Wednesday, April 24, 2024

బిబిసిని పూర్తిగా నిషేధించాలన్న పిటిషన్‌ని తోసిపుచ్చిన సుప్రీంకోర్టు!

- Advertisement -
- Advertisement -

న్యూఢిల్లీ: గుజరాత్‌లో 2002లో జరిగిన అల్లర్లపై బిబిసి డాక్యుమెంటరీని రూపొందించింది. దానిపై కొంత కాలంగా వివాదం కొనసాగుతోంది. ఈ నేపథ్యంలో బిబిసి కార్యకలాపాలను భారత్‌లో పూర్తిగా నిషేధించాలంటూ దాఖలైన పిటిషన్‌ను భారత సర్వోన్నత న్యాయస్థానం కొట్టేసింది. ‘ఓ లఘుచిత్రం(డాక్యుమెంటరీ) దేశాన్ని ఎలా ప్రభావితం చేయగలదు?’ అని సుప్రీంకోర్టు పిటిషనర్లు హిందూసేన చీఫ్ విష్ణు గుప్తా తో పాటు బీరేంద్ర కుమార్ సింగ్‌ను ప్రశ్నించింది. ఎం.ఎం. విష్ణు గుప్తా దాఖలు చేసిన పిటిషన్‌పై న్యాయమూర్తులు సంజీవ్ ఖన్నా, ఎం.ఎం.సుందరేశలతో కూడిన ధర్మాసనం ‘దీనిని తప్పుగా భావించారు, ఇది విచారణకు అనర్హం, నిషేధంపై ఆదేశాలు న్యాయస్థానం ఎలా జారీ చేస్తుందని పిటిషనర్‌ను ప్రశ్నించింది.

పిటిషనర్ తరఫున సీనియర్ న్యాయవాది పింకీ ఆనంద్, ప్రభుత్వం అడ్డుకున్న బిబిసి డాక్యుమెంటరీ ‘ఇండియా: ద మోడీ క్వశ్చన్’ భారత్ ఆర్థిక శక్తిగా ఎదుగుతున్న సమయంలో విడుదలచేశారన్నారు. అది ‘భారత వ్యతిరేక ప్రచారాన్ని సృష్టిస్తోంది’ అన్నారు. దీని వెనుక ఉన్న కుట్రను బహిర్గతం చేసేందుకు జాతీయ దర్యాప్తు సంస్థ (ఎన్‌ఐఏ)తో దర్యాప్తు జరిపించాలని కోరారు. ‘బ్రిటిష్ ప్రధానిగా భారతీయుడు(రిషి సునక్) ఉన్న నేడు మీకు తగు స్థానం ఉంది. భారత దేశం ఆర్థిక శక్తిగా ఎదుగుతోంది’ అని కూడా వాదించారు. దానికి ‘ఏమిటిది? మేము పూర్తి సెన్సార్‌షిప్ విధించాలని కోరుతున్నారా?’ అని ధర్మాసనం ప్రతిస్పందించింది.

‘భారత వ్యతిరేక లాబీ, మీడియా, ముఖ్యంగా బిబిసి జాతీయ వృద్ధిని జీర్ణించుకోలేక పక్షపాతంగా ఉన్నట్లనిపిస్తోంది. జనవరి 27న హోం మంత్రిత్వ శాఖకు ప్రాతినిధ్యం వహించినా ఇంతవరకు స్పందన రాలేదు’ అని పిటిషనర్ తెలిపారు. కాగా ఈ పిటిషన్‌లో ఎలాంటి మెరిట్ లేదని పేర్కొంటూ కోర్టు దానిని తిరస్కరించింది.

బిబిసి డాక్యుమెంటరీపై ఆంక్షలను సవాల్ చేస్తూ సీనియర్ పాత్రికేయుడు ఎన్.రామ్, తృణమూల్ కాంగ్రెస్ పార్టీ ఎంపీ మహువా మొయిత్రా, సీనియర్ న్యాయవాది ప్రశాంత్ భూషణ్ కలిసి వేసిన పిటిషన్‌తో పాటు, మరో న్యాయవాది ఎంఎల్. శర్మ దాఖలు చేసిన పిటిషన్‌పై సుప్రీంకోర్టు ఇటీవలే విచారణ చేపట్టింది. ఈ సందర్భంగా డాక్యుమెంటరీని అడ్డుకుంటూ ప్రభుత్వం జారీచేసిన ఉత్తర్వులకు సంబంధించిన పూర్తి రికార్డులను సమర్పించాలని ధర్మాసనం కేంద్రాన్ని ఆదేశించింది. మూడు వారాల్లో రికార్డులు సమర్పించాలంటూ ఫిబ్రవరి 3న కేంద్రానికి నోటీసులు జారీ చేసిన ధర్మాసనం తదుపరి విచారణను ఏప్రిల్‌కు వాయిదా వేసింది.

 

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News