Home తాజా వార్తలు బిఎస్-4 వాహనాల రిజిస్ట్రేషన్‌పై నిషేధం

బిఎస్-4 వాహనాల రిజిస్ట్రేషన్‌పై నిషేధం

Supreme Court ban BS4 Vehicles Registration

 

లాక్‌డౌన్‌లో వాహనాల సేల్స్‌పై సుప్రీం అసంతప్తి
తదుపరి విచారణ ఆగస్టు 13కు వాయిదా

న్యూఢిల్లీ : గత మార్చిలో పెద్ద మొత్తంలో విక్రయించిన బిఎస్ 4 వాహనాల రిజిస్ట్రేషన్‌ను సుప్రీంకోర్టు నిషేధించింది. మార్చి ఆఖరి వారం, మార్చి 31 తర్వాత లాక్‌డౌన్ సమయంలో బిఎస్4 వాహనాలు భారీగా అమ్ముడుపోవడం పట్ల కోర్టు అసంతృప్తి వ్యక్తం చేసింది. తదుపరి విచారణను ఆగస్టు 13కు వాయిదా వేసింది. ఏప్రిల్ 1 నుంచి దేశంలో బిఎస్6 నిబంధనలు అమల్లోకి వచ్చాయి. మార్చి 31 వరకు బిఎస్4 వాహనాల రిజిస్ట్రేషన్‌కు గడువు. అయితే ఈ గడువు పెంచాలని కోరుతూ ఫెడరేషన్ ఆఫ్ ఆటోమొబైల్ డీలర్స్ అసోసియేషన్(ఫాడా) తరఫున మార్చి 27న దాఖలు చేసిన పిటిషన్‌ను సుప్రీం కోర్టు విచారించి, అదనంగా 10 రోజుల పరిమితితో బిఎస్ -4 వాహనాల అమ్మకాలను అనుమతించింది.

నిబంధనల ఉల్లంఘనపై అసంతృప్తి..
ఈ సందర్భంలో అమ్మకందారులు రెగ్యులేటరీ పర్మిట్‌ను సరిగ్గా పాటించలేదు. ఇది బిఎస్4లను విక్రయించడానికి అదనపు అవకాశంగా వినియోగించుకున్నారు. ఇప్పటికే 2.55 లక్షల వాహనాల బుకింగ్, స్టాక్‌లో ఉన్న 1.05 లక్షల వాహనాల అమ్మకం, రిజిస్ట్రేషన్ అనుమతి ఉల్లంఘిస్తూ సేల్ అయ్యాయి. దీంతో మార్చి 27 తర్వాత విక్రయించిన బిఎస్ -4 వాహనాల వివరాలను, అలాగే రిజిస్ట్రేషన్ అయిన బిఎస్ -4 వాహనాల వివరాలపై నివేదికను దాఖలు చేయాలని న్యాయమూర్తులు ఆటోమొబైల్ డీలర్స్ అసోసియేషన్‌ను ఆదేశించారు.

జస్టిస్ అరుణ్ మిశ్రా అధ్యక్షతన జరిగిన సెషన్‌లో ఈ కేసు మరోసారి విచారణకు వచ్చింది. డీలర్స్ అసోసియేషన్ దాఖలు చేసిన నివేదికను న్యాయమూర్తులు పరిశీలించారు. గత మార్చిలో అత్యధికంగా బిఎస్ 4 ఇంజన్ వాహనాలు సేల్ అయ్యాయని, దీనిలో ఏదో మోసపూరితం ఉన్నట్లు న్యాయమూర్తులు అసంతృప్తి వ్యక్తం చేశారు. తదనంతరం బిఎస్ 4-వాహనాల రిజిస్ట్రేషన్ నిషేధించారు. బిఎస్ 4- ఇంజిన్ వాహనాలను తదుపరి ఆదేశాలు వచ్చే వరకు రిజిస్ట్రేషన్ చేయొద్దని కోర్టు ఆదేశించింది.

Supreme Court ban BS4 Vehicles Registration