Home తాజా వార్తలు సన్‌రైజర్స్ నాకౌట్ ఆశలు గల్లంతు!

సన్‌రైజర్స్ నాకౌట్ ఆశలు గల్లంతు!

Sunrisers will leave the IPL 2021 bio-bubble

 

అద్భుతం జరిగితే తప్ప ముందుకు వెళ్లడం కష్టమే!

దుబాయి: ఐపిఎల్‌లో అత్యంత నిలకడైన ప్రదర్శన చేసే జట్లలో సన్‌రైజర్స్ హైదరాబాద్ ఒకటి. 2016లో తొలిసారి ఐపిఎల్ ట్రోఫీని ముద్దాడిన సన్‌రైజర్స్ ఆ తర్వాత ఆడిన ప్రతి సీజన్‌లోనూ ప్లేఆఫ్‌కు అర్హత సాధిస్తూ వస్తోంది. ప్రతి సీజన్‌లోనూ హైదరాబాద్ ట్రోఫీ ఫేవరెట్‌లలో ఒకటిగా బరిలోకి దిగడం సంప్రదాయం వస్తోంది. యుఎఇలో జరిగిన ఐపిఎల్13లో కూడా హైదరాబాద్ ప్లేఆఫ్‌కు అర్హత సాధించింది. ఇక సీజన్14లో మరింత మెరుగైన ప్రదర్శన చేయడం ఖాయమని విశ్లేషకులు అంచనా వేశారు. అయితే ఈ సీజన్‌లో హైదరాబాద్‌కు ఏది కలిసి రావడం లేదు. భారత్ వేదికగా జరిగిన తొలి దశ మ్యాచుల్లో అత్యంత పేలవమైన ప్రదర్శనతో నిరాశ పరిచింది. గెలవాల్సిన మ్యాచుల్లో కూడా చేజేతులా ఓటమి పాలైంది. తాజాగా యుఎఇలో జరుగుతున్న రెండో దశ మ్యాచ్‌లను కూడా ఓటమితో ఆరంభించింది. ఈ సీజన్‌లో ఆడిన 8 మ్యాచుల్లో ఏడింటిలో ఓటమి పాలై ప్లేఆఫ్ రేసు నుంచి దాదాపు నిష్క్రమించింది.

ప్రస్తుత పరిస్థితిల్లో సన్‌రైజర్స్ నాకౌట్ అవకాశాలు దాదాపు మూసుకు పోయాయనే చెప్పాలి. ఇకపై ఆడే ఆరు మ్యాచుల్లో గెలిచినా హైదరాబాద్ ప్లేఆఫ్ చేరుకుంటుందని కచ్చితంగా చెప్పలేం. ఇతర జట్ల ఫలితాలను బట్టి ఆ అవకాశాలు ఆధారపడి ఉంటాయి. అయితే ప్రస్తుతం హైదరాబాద్ ఆడుతున్న తీరును గమనిస్తే నాకౌట్‌కు చేరుకుంటుందని ఆశించడం అత్యాశే అవుతుంది. ఢిల్లీతో బుధవారం జరిగిన మ్యాచ్‌లో ఓటమి పాలు కావడంతో హైదరాబాద్ ఆశలు నీరుగారి పోయాయి. ఈ సీజన్‌లో హైదరాబాద్ అత్యంత చెత్త ఆటను కనబరుస్తోంది. బ్యాటింగ్, బౌలింగ్ విభాగాల్లో పేలవమైన ఆటతో నిరాశ పరుస్తోంది. గెలవాల్సిన మ్యాచుల్లో కూడా ఓటమి మూటగట్టుకుంటోంది. ఒంటిచేత్తో మ్యాచ్ ఫలితాన్ని తారుమారు చేసే బ్యాట్స్‌మెన్‌లు బౌలర్లు అందుబాటులో ఉన్నా హైదరాబాద్ రాత మారడం లేదు. వరుస ఓటములతో పాయింట్ల పట్టికలో అట్టడుగు స్థానంలో నిలిచింది. ఐపిఎల్‌లో సన్‌రైజర్స్ ఇలాంటి చెత్త ప్రదర్శన చేయడం ఇదే తొలిసారి.

బ్యాటింగే అసలు సమస్య..
ఇక ఈ సీజన్‌లో హైదరాబాద్ వరుస ఓటములకు బ్యాటింగ్ వైఫల్యమే ప్రధాన కారణమని చెప్పడంలో ఎలాంటి అతిశయోక్తి లేదు. విధ్వంసక బ్యాటింగ్‌కు మరో పేరుగా చెప్పుకునే డేవిడ్ వార్నర్ ఈసారి తన స్థాయికి తగ్గ బ్యాటింగ్‌ను కనబరచడంలో విఫలమవుతున్నాడు. అతని వైఫల్యం జట్టుపై బాగానే ప్రభావం చూపుతోంది. తొలి దశ మ్యాచుల్లో మరో ఓపెనర్ జానీ బెయిర్‌స్టో నిలకడగానే ఆడాడు. వార్నర్ మాత్రం ఒకటి రెండు మ్యాచుల్లో మాత్రమే రాణించాడు. పేలవమైన బ్యాటింగ్ వల్ల వార్నర్ కెప్టెన్సీని కూడా వదులుకోవాల్సి వచ్చింది. అంతేగాక మొదటి దశలో చాలా మ్యాచుల్లో తుది జట్టులో స్థానం కూడా సంపాదించలేక పోయాడు. అయితే రెండో దశలో బెయిర్‌స్టో లేక పోవడంతో వార్నర్‌కు చాన్స్ దొరికింది. అయినా దీన్ని తనకు అనుకూలంగా మార్చుకోవడంలో విఫలమయ్యాడు.

