద్ధారామాలు చూడాలన్నా, జలపాతాలను తనివారా చూడాలన్నా, సిక్కిం ట్రిప్ వేయాల్సిందే. రెండు వందల పూలు ఉంటాయక్కడ. కలకత్తా నుంచి కాని, ఢిల్లీ నుంచి కాని సిలిగురికి వెళ్లాలి. సిలిగురి నుంచి సిక్కిం ముఖ్య పట్టణం గ్యాంగ్ టక్‌కి ట్యాక్సీలు వెళ్తాయి. నాలుగువేల అడుగుల ఎత్తున కొండ దారుల్లో ప్రయాణం చేస్తే వస్తుంది గ్యాంగ్‌టక్. ఆ ప్రయాణం చాలా బావుంటుంది. మలుపు మలుపులో అందాలు. పచ్చని కొండలు, లోయలు, జలపాతాలు, నీలి రంగు నీళ్లతో కొండ రాళ్ల మధ్య పారే నదీ ప్రవాహం చల్లని వాతావరణం, మన మీద నుంచి వెళ్లే మేఘాలు. ఎత్తైన, మంచుతో కూడిన కంచన్‌జంగా పర్వతాలు సిక్కిం హైలైట్స్‌గా నిలుస్తాయి. ప్రపంచంలోనే మూడవ అత్యంత ఎత్తైన పర్వతాలవి. గ్యాంగ్‌టక్‌లో హోటల్‌లో బసచేసి తీరిక సమయాన్ని బట్టి వివిధ ప్రదేశాలు చుట్టేసి రావచ్చు. హిమాలయాలకు లంఘిస్తూ హనుమంతుడు పాదం మోపిన ప్రదేశం కాబట్టి హనుమాన్ టోక్ అంటారు. ఆ ప్రదేశాన్ని చూడచ్చు. రూమ్‌టెక్‌లో అత్యంత పురాతన బౌద్ధ ఆశ్రమాలుంటాయి. ఒక చిన్న అడవి లాటి ప్రదేశంలో ట్రెక్కింగ్ అనుభవాన్ని చవిచూడచ్చు. రకరకాల పక్షులు, జంతువులు ఆనందంలో మంచెత్తుతాయి.
మార్చి నుంచి జూన్ మధ్యలో…
Sikkimఅత్యంత తక్కువ జనాభా ఉన్న రాష్ట్రం సిక్కిం. హిమాలయాల్లో గూడు కట్టుకున్నట్టు ఉంటుంది. ప్రత్యేకమైన సహజ వనరులు, ప్రకృతి రమణీయతలు మైమరిపింపచేస్తాయి. అలానే సన్నటి కొండ రోడ్లలో ప్రయాణం కొంచెం రిస్క్‌తో కూడుకున్నదే. అయితే డ్రైవర్లు నైపుణ్యం కలవారు, ఆ ప్రాంతాలకు అలవాటైన వారు కాబట్టి సమస్య ఉండదు. వాతావరణం చల్లగా ఉంటుంది. ఎండాకాలంలో 20 డిగ్రీలు అత్యున్నత ఉష్ణోగ్రతగా చెప్పచ్చు. టూర్ ప్యాకేజ్‌లను తీసుకునే బదులు సొంతంగా వెళ్లడం మేలు. డబ్బు ఖర్చు తగ్గుతుంది. గ్యాంగ్‌టక్ నుంచి కింది హిమాలయాల్లో ఉన్న కాలింపాంగ్ అనే ఊరికి వెళ్లచ్చు. చల్లని వాతావరణం, బ్రిటీషు కాలం నాటి కట్టడాలు, దగ్గరగా కనిపించే కంచన్‌జంగా పర్వతాలు, కాక్టస్ గార్డెన్, హిమాలయన్ పూల నర్సరీ చూడచ్చు. లాచంగ్ అనే ఒక గిరిజన గ్రామం ఉంది. చుట్టూతా కొండ ప్రాంతాలు, చాలా ఎక్కువ సంఖ్యలో జలపాతాలతో ఉండే ఈ గ్రామం చూసితీరాలి. లాచంగ్‌కి, యమ్‌తంగ్‌కి మధ్య 25 కిలోమీటర్ల దూరం ఉంటుంది. సిక్కిం వెళితే డార్జిలింగ్ చూడకుండా తిరిగి రావాలనిపించదు. మార్చి నుంచి జూన్ మధ్య ప్రాంతంలో ప్రకృతి సందర్శనీయంగా ఉంటుంది. హిమాలయన్ మౌంటెనీరింగ్ ఇన్‌స్టిట్యూట్, జూ, జపనీస్ టెంపుల్, చౌరస్తా మాల్, టీ తోటలు చూడొచ్చు.

