Thursday, April 25, 2024

రైతు నేతలపై సుప్రీం ఆగ్రహం

- Advertisement -
- Advertisement -

న్యూఢిల్లీ: నూతన వ్యవసాయ చట్టాలపై ఏర్పాటు చేసిన తమ కమిటీపై రైతు సంఘాల నేతల వైఖరిపై సుప్రీంకోర్టు అసంతృప్తి వ్యక్తం చేసింది. కమిటీలోని సభ్యులపై రైతు నేతలు కించపరిచే విధంగా మాట్లాడటం, వారికి దురుద్ధేశాలను ఆపాదించడం సరికాదని ధర్మాసనం బుధవారం ఆగ్రహం వ్యక్తం చేసింది. తాము కమిటీ సభ్యులకు ఎటువంటి నిర్ణయాధికారం ఇవ్వలేదని, అయినా వారిపై అనుచిత వ్యాఖ్యలకు దిగడం ఏమిటని ప్రధాన న్యాయమూర్తి ఎస్‌ఎ బోబ్డేతో కూడిన బెంచ్ తెలిపింది. సుప్రీంకోర్టు నియుక్త కమిటీ సభ్యులను తొలిగించాలని రాజస్థాన్‌కు చెందిన రైతు సంఘం కిసాన్ మహాపంచాయత్ దాఖలు చేసిన పిటిషన్ విచారణ దశలో సుప్రీంకోర్టు తీవ్రంగా స్పందించింది. కొత్త వ్యవసాయ చట్టాలపై స్టే విధించిన సుప్రీంకోర్టు ఇటీవలే సమస్య పరిష్కారానికి తనకు తానుగా చొరవ తీసుకుని ఓ కమిటీని ఏర్పాటు చేసింది. అయితే కమిటీలోని సభ్యులు ముగ్గురు భూపీందర్ సింగ్ మాన్, అశోక్ గులాటి, అనిల్ ఘన్వత్‌లు చట్టాలకు అనుకూలురని, వీరిని కమిటీ నుంచి తొలిగించాలని రైతు నేతలు స్పష్టం చేశారు. చట్టాలను సమర్థిస్తూ వ్యాసాలు రాసిన వారితో ఉన్న కమిటీ ముందు తాము హాజరయ్యేది లేదని తెలియచేశారు. రైతుల నేతలు నిపుణులపై నిందలకు దిగడం సరికాదని ధర్మాసనం ఆగ్రహం వ్యక్తం చేసింది. వ్యవసాయ రంగానికి సంబంధించి న్యాయమూర్తులు నిపుణులు కాదని, అన్ని అంశాలపై కోర్టుకు అవగావహన లేకపోవచ్చునని, అందుకే నిపుణులతో కూడిన కమిటీని ఏర్పాటు చేశామని, కమిటీలోని సభ్యులంతా వ్యవసాయ రంగంలో అత్యంత అనుభవజ్ఞులని, పైగా వారికి ఎటువంటి అధికారాలు లేవని, కేవలం ప్రతిష్టంభన నివారణకు మార్గాలు సూచించాల్సి ఉందని తెలిపినట్లు, వీరిపై విమర్శలకు దిగడం సముచితం కాదని ఉన్నత న్యాయస్థానం తెలిపింది.

కమిటీ సభ్యులు కేవలం ఇరు పక్షాల వాదనలు వింటారు. ఈ దశలో వారు పక్షపాతం ప్రదర్శిస్తారనే ప్రశ్న రానేరాదని, అయినా రైతు నేతలను కమిటీ ముందు హాజరు కావాలని తాము బలవంతం చేయడం లేదని, వారికి కమిటీ నచ్చకపోతే రాకుండా ఉండాలని, అంతేకానీ నిందలకు దిగడం సరికాదని ధర్మాసనం తెలిపింది. రైతు నేతలు ఒక్కసారి కమిటీ ముందుకు వస్తే వారు చెప్పేది ఇతరులు తెలిపేది విదితం అవుతుందని, పరస్పర విషయ వినిమయంతో సొంత అభిప్రాయాలు కూడా మారేందుకు వీలుంటుందని ధర్మాసనం తెలిపింది. అందరికీ అభిప్రాయాలు ఉంటాయని, చివరికి జడ్జిలు కూడా ఇందుకు అతీతులు కారని, అయితే తమకు నచ్చని వారి పట్ల దురభిప్రాయాలను అంటగట్టడం పరిపాటిఅయిందని, ఇదో సంస్కృతి అవుతోందని ధర్మాసనం వ్యాఖ్యానించింది. ఈ సందర్భంగానే సుప్రీంకోర్టు ట్రాక్టరు ర్యాలీ అనుమతి నిరాకరణ ఆదేశాలు వెలువరించడానికి సమ్మతించలేదు. ఇది తమ పరిధిలోకి వచ్చే విషయం కాదని పేర్కొంది.

Supreme Court disappointed by Farm Unions

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News