Thursday, April 18, 2024

నష్టాల్లోనూ చెదరని నాణ్యత

- Advertisement -
- Advertisement -

current

 

విద్యుత్ రంగంలో తెలంగాణ విశిష్టత

హైదరాబాద్ : నష్టాలను భరిస్తూ కూడా నాణ్యమైన విద్యుత్‌ను ప్రజలకు అందిస్తున్నది తెలంగాణ ప్రభుత్వం. రైతు సంక్షేమమే ధ్యేయమంటూ వారికి కరెంటును ఉచితంగా సరఫరా చేస్తున్నది. ప్రజలకు, పరిశ్రమలకు కోతల్లేకుండా 24 గంటలూ విద్యుత్‌ను అందించడమే కాకుండా మౌలిక వసతులను కల్పిస్తున్నది. గత 2018 నుంచి ఎన్నో సవాళ్ళను ఎదుర్కొంటూ కూడా 24 గంటలు కరెంటును సరఫరా చేస్తూ మిగతా రాష్ట్రాలకు మార్గదర్శకంగా నిలుస్తున్న తెలంగాణ డిస్కంలు గణనీయమైన ఆర్థిక భారాన్ని మోస్తున్నాయి. వ్యవసాయం, పేదల విద్యుత్ అవసరాలకు రాష్ట్ర ప్రభుత్వం రాయితీలను కూడా ఇస్తున్నది. పెరుగుతున్న విద్యుత్ డిమాండ్‌తో విద్యుత్ సంస్థలు అవసరాన్ని పరిగణలోకి తీసుకుని భారీస్థాయిలో విద్యుత్‌ను కొనుగోలు చేస్తున్నాయి.

ప్రతిష్టాత్మకం
రైతాంగానికి గత జనవరి 1, 2018 నుంచి 24గం.ల ఉచిత విద్యుత్ అమలు చేస్తున్న నేపథ్యంలో రాష్ట్రం భారీగా కరెంట్‌ను కొనుగోలు చేస్తోంది. రైతులకు నాణ్యమైన విద్యుత్‌ను అందించడాన్ని ప్రతిష్టాత్మకంగా తీసుకున్న ప్రభుత్వం ప్రైవేట్ విద్యుత్ సంస్థలతో ధీర్ఘకాలిక, స్వల్పకాలిక ఒప్పందాలతో పాటు పెరుగుతున్న డిమాండ్‌ను పరిగణలోకి తీసుకుని బహిరంగ మార్కెట్లో విద్యుత్ కొనుగోలును రాష్ట్రం చేపడుతోంది. యూనిట్‌కు సరాసరి రూ. 5.45లు అయినా గరిష్టంగా యూనిట్‌కు రూ.18 వరకు ఖర్చు చేస్తోందనేది అధికార వర్గాల అభిప్రాయం.

విద్యుత్ సంస్థల పంపణీ వ్యయమే యూనిట్‌కు రూ. 7.02లుగా ఉన్నదనేది అధికారుల అభిప్రాయం. వివిధ టారీఫ్‌ల వారిగా కనిష్టంగా రూ.1.45లు నుంచి ప్రారంభమవుతోంది. ప్రభుత్వం రైతాంగానికి ఉచిత విద్యుత్ అమలు చేయడంతో పాటు ఎస్సీ, ఎస్టీలకు రాయితీలు, సెలూన్లకు, గృహ విద్యుత్ చార్జీలు, పౌల్ట్రీ ఫారాలు, సెరికల్చర్ తదితర ఫథకాలకు అందిస్తున్న రాయితీలతో కూడా తడిసి మోపడవుతోన్నా ప్రభుత్వం నాణ్యమైన విద్యుత్‌ను అందించడంలో రాజీలేకుండా కృషిచేస్తుంది.

4 ఏళ్ళలో భారీగా పెరిగిన డిమాండ్
నాణ్యంగా, కోతల్లేకుండా విద్యుత్‌ను సరఫరా నేపథ్యంలో సంస్థలు చేస్తున్న ఖర్చుకు సంస్థకు చేకూరుతున్న ఆదాయానికి చాలా వ్యత్యాసం ఉంటుందని గ్రహించి కూడా డిస్కంలు మాత్రం సరఫరాలో ఎలాంటి లోటు రాకుండా ముందస్తు ప్రణాళికలతో సిద్దంగా ఉన్నది. విద్యుత్ పంపిణీ సంస్థల వసూళ్ళ సామర్థం 100 నుంచి 91శాతానికి చేరుకున్నదనేది అధికారుల అభిప్రాయం. ఫలితంగా డిస్కంలు విద్యుత్ సరఫరాకు వంద రూపాయలు ఖర్చు చేస్తే బిల్లుల రూపేణా 91 రూపాయలు వసూలవుతోందని, నూటికి రూ. 9 లు నష్టపోతున్నట్టు అధికారుల అంచనాగా ఉన్నది. తెలంగాణ ఏర్పడే నాటికి 2014-15 లో విద్యుత్ గరిష్ట డిమాండ్ కేవలం 6500 మెగావాట్లు ఉండగా 2018-19 నాటికి గరిష్ట డిమాండ్ 10,818 మెగావాట్లకు చేరినట్టు అధికారులు వివరిస్తున్నారు.

