Wednesday, April 24, 2024

సుప్రీంకోర్టుకు 9 మంది కొత్త జడ్జిలు

- Advertisement -
- Advertisement -
Supreme Court gets 9 new judges
కొలీజియం సిఫార్సులకు రాష్ట్రపతి ఆమోదముద్ర

న్యూఢిల్లీ: సుప్రీంకోర్టుకు తొమ్యిది మంది జడ్జిలను కొత్తగా నియమించేందుకు రాష్ట్రపతి రాంనాథ్ కోవింద్ గురువారం ఆమోదం తెలిపారు. వీరిని నియమిస్తూ ‘వారంట్స్ ఆఫ్ అపాయింట్‌మెంట్’పై సంతకం చేశారు. అత్యున్నత న్యాయస్థానం న్యాయమూర్తులుగా నియమించిన వారిలో ముగ్గురు మహిళలున్నారు. మరో విశేషం ఏమిటంటే ఈ తొమ్మిది మందిలో ఇద్దరు తెలుగు వారు భవిష్యత్తులో భారత ప్రధాన న్యాయమూర్తి అయ్యే అవకాశం ఉంది. తొలి మహిళా ప్రధాన న్యాయమూర్తి అనే కీర్తి ప్రతిష్ఠలు తెలుగు మహిళకు లభించే అవకాశాలున్నాయి. తెలుగు వారైన జస్టిస్ బివి నాగరత్న సుప్రీంకోర్టు న్యాయమూర్తిగా నియమితులైనారు. ఈమె 2027 సెప్టెంబర్‌లో భారత ప్రధాన న్యాయమూర్తి అయ్యే అవకాశం ఉంది. అదే జరిగితే.. సుప్రీంకోర్టు తొలి మహిళా ప్రధాన న్యాయమూర్తిగా రికార్డు సృష్టిస్తారు.

1962 అక్టోబర్ 30న జన్మించిన జస్టిస్ నాగరత్న మాజీ చీఫ్ జస్టిస్ ఇఎస్ వెంకట్రామయ్య కుమార్తె. మరో తెలుగు తేజం పిఎస్ నరసింహ కూడా ప్రధాన న్యాయమూర్తి అయ్యే అవకాశం ఉంది. సుప్రీంకోర్టులో మొత్తం 34 మంది న్యాయమూర్తులు ఉండాలి. కానీ ప్రస్తుతం 24 మంది జడ్జిలు మాత్రమే ఉన్నారు. ఈ నూతన నియామకాలతో వారి సంఖ్య 33కు చేరుతుంది. ఇక ఒక న్యాయమూర్తి పదవి మాత్రమే ఖాళీగా ఉంటుంది. సుప్రీంకోర్టు కొత్త న్యాయమూర్తులుగా నియమితులైన ముగ్గురు మహిళలు బివి నాగరత్న(కర్నాటక హైకోర్టు సీనియర్ జడ్జి), జస్టిస్ హిమా కోహ్లీ( తెలంగాణ హైకోర్టు చీఫ్ జస్టిస్), జస్టిస్ బేలా ఎం త్రివేది( గుజరాత్ హైకోర్టు).

అత్యున్నత న్యాయస్థానానికి ఒకే సారి ముగ్గురు మహిళా జడ్జిలు నియమితులు కావడం మన దేశ చరిత్రలో ఇదే ప్రథమం. కాగా జస్టిస్ హిమా కోహ్లీ సెప్టెంబర్ 1న రిటైర్ కావలసి ఉంది. వారు కాక సీనియర్ అడ్వకేట్ పిఎస్ నరసింహ (సుప్రీంకోర్టు బార్ అసోసియేషన్), జస్టిస్ ఎఎస్ ఓఖా (కర్నాటక హైకోర్టు), జస్టిస్ విక్రమ్ నాథ్ (గుజరాత్ హైకోర్టు), జస్టిస్ జెకె మహేశ్వరి (సిక్కిం హైకోర్టు), జస్టిస్ సిటి రవికుమార్ (కేరళ హైకోర్టు), జస్టిస్ ఎంఎం సుందరేశ్ (మద్రాసు హైకోర్టు)లు కూడా సుప్రీంకోర్టు జడ్జిలుగా నియమితులైన వారిలో ఉన్నారు. భారత ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ ఎన్‌వి రమణ నేతృత్వంలోని సుప్రీంకోర్టు కొలీజియం నూతన న్యాయమూర్తుల నియామకం కోసం గత వారం చేసిన సిఫార్సులను రాష్ట్రపతి ఆమోదించారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News