Home ఎడిటోరియల్ బిల్కిస్‌కు న్యాయం

బిల్కిస్‌కు న్యాయం

Gujarat riots ప్రపంచంలోనే అతిపెద్ద ప్రజాస్వామ్యంలో ఇంకా నాలుకలు చాచి పేట్రేగుతున్న విద్వేషాగ్నికి బలైపోతున్న వారందరికీ అత్యంత విషాద చిహ్నంగా నిలుస్తారు బిల్కిస్‌బానో. ఆమెకు తక్షణమే పరిహారాన్ని చెల్లించాలని గుజరాత్ ప్రభుత్వాన్ని సుప్రీంకోర్టు ఆదేశించడం ఒక జాతిగా మనం ప్రజాస్వామ్య కర్తవ్య ధర్మబద్ధులమనే విషయాన్ని చాటింది. 2002లో గుజరాత్‌లో సంభవించిన గోధ్రా అనంతర అల్లర్లలో మూక హింసకు బలైన అభాగ్యురాలామె. అహ్మదాబాద్ సమీపంలోని రంధిక్‌పూర్ అనే గ్రామంలోని ఆమె నివాసంపై ఆ ఏడాది మార్చి 3వ తేదీన 11 మంది దాడి చేశారు. గర్భవతిగా ఉన్న ఆమెపై సామూహిక అత్యాచారం జరిగింది. ఆమె మొదటి భర్త సహా ఏడుగురు కుటుంబ సభ్యులను హత్య చేశారు. మూడున్నరేళ్ల వయసులోని ఆమె కుమార్తెను గోడకేసి కొట్టి తన కళ్ల ముందే దారుణంగా కడతేర్చారు.

ఇంతటి ఘాతుకానికి గురైన ఆమెకు 17 సంవత్సరాల తర్వాత రూ. 50 లక్షల పరిహారాన్ని, ప్రభుత్వ ఉద్యోగాన్ని, కోరుకున్న చోట ఇల్లు ఇవ్వాలని సుప్రీంకోర్టు ఆదేశించడంలో చెప్పనలవికాని అమానుషానికి గురైన వ్యక్తిపట్ల చూపిన మానవతాయుతమైన జాతీయ బాధ్యత రుజువవుతున్నది. ఈ సందర్భంగా ప్రధాన న్యాయమూర్తి రంజన్ గొగోయ్ వ్యాఖ్యానిస్తూ ‘నేటి ప్రపంచంలో డబ్బు ఒక్కటే గాయాలను మాన్పగలదు. అయితే అన్ని గాయాలను అది తొలగించగలదో లేదో చెప్పలేము. కాని ఇంతకంటే మేము చేయగలిగేదేముంది’ అని పలికిన పలుకులు గమనించదగినవి. నిజమే, ఆమె కోల్పోయిన మూడున్నరేళ్ల పసికుమార్తెతోపాటు ఏడుగురు కుటుంబ సభ్యులను ఎవరూ తిరిగి ఇవ్వలేరు.

చేయగలిగిందంతా సకాలంలో సరైన పరిహారం, సాంత్వన లభించేటట్టు చూడడమే. బిల్కిస్‌బానో విషయంలో అది కూడా జరగలేదు. గుజరాత్‌లోని ప్రభుత్వం ఆమెపట్ల ఆ బాధ్యతను సైతం నెరవేర్చలేదు. ఇంత కాలానికి ప్రజాస్వామ్య రాజ్యాంగబద్ధ న్యాయ పాలనకు కట్టుబడిన సుప్రీంకోర్టు ఆమెకు ఈపాటి న్యాయాన్ని చేసింది. ‘సుప్రీంకోర్టు నాకు అండగా నిలిచింది. నా బాధను అర్థం చేసుకున్నది. ఆనాటి దారుణ హింసాకాండలో కోల్పోయిన రాజ్యాంగ హక్కుల కోసం నేను సాగించిన పోరాటాన్ని గమనించింది. కాపాడాలిన రాజ్యం చేతిలోనే చెప్పనలవికాని బాధలు అనుభవించిన నావంటి నిర్భాగ్యుల దుస్థితి పౌరులింకెవరికీ కలగకూడదు’ అని తీర్పు వెలువడగానే బిల్కిస్‌బానో వెలిబుచ్చిన అభిప్రాయంలో ప్రభుత్వ వైఫల్యం ప్రస్తావన ప్రత్యేకించి గమనించదగినది.