నేడు 2019- 20లో 11,200 మెగా వాట్లకు చేరుకున్నట్టు అధికారులు పేర్కొంటున్నారు. వచ్చే ఫిబ్రవరి నాటికి గరిష్ట డిమాండ్ 12500 మెగావాట్లకు చేరుకుంటుందని అంచనాలు కూడా ఉన్నాయి. అప్పట్లో 46 వేల మిలియన్ యూనిట్లు విద్యుత్ సరఫరా ఉంటే అదికాస్త నేడు 60 వేల మిలియన్ యూనిట్లకు పైగా సరఫరా జరుగోతోంది. రోజు వారి గరిష్ట విద్యుత్ వినియోగం కూడా గత అక్టోబరు 9న 233.44 మిలియన్ యూనిట్లు నమోదైనట్టు రికార్డులు వెల్లడిస్తున్నాయి. ఇది వచ్చే ఫిబ్రవరి నాటికి 270 మిలియన్ యూనిట్లకు పెరుగుతుందని అంచనా వేస్తున్నారు. డిస్కంలు బ్యాంకుల్లో అప్పులు చేసి కూడా విద్యుత్ కొనుగోలు చేస్తున్నాయి. కరెంటు కోతల్లేకుండా విద్యుత్తు సరఫరా చేసేందుకు తెలంగాణ ఏర్పాటైన నాటి నుంచి నేటి వరకు వేలకోట్ల రూపాయలు చెల్లించి కొనుగోలు చేస్తున్నారు.

గత 2014-15 మినహా తెలంగాణ వచ్చాక 2015-16, 2016-17, 2018-19 ఆర్థిక సంవత్సరాల్లో విద్యుత్ చార్జీలు పెంచలేదు. అంతేకాకుండా ప్రభుత్వం సబ్సడీ కోసం బడ్జెట్లో విడుదల చేసే నిధులు రూ.5 వేలకోట్ల వరకు ఉంటున్నాయి. దీనికి తోడు విద్యుత్ పంపిణీ సంస్థల్లో విద్యుత్ బిల్లుల బకాయిలు కూడా నెల నెలా పెరిగిపోతున్నయి. డిస్కంల బకాయిలు మొత్తం రూ. 2.5 వేల కోట్లకు పైగా పెరిగినట్టు సమాచారం. గతంలో రైతులకు 9 గం.ల విద్యుత్ కోసం మౌలిక వసతులకు రూ.1585.91 కోట్లు అదనపు పెట్టుబడులు అవసరమైనట్టు సమాచారం.

ఎస్పీడీసీఎల్ మార్కెట్ ఋణాల ద్వారా సమకూర్చుకోవడంతో డిస్కంకు 2016 17 లో రూ.1894.43 కోట్ల భారం పడింది. రాష్ట్ర ప్రభుత్వం 2018 జనవరి నుంచి 24 గంటల పాటు ఉచిత విద్యుత్ ఇవ్వాలని నిర్ణయించడంతో ఎస్పీడీసీఎల్ ఆర్థిక పరిస్థితులపై మరింత ప్రభావం చూపింది. ప్రభుత్వం విడుదల చేసిన రాయితీలో 2017 మార్చి నాటికి రూ.1268 .60 కోట్ల కొరత ఉంది. ఫలితంగా డిస్కమ్ నిర్వహణ మూలధనంపై దీని ప్రభావం పడింది. ఎస్పీడీసీఎల్ పై సర్‌చార్జీ రూపంలో రూ.96.07 కోట్ల భారం పడినట్టు అధికారులు వెల్లడిస్తుంది.

విద్యుత్ సంస్థలు                              రెవిన్యూ లోటు ఏటా.                            సరాసరివినియోగం

2015=16                                  రూ.4257కోట్లు                                  138 ఎంయు
2016=17                                  రూ.4593.45కోట్లు                             148 ఎంయు
2017=18                                  రూ.4777.04కోట్లు                             166 ఎంయు
2018=19                                  రూ.5940.47కోట్లు                             223 ఎంయు

 

Supply of quality current with enduring losses
- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News