Thursday, March 28, 2024

సంపాదకీయం: అందరికీ వర్తింపచేయాలి

- Advertisement -
- Advertisement -

BJP won in Bihar assembly elections పౌరుల వ్యక్తిగత స్వేచ్ఛను తాను కాకపోతే మరెవరు కాపాడుతారు, రాజ్యాంగ న్యాయస్థానంగా అది తన ధర్మం అని సుప్రీంకోర్టు ఆర్నాబ్ గోస్వామికి, మరి ఇద్దరికి బెయిల్ మంజూరు చేస్తూ పలికిన పలుకులు ప్రజాస్వామ్యానికి, దానిని గాఢంగా కోరుకునే దేశ ప్రజలకు ఎంతో ఆహ్లాదం కలిగించాయి. ‘ప్రభుత్వాలు పౌరుల స్వాతంత్య్రాన్ని హరించదలిస్తే అది జరిగే పని కాదు, వారిని ఆదుకోడానికి సుప్రీంకోర్టు ఉన్నది’ అని న్యాయమూర్తులు వై.వి. చంద్రచూడ్, ఇందిరా బెనర్జీల ధర్మాసనం హెచ్చరించింది. అన్వయ్ నాయక్ అనే ఇళ్లలోపలి రూప శిల్పి (ఇంటీరియర్ డిజైనర్) ఆత్మహత్యకు దోహదపడ్డారనే రెండేళ్ల నాడు మూసివేసి తాజాగా తెరచిన కేసులో రిపబ్లిక్ టివి యజమాని, సంపాదకుడు ఆర్నాబ్ గోస్వామిని, మరి ఇద్దరిని ముంబై పోలీసులు అరెస్టు చేసి జైలుకు పంపారు. జామీను కోసం ఆర్నాబ్ దాఖలు చేసుకున్న అర్జీని బొంబాయి హైకోర్టు తీసుకోలేదు.

కింది కోర్టును ఆశ్రయించాలని ఆదేశించింది. గోస్వామి అభ్యర్థనను విచారణకు స్వీకరించిన సుప్రీం ధర్మాసనం తాత్కాలిక బెయిల్ మంజూరు చేసింది. నిందితులను అరెస్టు చేసి విచారించవలసినంత తీవ్రమైనదా ఈ కేసు అని కూడా న్యాయమూర్తులు ప్రశ్నించారు. రేపు మహారాష్ట్రలో ఎవరైనా ఆత్మహత్య చేసుకుంటూ అందుకు బాధ్యత ఆ రాష్ట్ర ప్రభుత్వానిదేనని ఆరోపిస్తే ముఖ్యమంత్రిని అరెస్టు చేస్తారా అని కూడా ధర్మాసనం ఘాటు ప్రశ్న వేసింది. వాస్తవానికి ఈ కేసులో ఆర్నాబ్ గోస్వామిని గాని, మిగతా ఇద్దరిని గాని అరెస్టు చేయవలసిన పనే లేదు. వీరిని పోలీసు నిర్బంధంలోకి తీసుకోకుండానే దర్యాప్తు జరిపి కేసును న్యాయస్థానం ముందు ఉంచవచ్చు. 2018లో ఈ ఫిర్యాదు దాఖలైనప్పుడు ఆ కేసు సమగ్ర దర్యాప్తుకు నోచుకోకుండా మూసివేతకు గురికావడం వెనుక, ఇటీవల తాజాగా తిరిగి తెరుచుకోడం వెనుక రాజకీయ కారణాలే కనబడుతున్నాయి. అప్పుడు మహారాష్ట్రలో బిజెపి, శివసేనల ప్రభుత్వముండగా, ఇప్పుడు అక్కడ శివసేన, కాంగ్రెస్‌ల ప్రభుత్వం పరిపాలిస్తున్నది. ఆర్నాబ్ గోస్వామి తన అగ్గిబరాటాల్లాంటి ప్రసారాలు, ప్రత్యేక టివి కార్యక్రమాల ద్వారా తన చుట్టూ తానే అల్లుకున్న దట్టమైన రాజకీయ సాలెగూడు ఈ కేసును ఆసరా చేసుకొని కేంద్రంలో, మహారాష్ట్రలో గల పాలకులు పరస్పర వైరాలను తీర్చుకునే వైపు అడుగులు వేయడానికి తోడ్పడిందనవచ్చు.

