ముంబై: భారత మాజీ కెప్టెన్, దిగ్గజ క్రికెటర్ సునీల్ గవాస్కర్ కరోనా బాధితుల కోసం భారీ విరాళాన్ని ప్రకటించారు. కరోనా నివారణ కోసం కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు తీసుకుంటున్న చర్యలకు తనవంతు సహాయంగా రూ.59 లక్షల భారీ విరాళాన్ని అందించాలని నిర్ణయించారు. ఇందులో రూ.35 లక్షలు పిఎం కేర్స్ సహాయనిధికి అందించారు. మరో 24 లక్షల రూపాయల విరాళాన్ని మహారాష్ట్ర సిఎం సహాయ నిధికి అందించాలని నిర్ణయించారు. ఈ విషయాన్ని గవాస్కర్ కుమారుడు, మాజీ క్రికెటర్ రోహన్ గవాస్కర్ మంగళవారం ట్విటర్ ద్వారా వెల్లడించారు. ఇక, కరోనా బాధితుల సహాయం కోసం ప్రతి ఒక్కరూ తమవంతు సహకారం అందించాలని సునీల్ గవాస్కర్ కోరారు. ఈ మహమ్మరిని రూపుమాపేందుకు ప్రభుత్వాలు చేస్తున్న కృషిని ఆయన ప్రశంసించారు. ప్రజలు కూడా లాక్‌డౌన్ నిబంధనలు కచ్చితంగా అమలు చేసి వ్యాధి విజృంభించ కుండా చూడాలని సూచించారు.
పుజారా కూడా..
మరోవైపు టీమిండియా స్టార్ క్రికెటర్ చటేశ్వర్ పుజారా కూడా కరోనా నివారణ చర్యలకు తనవంతు ఆర్థిక సహాయం అందించేందుకు ముందుకు వచ్చాడు. ఈ మేరకు పిఎం కేర్స్‌కు పెద్ద మొత్తంలో ఆర్థిక సహాయం అందిస్తున్నట్టు పుజారా ప్రకటించాడు. అయితే తాను ఎంత మొత్తాన్ని విరాళంగా అందించాడో మాత్రం పుజారా తెలపలేదు. ఈ క్లిష్ట సమయంలో కరోనా నివారణ కోసం తమవంతు సహాయం అందించేందుకు తమ కుటుంబ సభ్యులు ముందుకు వచ్చారని ట్విటర్‌లో పేర్కొన్నాడు. ప్రతి ఒక్కరూ కూడా లాక్‌డౌన్‌ను సక్రమంగా పాటించి కరోనాను దేశం నుంచి తరిమి కొట్టాలని పుజారా పిలుపునిచ్చాడు.