Home ఎడిటోరియల్ మూఢనమ్మకాలు శాస్త్ర ప్రగతికి అవరోధం

మూఢనమ్మకాలు శాస్త్ర ప్రగతికి అవరోధం

Superstitions

 

కలియుగం నుంచి కంప్యూటర్ యుగం వరకు మానవుడు ఎంతగానో వైజ్ఞానిక అభివృద్ధి సాధించి విశ్వ రహస్యాలను ఛేదిస్తూ విశ్వ మానవుడుగా ఎదుగుతున్న క్రమంలో మూఢనమ్మకాలు సమాజాన్ని వెనక్కు నెట్టడం విచారకరం. మానవుడు అనేక విషయాలను తెలుసుకుంటూ మానవాభివృద్ధికి నిరంతరం కృషి చేస్తూ వైజ్ఞానిక ప్రగతి పైపు పరిగెడుతున్నాడు. కానీ ప్రస్తుత సమాజంలో మూఢనమ్మకాలు అనేక రూపాలలో విజృంభిస్తున్నాయి. ముఖ్యంగా గ్రామాలలో బాబాలు, స్వాములు, మంత్రగాళ్ళు విభిన్నమైన వేషధారణతో ప్రజల్లోకి వచ్చి తమ దగ్గర మహిమలు,మాయలు, అతీంద్రియ శక్తులు ఉన్నాయని మాయ మాటలు చెబుతూ మీ ఇంటిపై , ఒంటిపై ఉన్న శక్తులను నాశనం చేసే శక్తి మాకు ఉన్నదని సామాన్య జనాన్ని బురిడీ కొట్టించి డబ్బులు వసూలు చేస్తున్నారు. అదేవిధంగా పాస్టర్లు స్వస్థత కూటముల పేరుతో కళ్ళు లేని వారికి కళ్ళు, కాళ్లు లేనివారికి కాళ్లు ప్రార్థన ద్వారా చేకూరుతాయని ప్రజానీకాన్ని మాయ మాటలు చెప్పు మూఢవిశ్వాసాల వైపు తీసుకెళ్తున్నారు.ఇలాంటివి శాస్త్రీయతకు నిరూపణ కాని అశాస్త్రీయ నమ్మకాలు, వీటి వల్ల జరిగే మేలు ఎంత వరకు నిజం? వీటి బండారాన్ని సైన్స్ బయటపెడుతున్నది.

అదే విధంగా ప్రస్తుతం వివిధ మతాలలో కూడా అనేక రూపాలలో మూఢనమ్మకాలు, అంధ విశ్వాసాలు విచ్చలవిడిగా వ్యాపింపజేస్తూ సామాన్య జనాన్ని అజ్ఞానులను చేస్తున్నారు.నేడు సైన్స్ ఎంతగానో అభివృద్ధి చెందినప్పటికీ గ్రామ ప్రాంత ప్రజలు అస్వస్థతకు గురైనా, చిన్న పిల్లలు ఏడ్చినా, వాంతులు-విరేచనాలు అయినా, ఇతర అనారోగ్య సమస్యలు తలెత్తినా బాబాలను, స్వాములను, సిగం ఊగే వాళ్లను, పాస్టర్లును ఆశ్రయించడం జరుగుతుంది. వారు ఇచ్చే పసుపు, కుంకుమ ,విభూతిని, నిమ్మకాయలను, కొబ్బరి కాయలను తీసుకొని వచ్చి రాత్రిపూట ఆది, గురువారం, అమావాస్య రోజున గ్రామ ప్రాంత నడివీధుల్లో పెట్టి వారి రోగాలకు స్వాంతనగా భావించడం జరుగుతుంది.అదేవిధంగా గ్రామంలో విజృంభించిన వ్యాధులకు కారణం గ్రామ దేవత అని, గ్రామదేవతను శాంతింప చేయాలని జంతుబలులు, నరబలులు చేయడం లాంటి సంఘటనలు కూడా అక్కడక్కడ ఎదురు కావడం జరుగుతుంది .కానీ వీటివల్ల వారి ఆరోగ్య సమస్యలకు పరిష్కారం లభించదు. చివరికి ప్రాణాల మీదికి కొనితెచ్చుకుంటున్నారు. ఇలాంటి మూఢనమ్మకాలను అజ్ఞానులతో పాటు విజ్ఞానులు కూడా పాటించడం చాలా విచారించదగ్గ విషయం.

