Friday, March 29, 2024

ఇసిపై తీర్పు అమలవుతుందా?

- Advertisement -
- Advertisement -

ప్రజాస్వామ్య వ్యవస్థ మనుగడలో కీలకమైన ఎన్నికల కమిషన్ స్వేచ్ఛగా, స్వతంత్రంగా, నిష్పక్షపాతంగా వ్యవహరించడం చాలా అవసరం. కేవలం ప్రభుత్వ విభాగంగా, అధికార పార్టీ ఆదేశాల మేరకు వ్యవహరించడం తగదు. ఆ సమయంలో అమలులో ఉన్న చట్టాలలో లభించిన అధికారాలను సమర్ధవంతంగా ఉపయోగించుకుంటూ ఎన్నికల కమిషనర్ టిఎన్ శేషన్ ఎన్నికల నిర్వహణలో విప్లవాత్మక మార్పులు తీసుకు వచ్చే వరకు ఎన్నికల కమిషన్ ప్రాధాన్యత గురించి ఎవ్వరూ పెద్దగా పట్టించుకోలేదు. శేషన్ ఒక విషయం స్పష్టం చేశారు. చట్ట సంబంధమైన నిబంధనలకన్నా కీలక పదవులలో ఉన్న వారు నిజాయితీ, దృఢ సంకల్పం ఒక వ్యవస్థ సమర్థవంతంగా పని చేయడంలో కీలకపాత్ర వహిస్తాయని ఆయన నిరూపించారు.

ఆయన తర్వాత వచ్చిన ఎన్నికల కమిషనర్లు సహితం కొంతమేరకు క్రియాశీలకంగా వ్యవహరిస్తూ ఎన్నికల నిర్వహణలో పెను మార్పులకు ప్రయత్నం చేశాయి. అయితే, సహజంగానే అధికారంలో ఉన్న రాజకీయ పక్షాలు రాజ్యాంగబద్ధ సంస్థలు స్వతంత్రంగా, నిష్పక్షపాతంగా పని చేయడాన్ని సహింపలేవు. అందుకనే కమిషన్‌లో మరో ఇద్దరు కమిషనర్లను చేర్చి ప్రధాన కమిషనర్ ప్రాధాన్యతను తగ్గించే ప్రయ త్నం చేశారు.1993 నుండే ఎన్నికల కమిషన్‌లో ఒకరు కాకుండా ముగ్గురు కమిషనర్లు ఉండడం ప్రారంభమైంది. ఎన్నికల కమిషనర్లుగా పని చేసినవారి నిబద్ధతను ప్రశ్నించలేముగాని అప్పటి నుండి కమిషన్ స్వతంత్రతను కట్టడి చేసేందుకు ప్రభుత్వాలు చేస్తున్న ప్రయత్నాలను ప్రతిఘటించ లేకపోతున్నాయని చెప్పవచ్చు. గత కొద్ది కాలంగా ఎన్నికల కమిషనర్ల నియామకం తీరుతెన్నులు పరిశీలిస్తున్న వారికి కమిషన్ నిష్పక్షపాతంగా వ్యవహరించడం లేదని స్పష్టం అవుతుంది. ఎన్నికల వ్యవస్థను నేరుగా ప్రభావితంచేసే అనేక కీలక అంశాలపై పట్టీపట్టనట్లు కమిషన్ వ్యవహరిస్తున్నది. అందుకనే ఎన్నికల కమిషనర్ల నియామకంలో మార్పు తేవాలనే డిమాండ్ పెరుగుతూ వస్తున్నది.

ఇటువంటి సమయంలో ప్రధాన ఎన్నికల కమిషనర్, ఎన్నికల కమిషనర్ల నియామకాలపై సుప్రీంకోర్టు తీర్పు ఇవ్వడం ప్రాధాన్యత సంతరింప చేసుకుంది. ప్రధాన మంత్రి, లోక్‌సభలో ప్రతిపక్ష నేత, సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి(సిజెఐ) సభ్యులుగా ఉన్న త్రిసభ్య కమిటీయే ఎన్నికల సంఘంలో నియామకాలను చేపట్టాలని స్పష్టం చేసింది. ఈ కమిటీ సిఫార్సుల మేరకు కేంద్ర ప్రధాన ఎన్నికల కమిషనరు (సిఇసి), ఎన్నికల కమిషనర్లను రాష్ట్రపతి నియమించాలని స్పష్టం చేసింది.మొదటగా, జస్టిస్ ఎపి షా నేతృత్వంలోని లా కమిషన్ మార్చి, 2015లో తమ నివేదికలో ఈ సూచన చేసింది. ఎన్నికల కమిషన్ నిష్పక్షపాతంగా పని చేయడానికి నియామకాలు ప్రభుత్వ వ్యవహారంగా ఉండరాదని స్పష్టం చేసింది. ముఖ్యంగా ఎన్నికలలో ధన ప్రభావం, నేరస్థుల పాత్రను కట్టడి చేయడంలో కమిషన్ దాదాపు ప్రేక్షక పాత్ర వహిస్తున్నది. నగ్నంగా నల్లధనాన్ని ఎన్నికలలో వినియోగించుకొనే విధంగా ఎలక్టోరల్ బాండ్ విధానం తీసుకొచ్చినా కమిషన్ మాట్లాడలేకపోతుంది.

