Home జాతీయ వార్తలు అక్రమసంబంధాలలో మగ ఆడా తేడాలేదు

అక్రమసంబంధాలలో మగ ఆడా తేడాలేదు

సెక్షన్ 497పై సుప్రీంకోర్టు కీలక ప్రశ్నలు, సమానత హక్కుకు చిక్కులపై ఆందోళన  

న్యూఢిల్లీ : వివాహేతర సంబంధాలపై ఆడవారికో న్యాయం, మగవారి పట్ల ఇంకో భావమా? ఇది సమానత హక్కుకు భంగకరంగా ఉందని సుప్రీంకోర్టు పేర్కొంది. వివాహేతర సంబంధాలను (అడల్టరీ) నేరంగా పరిగణించే ఇండియన్ పీనల్ కోడ్‌లోని 497వ సెక్షన్‌ను రద్దు చేయాలని దాఖలైన అత్యంత కీలకమైన మానవ సంబంధాల వ్యాజ్యంపై విచారణ సందర్భంగా గురువారం అత్యున్నత న్యాయస్థానం కీలక వ్యాఖ్యలు చేసింది. భారత రాజ్యాంగంలో అందరిని ఒకే విధంగా గుర్తించే సమానత్వపు హక్కు సామాజికంగా ప్రాధాన్యతను సంతరించుకుందని, మరి ఈ సెక్షన్‌లోని నిబంధనలు ఏకంగా ఈ హక్కుకు తూట్లు పొడుస్తున్నట్లుగా ప్రాథమికంగా తేలుతోందని రాజ్యాంగ ధర్మాసనం అభిప్రాయపడింది. వివాహేతర సంబంధాల విషయంలో కేవలం పెళ్లయిన పురుషుడిని శిక్షించి, వివాహితలను శిక్ష నుంచి మినహాయించే విధంగా ఉన్న సెక్షన్ 497ను రద్దు చేయాలని జోసెఫ్ షైనీ అనే వ్యక్తి పిటిషన్ దాఖలు చేశారు.

దీనిపై ప్రధాన న్యాయమూర్తి దీపక్ మిశ్రాతో కూడిన ఐదుగురు సభ్యుల రాజ్యాంగ ధర్మాసనం విచారణ జరుపుతోంది. ఈ ధర్మాసనంలో న్యాయమూర్తులు ఆర్‌ఎఫ్ నారిమన్, ఎఎం ఖాన్విల్కర్, డివై చంద్రచూడ్ ఇందూ మల్హోత్రా సభ్యులుగా ఉన్నారు. ఐపిసిలోని 497వ సెక్షన్ పూర్తిగా ఉద్ధేశపూరిత ఏకపక్షంగా ఉన్నట్లు కన్పిస్తోందని ధర్మాసనం వ్యాఖ్యానించింది. పెళ్లయిన మహిళ వేరే వ్యక్తితో సంబంధాలు పెట్టుకుంటే , ఇందుకు తన భర్త అనుమతి ఉందని చెప్పడం వంటి వాటితోనే సదరు మహిళను నేరం శిక్ష నుంచి తప్పించడం ఏ విధంగా సబబు అని ధర్మాసనం పేర్కొంది. ఓ వైపు మగవారి పట్ల వివక్షత చూపుతున్నట్లుగానే ఈ సెక్షన్ ఉంటోందని, మరోవైపు ఆడవారిని మగవారి సొంత ఆస్తిగా భావించుకునే ధోరణికి బలం చేకూరుస్తున్నట్లుగా ఉందని ధర్మాసనం వ్యాఖ్యానించింది.

పెళ్లయిన మరో వ్యక్తితో వివాహిత అక్రమ సంబంధాలు భర్త అంగీకారం లేదా భర్త ప్రోద్బలంతో ఉన్నట్లయితే అది తప్పు కాదని పేర్కొనడం చివరికి భార్యను ఆస్తిగా భావించడంగానే చూస్తున్నట్లుగా ఉందని సుప్రీంకోర్టు అభిప్రాయపడింది. వివాహితుడితో వివాహిత సంబంధాలకు భర్త అనుమతి ఉండాలనే అంశం చివరికి భార్యను ప్రాణిగా కాకుండా ఆస్తిగా భావించుకునే ఆధిపత్యపు ధోరణిగా కూడా నిర్థారించుకోవచ్చా ? అని ధర్మాసనం ప్రశ్నించింది. 158 ఏండ్ల నాటి ఐపిసి సెక్షన్ 497 ఏం చెబుతోంది? ః ఈ సెక్షన్ ప్రకారం ‘ ఏ వ్యక్తి అయినా తనకు తెలిసిన మహిళతో లైంగిక సంబంధాలు పెట్టుకుంటే, ఆ మహిళ మరో వ్యక్తి భార్య అయి ఉంటే, ఈ ప్రక్రియకు సదరు మహిళ భర్త సమ్మతి కానీ ప్రోద్బలం కానీ లేకుంటే , అటువంటి లైంగిక సంపర్క చర్య అత్యాచారం నేరం పరిధిలోకి రాదు కానీ వ్యభిచారం పరిధిలో నేరంగా పరిగణనలోకి వస్తుంది’ అని తెలిపారు. ఈ అంశంలో ఖచ్చితంగా వైవాహిక పవిత్రత అంశం ఇమిడి ఉందని, అయితే చట్టంలోని సెక్షన్‌లోని నిబంధనల రూపకల్పన నిర్థిష్టంగా సమానత హక్కుకు సంబంధించిన ఆర్టికల్ 14కు భంగకరంగా ఉన్నాయని బెంచ్ తెలిపింది.

ఏకపక్షం, ఉద్ధేశపూర్వకంగా ఉన్నందున సమానత హక్కు పరిధిలో ఈ నిబంధనలు నిలుస్తాయా? అనే అంశాన్ని తాము పరిశీలిస్తామని ధర్మాసనం తెలిపింది. పిటిషనర్ జోసెఫ్ తరఫున న్యాయవాది కాలీశ్వరం రాజ్ తమ వాదనలు విన్పించారు.
జోసెఫ్ షైన్ ఇటలీలో నిససిస్తున్నారు. అంగీకారంతో అవివాహితులు లైంగిక సంబంధాలు పెట్టుకుంటే అది అక్రమ సంబంధం పరిధిలోకి తెచ్చే విధంగా సెక్షన్ 497 నిబంధనలు ఏమీ లేవని ఈ విధంగా చూస్తే అడల్టరీ విషయంలో పెళ్లి కాని వారికి పెళ్లి అయిన వారికి వేర్వేరుగా శిక్షలు, ఇదే సమయంలో వివాహిత వివాహితుడికి భిన్నమైన శిక్షలు ఎంతవరకు సబబు అని పిటిషనర్ తరఫు న్యాయవాది ప్రశ్నించారు. సెక్షన్‌లోనే పలు అసంబద్ధతలు ఉన్నాయని, వీటిని న్యాయస్థానం పరిశీలించాల్సి ఉందని తెలిపారు. వాదోపవాదాల నేపథ్యంలో విచారణ సాగుతోంది.