ఇలా వెళ్లొచ్చు

త్వరలో సిక్కిం స్వంత ఏర్‌పోర్ట్ ఏర్పాటు చేసుకోనుంది. సిక్కిం దగ్గరలో ఉన్న ఏర్‌పోర్ట్ పశ్చిమ బెంగాల్ లోని బాగ్‌డోగ్రా. అది గ్యాంగ్‌టక్‌కి 124 కిలోమీటర్ల దూరంలో ఉంటుంది. కోల్‌కత్తా, ఢిల్లీ, పాట్నా, ఇంపాల్, గౌహతికి ఆ ఏర్‌పోర్ట్ అనుసంధానించి ఉంది. హైదరాబాద్ నుంచి కోల్‌కత్తా వరకు లేదా ఢిల్లీ వరకు ప్లేన్‌లో వెళ్లచ్చు. ట్రైన్‌లో అయితే డైరెక్ట్‌గా సిక్కింకి దారి ఉండదు. పశ్చిమ బెంగాల్‌లోని సిలిగురి, కలింపాంగ్ వెళ్లాలి. అక్కడి నుంచి సిక్కింలోని వివిధ టౌన్‌లకి గ్యాంగ్‌టక్‌కి బస్ లేదా క్యాబ్‌లలో వెళ్లొచ్చు.

wayanadu2కేరళ: ముఖ్యమైన హిల్ స్టేషన్లలో వయనాడ్ ఒకటి. దాన్ని ‘గ్రీన్ ప్యారడైజ్’ అని కూడా అంటారు. వ్యవసాయ క్షేత్రాలు, చిక్ని అడవులు, పచ్చటి కొండలతో ఆహ్లాదకరమైన వాతావరణం ఆరోగ్యానికి స్వస్థత చేకూరుస్తుంది. వయల్ అంటే వరి పొలాలు. నాడు అంటే ప్రదేశం అని అర్థం. వయనాడ్‌కి దక్షిణాన 2100 మీటర్ల ఎత్తున చంబ్రా శిఖరం ఉంటుంది. అది ఎక్కడానికి శారీరక ధృఢత్వం ఉండాల్సిందే. కాని అది ఎక్కే అనుభవం ఎప్పటికీ మరువలేనిది. పైకి వెళ్లే కొద్దీ వయనాడ్ అందం విస్తృతమవుతూ పోతుంది. కొండ పైకి ఎక్కడానికి, దిగడానికి పూర్తిగా ఒక రోజంతా పడుతుంది. వయనాడ్ దగ్గర నీలిమల అనే ప్రాంతం ఉంటుంది. రకరకాల ట్రెక్కింగ్ దారులు, వివిధ రకాల అవకాశాలు ఉంటాయి. నీలిమల పైనుంచి చూస్తే పక్కనే కనిపించే మీన్‌ముట్టి జలపాతం అద్భుతంగా ఉంటుంది. ప్రత్యక్షంగా మీన్‌ముట్టి జలపాతాల దగ్గరికి కూడా వెళ్లచ్చు. ఊటీని, వయానాడ్‌ని కలుపుతూ గల రెండు కిలోమీటర్ల కొండ ప్రాంతం ఎక్కితే అతి పెద్ద మీన్‌ముట్టి జలపాతాల దగ్గరికి వెళ్లచ్చు. ఇంకో జలపాతం చేతాలయం. మీన్‌ముట్టి కంటె చిన్న జలపాతం. పలు జాతుల పక్షులు ఇక్కడ కనువిందు చేస్తాయి. పక్షిపాతాళం, బ్రహ్మగిరి కొండల్లో పదిహేడు వందల మీటర్ల లోపలికి ఉంటుంది. లోతైన లోయల్లో వింత వింత రకాల పక్షులు, జంతువులు, కనీవినీ ఎరగని జాతుల మొక్కలు ఉంటాయి. పక్షిపాతాళం, మనంతవాడీ దగ్గర ఉంది. అడవి నుంచి ఏడు కిలోమీటర్లు ట్రెక్ చేయాల్సి ఉంటుంది. మన దేశంలోనే అతి పెద్ద డ్యామ్ బానాసుల సాగర్. వయనాడ్‌లో మసాలాలు, టీ, బాంబూ ఉత్పత్తులు, తేనె, హెర్బల్ ఉత్పత్తులు వంటివి కొనుక్కోవచ్చు.

ఇలా వెళ్లొచ్చు

wayanaduహైదరాబాద్ నుంచి కొల్లమ్ వరకు ట్రైన్‌లో వెళ్లచ్చు. అక్కడి నుంచి క్యాబ్ తీసుకుని వయనాడ్ చేరుకోవచ్చు. కొల్లమ్ వరకు 593 రూపాయల టికెట్. అక్కడి నుంచి వయనాడ్‌కు క్యాబ్ ఛార్జి 376 రూపాయలు ఉంటుంది.హైదరాబాద్ నుంచి మైసూర్‌కి వెళ్లి అక్కడి నుంచి బస్‌లో వయనాడ్ వెళ్లచ్చు. దానికి ఒక మనిషికి 874 రూపాయలు ఖర్చు అవుతుంది. ప్లేన్‌లో వెళితే కోయంబత్తూర్ వరకు వెళ్లి అక్కడి నుంచి క్యాబ్‌లో వయనాడ్ వెళ్లచ్చు. 4170 రూపాయల వరకు ఖర్చవుతుంది.