నేడు దేశంలో మెరుగైన భద్రతా వ్యవస్థ అందుబాటులో ఉంది. అత్యాధునిక సాంకేతిక, రవాణా సదుపాయాలు కూడా ఉన్నాయి. అయినా కొన్ని రాష్ట్రాలలో ఎన్నికలు ముగిసిన తర్వాత ఓట్ల లెక్కింపు జరిగేందుకు నెలల తరబడి వేచి ఉండాల్సిన అవసరం ఎందుకు వస్తుందో అర్థం కావడం లేదు. ఈ విషయంలో ఎన్నికల కమిషన్ రాజకీయ వత్తిడులకు తలవంచుతున్నదనే అనుమానాలు కలుగుతున్నాయి.అయితే ఇప్పుడు ఎన్నికల కమిషనర్ల నియామకం ప్రభుత్వ వ్యవహారంగా ఉండకూడదనే సూచనలను కేంద్ర ప్రభుత్వం ఇప్పటి వరకు పట్టించుకోలేదు. ఇప్పుడు సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పు కూడా తాత్కాలికమే కాగలదు. ఎందుకంటె ఈ విషయంలో పార్లమెంట్ ఓ చట్టం చేసే వరకు మాత్రమే తీర్పు వర్తిస్తుందని అత్యున్నత న్యాయస్థానం తెలిపింది. కానీ పార్లమెంట్ అందుకు భిన్నంగా చట్టం తీసుకువస్తే సుప్రీంకోర్టు ఆదేశం అమలు కావడం సాధ్యం కాదు. ప్రస్తుత ఎన్నికల కమిషనర్ అనూప్ చంద్ర పాండే 65 ఏళ్ళ వయో పరిమితి ముగుస్తుండడంతో వచ్చే ఏడాది ఫిబ్రవరి 14న రిటైర్ కానున్నారు. అంటే 2024 ఎన్నికల ప్రకటనకు ముందుగా మరో కొత్త ఎన్నికల కమిషనర్‌ను నియమించాల్సి ఉంటుంది. అప్పుడు గాని సుప్రీంకోర్టు తీర్పు ఏ మేరకు అమలవుతుందో తెలిసే అవకాశం ఉంది.

ఉన్నత న్యాయ స్థానాలలో న్యాయమూర్తుల నియామకంలో ప్రస్తుతం అమలులో ఉన్న కొలీజియం వ్యవస్థలో పారదర్శకత, జవాబుదారీతనం లేదనే విమర్శలు వస్తున్నాయి. పార్లమెంట్ ఈ విషయమై జాతీయ జ్యుడిషల్ నియామక కమిషన్ ఏర్పాటుకు ఓ చట్టం తీసుకువస్తే దానిని సుప్రీంకోర్టు కొట్టి వేసింది. ఇప్పుడు ఎన్నికల కమిషనర్ల నియామకం గురించి ప్రశ్నించడం ఏమిటనే వాదనలు సహితం ఈ సందర్భంగా చెలరేగుతున్నాయి. అసలు ఈ విధంగా తీర్పుఇచ్చే అధికారం సుప్రీంకోర్టుకు ఉందా అనే ప్రశ్న తలెత్తుతున్నది. సుప్రీంకోర్టు కేవలం రాజ్యాంగ అంశాలకు, చట్టసంబంధమైన అంశాలకు వాఖ్యానాలు చెప్పగలదు. వారి పరిధిని పేర్కొంటూ భాష్యం చెప్పగలదు. కానీ చట్టంలో లేని అంశాన్ని ఆదేశంగా జారీ చేయడం ద్వారా తానే చట్టం చేసే ప్రయత్నం ఇప్పుడు చేసింది. పైగా ఐదుగురు సభ్యులు గల రాజ్యాంగ ధర్మాసనం ఏకగ్రీవంగా నిర్ణయించింది. రాజ్యాంగం తమకు సంక్రమింప చేసిన అధికారాలను అతిక్రమించి ఈ తీర్పు ఇచ్చిందా? అనే అభిప్రాయం కూడా కలుగుతుంది.

అయితే ఇప్పటి వరకు ఎన్నికల కమిషనర్ల నియామకాన్ని ఎటువంటి సంప్రదింపులు లేకుండా ఎటువంటి ప్రమాణాలు పాటించకుండా ప్రభుత్వం యథేచ్ఛగా చేస్తూ ఉండటంతో మొత్తం ఎన్నికల కమిషన్ పని తీరుపై విమర్శలు చెలరేగుతున్నాయి. అందుకనే అసాధారణ పరిస్థితుల్లో సుప్రీంకోర్టు జోక్యం చేసుకున్నట్లు భావించవలసి వస్తుంది. అందుకనే, ఎన్నికల కమిషనర్ల నియామకం ప్రభుత్వ వ్యవహారంగా ఉండిపోరాదని, కొలీజియం వ్యవస్థ అవసరమని ఎస్‌వై ఖురేషి నుండి దాదాపు ప్రధాన ఎన్నికల కమిషనర్లు అందరూ ఈ విధమైన సూచనను ప్రభుత్వానికి చేస్తూ వస్తున్నారు. కానీ ఏ ప్రభుత్వం కూడా తమకున్న విశేష అధికారాలను వదులుకునేందుకు సిద్ధపడుతోందని ఆశింపలేము.