నేడు ఎంతో వైజ్ఞానిక అభివృద్ధి జరిగి ప్రజల సామాజిక, ఆర్ధిక జీవితాలలో మార్పు జరిగినప్పటికీ ప్రజలు అనేక అంద విశ్వాసాలను నమ్మడం విచారకరం.ముఖ్యంగా పాము పాలు తాగుతుందని భావించడం, నల్ల పిల్లి, పాము ఎదురైనా, ఎవరైనా తుమ్మినా అపశకునంగా భావించడం లాంటి సంఘటనలు గ్రామ ప్రాంతాల్లో విరివిగా కనబడతాయి. మానవ శ్రమతో ముడిపడిన చదువు, వ్యాపార ప్రగతి , ఆడ ,మగ కలయికతో పుట్టిన పిల్లలకు కూడా అతీంద్రియ శక్తి (దేవుని యొక్క మహిమ, మాయ కారణం) లు కారణం అని ఆపాదించడం, ఇస్రో శాస్త్రవేత్తల్లో రాకెట్ ప్రయోగానికి ముందు రాకెట్ ప్రతిమలు దేవుని ముందు పెట్టడం లాంటి అంశాలు మానవ శాస్త్ర ప్రగతిని, శ్రమను, మేధస్సును తక్కువ చేయడమే. ప్రస్తుతం సమాజంలో అక్షరాస్యులు, నిరక్షరాస్యులు,గ్రామ, పట్టణ ప్రాం తాలు అనే తేడా లేకుండా మూఢనమ్మకాలు, అంధ విశ్వాసాలు రోజురోజుకు వెళ్లానుకొని విజృంభించడం మానవ ప్రగతికి పెద్ద అవరోధంగా భావించవచ్చు. అదేవిధంగా నేడు మూఢనమ్మకాలు సామాజిక, ఆర్థిక, రాజకీయాలను అనేక రూపాలలో ప్రభావితం చేస్తూ శాస్త్ర ప్రగతికి అవరోధంగా మారి ప్రజల్ని అంధ విశ్వాసాల వైపు తీసుకెళ్లడం జరుగుతుంది.

గ్రామీణ ప్రాంత ప్రజలు డాక్టర్లు ఇచ్చే మందుల కన్నా వారు చెప్పే సలహాల కన్నా బాబాలమని, స్వాములమని చెప్పుకునే మాయగాళ్ళను ఎక్కువ నమ్మడం చాలా విషాదకరమైన విషయం. నిజంగా వీరి మాయలకు, మహిమలకు అతీత శక్తులుశక్తులున్నాయా అంటే ఏమీ ఉండవు. విరు చేసే ప్రతి మహిమలు, మాయల వెనుక ఏదో ఒక సైన్స్ ట్రిక్ మాత్రమే దాగి ఉండి హస్తలాఘవం ద్వారా మాయగా, మంత్రంగా సామాన్య జనానికి చూపిస్తూ వారిని మోసం చేయడం జరుగుతుంది. అదేవిధంగా గ్రామ ప్రాంతాలలో కొందరిని మంత్ర గాల్లనే నెపంతో అతి కిరాతకంగా కాల్చి చంపడం లాంటి సంఘటనలు కూడా ఎదురు కావడం జరుగుతుంది తద్వారా ఈ మూఢ నమ్మకాలు సామాజిక సమస్యగా మారుతున్నాయి. మూఢనమ్మకాలు తల్లిదండ్రుల ద్వారా పిల్లలు కూడా వాటిని నమ్ముతూ పాటించడం జరుగుతుంది తద్వారా భవిష్యత్ సమాజం అంధకారం వైపు వెళుతోంది. కావున మూఢనమ్మకాల నిర్మూలన అనేది చాలా ప్రాధాన్యమైన అంశంగా నేడు ప్రభుత్వాలు గమనించవలసిన అవసరం ఉంది.

మూఢ నమ్మకాలకు వ్యతిరేకంగా వైజ్ఞానిక అలవాట్లను పెంపొందించడానికి పాఠశాల పునాది కావాల్సిన అవసరం ఉంది. సమకాలీన సమాజంలో మతాలను గౌరవిస్తూ వివిధ మతాలలో ఉన్న మూఢనమ్మకాలను, అంధ విశ్వాసాలను తొలగించడానికి ప్రభుత్వం మరియు ప్రజా సైన్స్ సంస్థలు నిరంతరం కృషి చేయాలి. మూఢనమ్మకాలకు వ్యతిరేకంగా అనేక ప్రజా సైన్స్ ఉద్యమాలు పలు రాష్ట్రాల్లో వివిధ పేర్లతో కొన సాగుతున్నాయి, ప్రస్తుతం తెలుగు రాష్ట్రాలలో కూడా‘ జన విజ్ఞాన వేదిక ‘ పేరుతో నిరంతరం వివిధ ప్రదర్శన కార్యక్రమాల ద్వారా ప్రజల్ని చైతన్యం చేస్తూ వైజ్ఞానిక సమాజం వైపు తీసుకు వెళ్లడానికి కృషి చేస్తున్నాయి. అదేవిధంగా ప్రభుత్వం కూడా మూఢనమ్మకాల నిర్మూలనకు పటిష్టమైన చట్టాలను తీసుకురావాల్సిన అవసరం ఉంది.

Superstitions are a barrier to scientific progress