గోస్వామి కేంద్రంలోని బిజెపి ప్రభుత్వానికి, వారు ప్రాణప్రదంగా చూసుకుంటున్న కఠిన హిందుత్వకు అనుకూలంగా, బాహాటంగా అవధుల్లేనంత బిగ్గరగా తన టివి తెర మీద కార్యక్రమాలను నిర్వహిస్తుంటారని ఆ క్రమంలో ఎదుటి కంఠానికి ఆవంతైనా చోటివ్వరనేది అందరికీ తెలిసిందే. మహారాష్ట్ర ముఖ్యమంత్రి ఉద్ధవ్ థాకరే సహా బిజెపికి వ్యతిరేకులైన వారినెవ్వరినీ ఆయన విడిచిపెట్టరు. జైల్లో పోలీసులు తనపై దాడి చేస్తున్నారని తన కుటుంబ సభ్యులను కలవనీయకుండా అడ్డుకుంటున్నారని గోస్వామి ఆరోపించిన తర్వాత సాక్షాత్తు మహారాష్ట్ర గవర్నర్ భగత్ సింగ్ కోష్యారీ ఆ రాష్ట్ర హోం మంత్రితో మాట్లాడి అతడి భద్రత పట్ల ఆందోళన వ్యక్తం చేశారని వార్తలు వచ్చాయి. అంతేకాదు గోస్వామి అరెస్టును 1975 నాటి ఎమర్జెన్సీలో పత్రికల నోరు మూయించిన చర్యతో పోలుస్తూ కేంద్ర మంత్రులు ఖండన ప్రకటనలిచ్చారు. వారిలో అమిత్ షా కూడా ఉన్నారు. ఇంతలా రాజకీయం అయి ఉండకపోతే ఈ కేసులో గోస్వామి అరెస్టు, రోజుల తరబడి బెయిల్ లభించని జైలు సంభవించి ఉండేవి కావని ఎవరికైనా సులభంగా అర్థమవుతుంది.

చివరికి గోస్వామి బెయిల్ పిటిషన్‌ను సుప్రీంకోర్టు హుటాహుటిన విచారణకు స్వీకరించడమూ వివాదాస్పదమైంది. తాత్కాలిక బెయిల్ కోసం ఆర్నాబ్ గోస్వామి పెట్టుకున్న పిటిషన్‌ను కోర్టు సెలవుల్లో ఉండగా వెనువెంటనే ధర్మాసనం ముందుంచడానికి కారణమేమిటి, ప్రధాన న్యాయమూర్తి నుంచి ఆ మేరకు ఆదేశాలేమైనా వచ్చాయా? అని సుప్రీంకోర్టు బార్ అసోసియేషన్ అధ్యక్షుడు దుష్యంత్ దవే సూటిగా ప్రశ్నించారు. సామాజిక మాధ్యమాల్లో కూడా ఈ విషయం చర్చనీయమైంది. ఇటీవల కోల్‌కతా పోలీసులు సోషల్ మీడియాలో ఒక వ్యాఖ్యానానికి సంబంధించి ఢిల్లీకి చెందిన ఒక మహిళకు సమన్లు జారీ చేసిన కేసులోనూ సుప్రీంకోర్టు పౌరుల వ్యక్తిగత స్వేచ్ఛ మీద ప్రభుత్వాలు ఉక్కు పాదం మోపడం తగదంటూ తీవ్రంగా స్పందించింది. అందుచేత రాజ్యాంగం ప్రసాదించిన భావ ప్రకటన స్వేచ్ఛ, వ్యక్తిగత స్వాతంత్య్రం పరిరక్షణకు దేశ అతి పెద్ద న్యాయస్థానం నడుం బిగించడాన్ని ఎంతైనా హర్షించాలి, అందుకు ధర్మాసనాన్ని అభినందించాలి. అదే సమయంలో వాటి పట్ల దాని శ్రద్ధాసక్తులు వాటిని కాపాడాలనే రాజీలేని సంకల్పం బెయిలు లభించకుండా జైళ్లలో మగ్గుతున్న వారు, తీవ్ర అనారోగ్యంతో బాధపడుతున్నవారు, వృద్ధులైన వారి విషయంలోనూ పని చేయాలని ఆశించడం తప్పు కాదు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News