పౌరులందరి పట్ల ఒకే విధంగా వ్యవహరించవలసిన బాధ్యత గలిగిన ప్రభుత్వాలు కొందరిని చెప్పనలవికాని బాధలకు గురి చేస్తే వారు చెప్పుకోవలసింది న్యాయ వ్యవస్థకే, వారికి న్యాయం చేయవలసింది అదే. సుప్రీంకోర్టు తీర్పు ఆ ఒక్క ఆశను, ఆధారాన్ని సజీవంగా ఉంచింది. అక్కడ కూడా తిరస్కారమే ఎదురైతే ఈ దేశ పౌరులకు దిక్కెవరు? అనే ప్రశ్న సమాధానం లేనిది. ఆ రోజు ఆ దురాగతం జరిగినప్పటి నుంచి బిల్కిస్ న్యాయం కోసం సుదీర్ఘ పోరాటమే సాగించారు. తనను హతమార్చడానికి దుండగులు నిరంతరం సాగిస్తూ వచ్చిన ప్రయత్నాల పడగ నీడలో పట్టుమని పది రోజులు కూడా ఒకచోట ఉండకుండా అహ్మదాబాద్, వడోదర, ముంబయి, లక్నో, ఢిల్లీలలో తనకు ఏ విధంగానూ బంధువులో, స్నేహితులోకాని మానవీయ దృష్టిగల అపరిచితుల ఇళ్లల్లో ఆశ్రయం పొందారు.

కేవలం రూ. 5 లక్షలు ఇవ్వడానికి ముందుకొచ్చిన గుజరాత్ అవహేళనా ధోరణికి వ్యతిరేకంగా పోరాడి చివరికి మొన్న 23వ తేదీన సుప్రీంకోర్టు ద్వారా సబబైన పరిష్కారాన్ని పొందే అవకాశానికి పాత్రులయ్యారు. ఈ నిర్ణయం ద్వారా సుప్రీంకోర్టు గుజరాత్ ప్రభుత్వాన్నే ఈ కేసులో నేరస్థురాలిగా పరిగణించినట్టయింది. పౌరులకు రక్షణ కల్పించవలసిన ప్రభుత్వం అందులో విఫలమైందని తేల్చి చెప్పినట్టయింది. ప్రస్తుతం గుజరాత్ దాహోద్ జిల్లాలోని దేవగఢ్ బారియా అనే పట్టణంలో ఉంటున్న బిల్కిస్‌బానో 17 ఏళ్ల తర్వాత ఓటు వేయగలిగారు. ప్రాణాలరచేత పట్టుకొని దేశమంతా తిరుగుతూ ఉండవలసి వచ్చినందున ఇంతకాలం ఓటు వేయలేకపోయానని ఆమె చెప్పుకున్నారు. తాను దేశ ఐక్యత కోసం ఓటు వేశానని, దేశంలోని ప్రజాసామ్య వ్యవస్థపట్ల, ఎన్నికల ప్రక్రియ పట్ల ప్రగాఢ విశ్వాసమున్నదని ఆమె ప్రకటించారు. బిల్కిస్‌బానోపై ఘోర నేరానికి పాల్పడిన 11 మందికి యావజ్జీవ శిక్షలు పడ్డాయి. వారు ఒక్కొక్కరు యాభైయేసి వేల రూపాయలు ఆమెకు పరిహారంగా చెల్లించాలని కూడా సుప్రీంకోర్టు ఆదేశించింది. సాగించిన సుదీర్ఘ న్యాయ పోరాట కాలంలోఆమెకు ఆశ్రయమిచ్చి అండగా నిలిచినవారందరూ భారతీయ ప్రజాస్వామ్య ఆత్మకు ప్రతినిధులే.

Supreme court jergeemet on Bilkis Bano Petition