Home మంచిర్యాల ‘ఉపాధి’కి వడదెబ్బ

‘ఉపాధి’కి వడదెబ్బ

land

*వడదెబ్బకు గురై ఈజిఎస్ ఉద్యోగి మృతి
*పెరుగుతున్న ఉష్ణోగ్రతలు
*పనుల ప్రదేశాల్లో నీడ, నీరు కరువు
*స్పందించని అధికార యంత్రాంగం

మన తెలంగాణ/మంచిర్యాల ప్రతినిధి  ఉపాధి హామీ కూలీలకు నీడ,నీరు కరువయ్యాయి. ఎండ వేడిమిని తట్టుకోలేక కూలీలతో పాటు ఉద్యోగులు అల్లాడి పోతున్నారు. రెక్కాడితే కాని డొక్క నిండని కూలీలు ఎండవేడిమి సైతం లెక్క చేయకుండా ఉపాధి పనులకు వెళ్తున్నారు. ఎండలోనే పని చేస్తూ అస్వస్తతకు గురువుతున్నారు. పనుల ప్రదేశాల్లో అధికారులు ఎండవేడిమికి నివారణ కు చర్యలు చేపట్టకపోవడంతో చిన్న చితక ఉద్యోగులు వడదెబ్బకు గురై ప్రాణాలు కోల్పోతున్నారు. తిర్యాణి మండలంలో ఉపాధి పనులు జరుగుతున్న ప్రదేశంలో అక్కడ సిఏగా పని చేస్తున్న జాదవ్ గణేష్ (25) వడదెబ్బకు గురై చికిత్స పొందుతూ మృతి చెందాడు. వడదెబ్బ తాకి తీవ్ర అస్వస్తతకు గురైన గణేష్‌ను ఆదిలాబాద్‌లోని రిమ్స్‌లో చేర్పించగా చికిత్స పొం దుతూ శుక్రవారం రాత్రి మృతి చెందాడు. అయినప్పటికీ కూడా అధికారులు ఉపాధి హామీ పనుల ప్రదేశంలో నీడ కల్పించేందుకు చర్యలు తీసుకోవడం లేదు. పనులు జరుగుతున్న ప్రదేశంలో టెంట్లు, మంచినీటి వసతి కల్పించాలని చట్టాలు చెబుతున్నప్పటికీ అధికారులు లెక్కచేయడం లేదు. దినదినానికి బాణుడి భగభగలతో ఉష్ణోగ్రతలు పెరిగిపోతుండగా నీడ కల్పించడం లేదని కూలీలు వాపోతున్నారు. ప్రస్తుతం వేసవి కాలం కావడంతో కూలీలు ఎండలో పని చేసేందుకు తీవ్రమైన ఇబ్బందులను ఎదుర్కొంటున్నారు. కనీసం తాగునీటిని కూడా అందుబాటులో ఉంచడం లేదని వాపోతున్నారు. మెడికల్ కిట్లతోపాటు ఓఆర్‌ఎస్ ప్యాకె ట్లు పనుల ప్రదేశాల్లో ఉంచాలని స్పష్టమైన ఆదేశాలు ఉన్నప్పటికీ పట్టించుకోవడం లేదని, ఆందోళన చెందుతున్నారు. ప్రతినిత్యం ఎంతో మంది అస్వస్తతకు గురువుతున్నా అధికారులకు కనువిప్పుకావడం లేదని అంటున్నారు. మంచిర్యాల జిల్లాలో మహాత్మగాందీ జాతీయ ఉపాధి హామీ పథకం ద్వారా 1.23 లక్షల జాబ్‌కార్డులను జారి చేయడం జరిగింది. 69,296 కుటుంబాలకు 65.93 కోట్ల రూపాయల కూలి వేతనాలను చెల్లించారు. మారుమూల ప్రాంతాలైన వేమనపల్లి, కోటపల్లి, నెన్నెల, భీమిని, కన్నెపల్లి, తాండూర్, జైపూర్, భీమారం, జన్నారం, దండేపల్లి, లక్షెట్టిపేట మండలాల్లో ఉపాధి హామీ పనులు పెద్ద ఎత్తున జరుగుతుండగా పనుల ప్రదేశాల్లో నిబంధనల ప్రకారం..నీడ కల్పించడం లేదని, కూలీలు వాపోతున్నారు. ఉదయం 8 గంటలకే ఉష్ణోగ్రతలు పెరగడంతో పని చేయలేకపోతున్నామని కూలీలు వాపోతున్నారు. కోట్లాది రూపాయలు వెచ్చించి పనులు చేపడుతుండగా కూలీలకు సౌకర్యాలు కల్పించే విషయంలో అధికారులు పూర్తిగా విఫలం చెందుతున్నారని వాపోతున్నారు. ఇప్పటికైనా అధికారులు పనుల ప్రదేశాల్లో టెంట్లు, మంచినీరు,మెడికల్ కిట్లు, ఓఆర్‌ఎస్ ప్యాకెట్లు అందుబాటులో ఉండే విధంగా చర్యలు తీసుకోవాలని కోరుతున్నారు.