తాజాగా సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పు అమలయితే ప్రధాన ఎన్నికల కమిషనర్ నియామకం ఓ సమస్యగా మారే అవకాశం ఉంది. ప్రస్తుతం అనుసరిస్తున్న సంప్రదాయం ప్రకారం మిగిలిన ఇద్దరు కమిషనర్లలో ఎవ్వరు సీనియర్ అయితే వారిని ప్రధాన కమిషనర్ గా నియమిస్తూ వస్తున్నారు. కానీ ప్రధాన కమిషనర్‌ను కూడా సుప్రీంకోర్టు సూచించిన త్రిసభ్య కమిషన్ నియమించాల్సి వస్తే ఈ సంప్రదాయాన్ని పాటించే అవకాశం ఉండకపోవచ్చు. ముగ్గురు సభ్యుల మధ్య ఏకాభిప్రాయం కుదరని పక్షంలో నియామకాలలో విపరీత జాప్యానికి దారితీసే అవకాశం కూడా ఉంటుంది. ఈ సందర్భంగా కేవలం ప్రభుత్వ అధికారులనే కమిషనర్లుగా నియమించాల్సిన అవసరం ఏమిటనే ప్రశ్న తలెత్తుతున్నది. కొన్ని దేశాలలో నిపుణులను కూడా నియమించే సంప్రదాయం అమలులో ఉంది. ఉదాహరణకు లా ప్రొఫెసర్లు, పౌర సమాజంలో క్రియాశీలకంగా పని చేసినవారు, ప్రభుత్వ యంత్రాంగంతో సంబంధంలేని వారిని కూడా నియమించే ఆలోచనలను పరిశీలించడం సముచితం కాగలదు.

శేషన్ మొత్తం ఎన్నికల వ్యవస్థలో విప్లవాత్మకమైన మార్పులకు నాంది పలికారు. ఆ తర్వాతనే ఆదాయ వివరాలు, నేరాలకు సంబంధించిన కేసులను తెలుపుతూ పోటీ చేసే అభ్యర్థులు అఫిడవిట్ లను సమర్పించే ప్రక్రియ అమలులోకి వచ్చింది. అయితే ఈ అఫిడవిట్‌లను స్క్రీనింగ్ చేసే వ్యవస్థ ఎన్నికల కమిషన్‌కు లేకపోవడం గమనార్హం. కనీసం అప్పులు, ఆస్తులకు సంబంధించి సమర్పించిన అఫిడవిట్ లో పేర్కొన్న అంశాలు నిజమేనా? అని చూసే వ్యవస్థ కూడా లేదు.ఎవరైనా రాజకీయ ప్రత్యర్ధులు లోతుగా వెళ్లి పరిశీలన చేసి, న్యాయ పోరాటానికి తలపెడితే అతికొద్ది సందర్భాలలో ఈ అంశాలు కమిషన్ దృష్టికి వస్తున్నాయి. ఆర్ధిక సంబంధమైన అఫిడవిట్‌లను మొదట్లో ఎన్నికల కమిషన్ ఆదాయపన్ను శాఖకు పంపి, సరిచూసి పంపమని కోరింది. అయితే ఆ విధంగా సరిచేసేందుకు అవసరమైన యంత్రాంగం తమ వద్ద లేదని ఆదాయపన్ను శాఖ తిరస్కరించింది. ఇక, నేర స్వభావం గురించి కేవలం పోలీస్ కేసులను ప్రస్తావిస్తున్నారు. కానీ ఈ అఫిడవిట్‌ల ప్రభావం ఎక్కడా ఓటర్లపై పడుతున్న దాఖలాలు లేవు. అభ్యర్థులు తమపై ఉన్న తీవ్రమైన – హత్య, అత్యాచారం, హత్యాయత్నం వంటి కేసులను అఫిడవిట్‌లలో పేర్కొన్నా, ఓటర్లు ఎక్కడా తీవ్రంగా తీసుకోవడం కనిపించడం లేదు. తీవ్రమైన క్రిమినల్ కేసులు ఉన్న వారు సహితం, చివరకు క్రిమినల్ కేసులపై జైల్లో ఉన్నవారు కూడా ఎన్నికవడం చూస్తున్నాము. ఏదేమైనా ఎన్నికల వ్యవస్థలో మనం కోరుకుంటున్న మౌలిక సంస్కరణలు నేటి సుప్రీంకోర్టు తీర్పు మార్గం ఏర్పర్చగలదని ఆశిద్దాము.

చలసాని నరేంద్ర
9849569050

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News