ఢిల్లీతో జరిగిన మ్యాచ్‌లో ఖాతా తెరవకుండానే పెవిలియన్ చేరాడు. ఇక మరో ఓపెనర్ వృద్ధిమాన్ సాహా కూడా పెద్దగా రాణించలేక పోతున్నాడు. పలు మ్యాచుల్లో అవకాశాలు దొరికినా సాహా సత్తా చాటడంలో విఫలమయ్యాడు. విజయ్ శంకర్, మనీష్ పాండేలు కూడా పేలవమైన ప్రదర్శనతో నిరాశే మిగిల్చారు. జట్టును ఆదుకోవడంలో వీరిద్దరూ విఫలమయ్యారు. రెండో దశలోనైనా వీరు జట్టుకు అండగా నిలుస్తారా లేదా అనేది సందేహమే. ఇక వార్నర్ స్థానంలో కెప్టెన్సీ చేపట్టిన న్యూజిలాండ్ స్టార్ కేన్ విలియమ్సన్ కూడా అంతంత మాత్రం బ్యాటింగ్‌ను కనబరుస్తున్నాడు. ఇటు కెప్టెన్‌గా అటు బ్యాట్స్‌మన్‌గా ఆకట్టుకోలేక పోతున్నాడు. అతనిపై జట్టు ఎన్నో ఆశలు పెట్టుకున్నా ఫలితం లేకుండా పోయింది. అబ్దుల్ సమద్, ప్రియమ్ గార్గ్, మహ్మద్ నబి తదితరులు కూడా తమపై ఉంచిన నమ్మకాన్ని నిలబెట్టడంలో విఫలమయ్యారు.

ఇలాంటి స్థితిలో హైదరాబాద్ స్వల్ప లక్ష్యాన్ని సయితం ఛేదించలేక ఓటమి పాలవుతోంది. మిగిలిన మ్యాచుల్లోనైనా వీరంతా సమష్టిగా రాణించాల్సిన అవసరం జట్టుకు ఎంతైనా ఉంది. బౌలర్లు కూడా పెద్దగా ప్రభావం చూపలేక పోయారు. భువనేశ్వర్, రషీద్ ఖాన్, సిద్ధార్థ్ కౌల్, సందీప్ శర్మ, ఖలీల్ అహ్మద్, జేసన్ హోల్డర్, నబి తదితరులు జట్టులో ఉన్నా ఫలితం పెద్దగా కనిపించడం లేదు. ముఖ్యంగా రషీద్ వైఫల్యం జట్టును వెంటాడుతోంది. ఈ సీజన్‌లో రషీద్ తన స్థాయికి తగ్గ ప్రదర్శన చేయడంలో విఫలమయ్యాడు. భువనేశ్వర్ కూడా అంతంత మాత్రంగానే రాణించాడు. ఇలా బ్యాటింగ్, బౌలింగ్ విభాగాల్లో విఫలం కావడంతో హైదరాబాద్‌కు వరుస పరాజయాలు తప్పడం లేదు.

నాకౌట్ బెర్త్ కష్టమే..
ఇప్పటికే 8 మ్యాచ్‌లను ఆడిన హైదరాబాద్ కేవలం ఒక్క విజయాన్ని మాత్రమే అందుకుంది. మరోవైపు ఇతర జట్లు కనీసం మూడేసి విజయాలతో ముందంజలో ఉన్నాయి. ఇలాంటి స్థితిలో ఇకపై ఆడే ఆరు మ్యాచుల్లో కూడా గెలవాల్సిన పరిస్థితి సన్‌రైజర్స్‌కు నెలకొంది. తీవ్ర ఒత్తిడిలో ఉన్న హైదరాబాద్ వరుసగా ఆరు మ్యాచుల్లో గెలుస్తుందని ఆశించడమే అత్యాశే అవుతోంది. ఒక వేళ అన్ని మ్యాచుల్లో గెలిచినా రన్‌రేట్‌తో పాటు ఇతర జట్ల ఫలితాలు కీలకంగా మారుతాయి. ప్రస్తుతం ముంబై, బెంగళూరు, చెన్నై, ఢిల్లీ క్యాపిటల్స్ జట్లు నాకౌట్ రేసులో ముందు వరుసలో ఉన్నాయి. ఈ జట్లన్నీ ఇప్పటికే కనీసం ఐదు మ్యాచుల్లో విజయం సాధించాయి. హైదరాబాద్ పరిస్థితి దీనికి పూర్తి భిన్నంగా ఉంది. కేవలం ఒక విజయం మాత్రమే సాధించడంతో నాకౌట్ రేసులో చాలా వెనుకబడి పోయింది. ఏదైనా అనూహ్యం జరిగితే తప్ప హైదరాబాద్ నాకౌట్ ఆశలు గల్లంతయ్యాయని చెప్పక తప్పదు.

Sunrisers will leave the IPL 2021 bio-bubble