Home తాజా వార్తలు ఉపాధి కూలీలకు ఎండదెబ్బ…

ఉపాధి కూలీలకు ఎండదెబ్బ…

పని ప్రదేశాల్లో భద్రత కరువు
కనిపించని టెంట్‌లు, ఫస్ట్ ఎయిడ్ కిట్లు
నిర్లక్ష్యం వీడని అధికారులు

మనతెలంగాణ/పెద్దపల్లి రూరల్‌: జిల్లాలో ఉపాధి కూలీల పరిస్థితి దయనీయంగా తయారైంది. వంద రోజుల పని దినాలు కల్పించాలన్న లక్ష్యంతో కేంద్ర ప్రభుత్వం ఉపాధి హామీ పథకం అమలు చేస్తుంది. కూలీలకు క్యూబిక్ మీటర్ల లెక్కన కూలీ చెల్లిస్తున్న గ్రామీణాభివృద్ది శాఖ పని ప్రదేశాల్లో మౌళిక సదుపాయాలు కల్పించడం లేదు. ప్రస్తుత వేసవి కూలీలు వడదెబ్బ బారిన పడే ప్రమాదం పొంచి ఉంది. పని ప్రదేశాల్లో ఎండ నుంచి రక్షణ కోసం టెంట్ వేయించాల్సి ఉన్న ఎక్కడ అలాంటి పరిస్థితులు కనిపించడం లేదు. 2016లో సెల్ప్‌హెల్ప్ గ్రూపులకు టెంట్లను పంపిణి చేసింది. ప్రస్తుతం జిల్లాలో ఎక్కడ కూడ ఇవి ఏర్పాటు చేస్తున్న పరిస్థితులు లేవు. ప్రత్యేకంగా నీడ ఏర్పాటు చేసుకొనేందుకు రూ.10 చొప్పున అదనపు వేతనం సమకుర్చూతున్న వర్క్ సైట్లలో వాటిని వేయించడంలో ఫీల్డ్ అసిస్టెంట్‌లు గాని, ఎపివో లుగాని ఈ విషయంలో ఎలాంటి చర్యలు తీసుకోవటం లేదు. మరో వైపు త్రాగునీటి ఏర్పాటు కూడ అధికారుల పట్టించుకోకుండా కూలీల కే రూ.5 అలవెన్సు ఇచ్చి చేతుల దులుపుకుంటున్నారు. జిల్లాలో మొత్తం 108497 జాబ్‌కార్డులు జారీ చేయగా, వీటి ద్వారా 245119 మంది ఉపాధి పొందే అవకాశం కల్పించారు. వాస్తవానికి ఈ జాబ్‌కార్డులు పొందిన వారిలో 35 నుండి 45శాతానికి మించి ఎవరు పనులకు రాని పరిస్థితి కొనసాగుతుంది. జాబ్‌కార్డుల పొందిన వారిలో 60 శాతం వరకు పనికి రాని వారు ఉన్నట్లు అధికారులు అంచనా వేస్తుండగా, ఇందులో ఎక్కువగా భూస్వాములు, రైతులు, వ్యాపారులు ఉన్నట్లు తెలుస్తుంది.

ముదిరిన ఎండలు…

ప్రస్తుతం వేసవి ఎండలు మండుతున్నాయి. దీనికి తోడు వడగాల్పులు ఉధృతమయ్యాయి. ఉదయం రెండు మూడు గంటలు మినహా మిగితా సమయమంతా ఉష్ణోగ్రతలు విజృంభిస్తుండటంతో పని ప్రదేశాల్లో ఉపాది కూలీలు పని చేయడం ఇబ్బందిగా మారింది. ఈ ఏడాది పిబ్రవరి చివరి వారం నుంచి ఎండల తీవ్రత అధికం కావటంతో మార్చి నుంచి ఉపాధీ కూలీలు ఉదయం 7గంటల నుండి 10 గంటల మద్యే ఉపాధి పనులకు వెళ్తున్నారు. కొంచెం ఆలస్యం అయిన కూలీలు ఎండ తీవ్రతకు అల్లాడుతున్నారు. ప్రభుత్వం కూలీల కోసం రక్షణాత్మక చర్యలు తీసుకున్న వాటి ఆచరణ ఎక్కడ కనబడటం లేదు. ముఖ్యంగా నీడ సౌకర్యం, త్రాగునీటి వసతి ఏర్పాట్లలో పూర్తిగా అధ్వాన్నంగా మారినట్లు కూలీలు చెబుతున్నారు. ఎండ తీవ్రత నుంచి ఉపశమనం పొందేందుకు షెడ్‌నెట్ ల ఏర్పాటు కోసం ప్రత్యేకంగా మనుషులను ఏర్పాటు చేసినప్పటికి వాటి ఏర్పాటు ఎక్కడ కూడ లేవు. ఇక తాగునీటి కోసం అధికారులు కూలీలకు రూ.5 చెల్లించి చేతులు దులుపుకుంటున్నారు. ఫలితంగా కూలీలు నిర్లక్ష్యంగా చాలి చాలని బాటిళ్లతో నీటిని తీసుకొని పోయి డ్రీహైడ్రేషన్ బారిన పడుతున్నారు. ఇక డ్రీహైడ్రేషన్ బారిన పడిన వారికి ప్రథమ చికిత్స అందించే పరిస్థితులు అంతంత మాత్రంగా ఉన్నాయి. పని జరుగుతున్న ప్రాంతాల్లో ఫిల్డ్ అసిస్టెంట్‌లు కూలీలకు ఒఆర్‌ఎస్ ప్యాకెట్లు అందించాల్సి ఉండగా ఎక్కడ కూడ వాటిని అందించడం లేదని కూలీలు చెబుతున్నారు. వడదెబ్బకు గురైన వారు ఆసుపత్రికి చేరే లోపు మృత్యువాత పడే అవకాశం ఉన్నట్లు వైద్యనిపుణులు చెబుతున్నారు. ఈ ఏడాది ఇప్పటి వరకు ఆ స్థాయి పరిస్థితులు రాకపోయినప్పటికి ముందు జాగ్రత్త చర్యలు చేపట్టకపోవటం పట్ల విమర్శలు వెల్లువెత్తున్నాయి.

 

Sun Stroke on Hundred Day Workers in Peddapalli