Home తాజా వార్తలు వరుస ఓటములతో సన్‌రైజర్స్ డీలా

వరుస ఓటములతో సన్‌రైజర్స్ డీలా

Sun riser hyderabad defeat in IPL
న్యూఢిల్లీ : ఈ ఐపిఎల్ సీజన్‌లో సన్‌రైజర్స్ హైదరాబాద్ పరిస్థితి చాలా దారుణంగా తయారైంది. వరుస ఓటములతో ఇప్పటికే ప్లేఆఫ్ అవకాశాలను క్లిష్టంగా మార్చుకుంది. రాజస్థాన్‌తో జరిగిన కిందటి మ్యాచ్‌లో భారీ తేడాతో ఓటమి పాలైంది. దీంతో ప్లేఆఫ్ ఛాన్స్‌ను మరింత కష్టం చేసుకుంది. గతంలో ఎన్నడూ లేని విధంగా ఈ సీజన్‌లో హైదరాబాద్ పేలవమైన ఆటతో నిరాశ పరుస్తోంది. బ్యాటింగ్ వైఫల్యం జట్టుకు ప్రతికూలంగా మారింది. వరుస పరాజయాల నేపథ్యంలో యాజమాన్యం ఏకంగా కెప్టెన్‌ను కూడా మార్చేసింది. డేవిడ్ వార్నర్ కెప్టెన్సీ నుంచి తప్పించడమే కాకుండా అతనికి తుది జట్టులో కూడా చోటు కల్పించలేదు. అయితే వార్నర్‌ను తప్పించినా హైదరాబాద్ పరిస్థితిలో మార్పు రాలేదు. కేన్ విలియమ్సన్ సారథ్యంలో ఆడిన తొలి మ్యాచ్‌లోనే ఘోర పరాజయం చవిచూసింది.

ఇకపై జరిగే మ్యాచుల్లో విజయం సాధించడంతో పాటు ఇతర జట్ల ఫలితాలపై ఆధారపడాల్సి ఉంది. బెయిర్‌స్టో, మనీష్ పాండే, విలియమ్సన్, నబి, సమద్, విజయ్ శంకర్, కేదార్ జాదవ్ తదితరులు జట్టులో ఉన్నా బ్యాటింగ్ ఇబ్బందులు తప్పడం లేదు. బెయిర్‌స్టో ఒక మ్యాచ్‌లో ఆడితే మరో మ్యాచ్‌లో విఫలమవుతున్నాడు. మనీష్ పాండే బాగానే ఆడుతున్నా అతని బ్యాటింగ్‌లో వేగం కనిపించడం లేదు. ఇక విజయ్ శంకర్, జాదవ్‌లు ఘోరంగా విఫలమవుతున్నారు. అయినా వారికి తుది జట్టులో ఎందుకు చోటు కల్పిస్తున్నారో అంతుబట్టకుండా ఉంది.

నబితో పోల్చితే జాసన్ హోల్డర్ చాలా మెరుగైన ఆల్‌రౌండర్ అనడంలో ఎలాంటి సందేహం లేదు. అయినా అతన్ని తప్పించి నబి తదితరులకు చోటు కల్పిస్తున్నారు. మరోవైపు రషీద్ ఖాన్ ఈసారి బ్యాటింగ్‌లో పెద్దగా ప్రభావం చూపలేక పోతున్నాడు. అతని వైఫల్యం జట్టుపై బాగానే కనిపిస్తోంది. కాగా, యువ క్రికెటర్లు విరాట్ సింగ్, అభిషేక్, సమద్ తదితరులకు పలు ఛాన్స్‌లు లభించినా దాన్ని సద్వినియోగం చేసుకోవడంలో విఫలమయ్యారు.

సీనియర్లతో పాటు జూనియర్లు కూడా విఫలం కావడంతో హైదరాబాద్‌కు వరుస ఓటములు తప్పడం లేదు. ఇలాంటి స్థితిలో మంగళవారం ముంబై ఇండియన్స్‌తో జరిగే మ్యాచ్ హైదరాబాద్‌కు సవాలుగా మారింది. ప్లేఆఫ్ రేసులో నిలువాలంటే ఇకపై జరిగే ప్రతి మ్యాచ్‌లోనూ గెలవాల్సిన పరిస్థితి జట్టుకు నెలకొంది. దీంతో హైదరాబాద్‌పై తీవ్ర ఒత్తిడి ఏర్పడింది. దీన్ని తట్టుకుని ముందుకు సాగితేనే జట్టు నాకౌట్ అవకాశాలు సజీవంగా ఉంటాయి. లేకుంటే ఈసారి లీగ్ దశలోనే ఇంటిదారి పట్టినా ఆశ్చర్యం లేదు.

వార్నర్‌కు బాసట..

న్యూఢిల్లీ : సన్‌రైజర్స్ హైదరాబాద్ స్టార్ ఆటగా డు డేవిడ్ వార్నర్‌కు రోజు రోజుకు మద్దతు పెరుగుతోంది. వార్నర్‌ను కెప్టెన్సీ నుంచి తప్పించడమే కాకుండా కనీసం తుది జట్టులో కూడా చోటు కల్పించక పోవడంపై సోషల్ మీడియా వేదికగా పెద్ద దుమారమే లేచింది. వార్నర్‌పై అర్ధాంతరం గా వేటు వేసిన సన్‌రైజర్స్ యాజమాన్యంపై విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. శంకర్, నబి, కేదార్ తదితరులతో పోల్చితే వార్నర్ ఎంతో మెరుగైన ఆటగాడని, అయినా అతనిపై వేటు వేయడం ఎంతవరకు సమంజసమని క్రికెట్ విశ్లేషకులు ఆకాశ్ చోప్రా, దీప్‌దాస్ గుప్తా, మంజ్రేకర్ తదితరులు ప్రశ్నిస్తున్నారు. ఎంతో అపార అనుభవం కలిగిన వార్నర్‌ను సన్‌రైజర్స్ యాజమాన్యం ఇలా అవమానించడం ఏమాత్రం శ్రేయస్కారం కాదని పేర్కొంటున్నారు. మరోవైపు వార్నర్‌ను తప్పించడంపై హైదరాబాద్ అభిమానులు కూడా సోషల్ మీడియా వేదికగా తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఈ సందర్భంగా లక్ష్మణ్, బెయిలీ, మురళీధరన్ తదితరులపై దుమ్మెత్తి పోస్తున్నారు.