Home జాతీయ వార్తలు ఢిల్లీ ఎల్‌జి అధికారాలకు కత్తెర

ఢిల్లీ ఎల్‌జి అధికారాలకు కత్తెర

ఆ మూడు అంశాల్లో తప్ప మిగతా అన్ని విషయాల్లో ఢిల్లీ రాష్ట్ర మంత్రివర్గ సిఫార్సుల ప్రకారమే లెఫ్టినెంట్ గవర్నర్ నడుచుకోవాలి
కీలకాంశాలపై విభేదం తలెత్తినప్పుడే రాష్ట్రపతికి నివేదించే అధికారాన్ని ఉపయోగించాలి
ప్రజలు ఎన్నుకున్న ప్రభుత్వానిదే పైచేయి
కేజ్రీవాల్ అప్పీళ్లపై సుప్రీం కోర్టు చరిత్రాత్మక తీర్పు
హైకోర్టు తీర్పు తలకిందులు

SC

న్యూఢిల్లీ: దేశ రాజధాని ఢిల్లీకి రాష్ట్ర హోదా ఇవ్వడం కుదరదని సుప్రీంకోర్టు బుధవారం కీలక తీర్పు చెప్పింది. ఇదే సమయంలో లెఫ్టినెంట్ గవర్నర్ అధికారాలను కత్తిరించింది. ఆయనకు స్వతంత్రంగా నిర్ణయం తీసుకునే హక్కులేదని, ఎన్నికైన ప్రభుత్వం సలహా, సాయం మేరకే నిర్ణయాలు తీసుకోవాలని స్పష్టం చేసింది. రాజ్యాంగంలోని ఆర్టికల్ 239ఎఎను అనుసరించి రాష్ట్రపతికి నివేదించాలని సూచించింది. సమాఖ్య సూర్తితో కేంద్ర, రాష్ట్రప్రభుత్వాలు పనిచేయాలని, ప్రభుత్వ విధులకు లెఫ్టినెంట్ గవర్నర్ ఆటంకం కారాదని తీర్పులో పేర్కొంది. ప్రధాన న్యాయమూర్తి దీపక్ మిశ్రా నేతృత్వం లో ఐదుగురు న్యాయమూర్తుల రాజ్యాంగ ధర్మాసనం ఈ తీర్పునిచ్చింది. ఈ ధర్మాసనం ఢిల్లీ పాలనకు సంబంధించిన విస్తృత  ప్రమాణాలను కూడా నిర్దేశించింది. 2014లో ఆమ్ ఆద్మీ పార్టీ(ఆప్) అధికారంలోకి వచ్చినప్పటి నుంచి ఢిల్లీ ప్రభుత్వానికి, కేంద్ర ప్రభుత్వానికి మధ్య ఢిల్లీ పరిపాలన అధికారాలపై విభేదాలు తలెత్తాయి. ఇప్పుడు అధికారంలో ఉన్న లెఫ్టినెంట్ గవర్నర్ అనిల్ బైజాల్, ఆయనకు పూర్వం ఉన్న నజీబ్ జంగ్ ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్‌తో విభేదించారు. కేంద్రం తరఫున ఆ ఇద్దరు లెఫ్టినెంట్ గవర్నర్‌లు తన ప్రభుత్వం పనిచేయకుండా అడ్డుపడ్డారని కేజ్రీవాల్ ఆరోపించారు.
స్పష్టతనిచ్చిన ప్రధాన న్యాయమూర్తి
ప్రస్తుత రాజ్యాంగం ప్రకారం ఢిల్లీ కేంద్ర పాలిత ప్రాంతం(ఎన్‌సిటి)కి ఇతర రాష్ట్రాల మాదిరిగా రాష్ట్ర హోదా ఉండబోదని భారత ప్రధాన న్యాయమూర్తి తన 237 పేజీల తీర్పులో స్పష్టం చేశారు. న్యాయమూర్తులు ఎ.కె.సిక్రీ, ఎ.ఎం.ఖాన్‌విల్కర్ తరఫున ఆయనే తీర్పును లిఖించారు. ఆయన తన తీర్పులో ‘ఢిల్లీ హోదా అననయమైనది(సూయి జెనెరీస్), ప్రత్యేక తరగతికి చెందినది. ఇతర రాష్ట్రాల గవర్నర్‌లకు ఉన్నటి అధికారాలు ఢిల్లీ గవర్నర్‌కు ఉండబోవు. ఆయన కేవలం కార్యనిరాహకుడు(అడ్మినిస్ట్రేటర్) మాత్రమే, లెఫ్టినెంట్ గవర్నర్‌గా పరిమితమైన అధికారాలతోనే పనిచేయాల్సి ఉంటుంది’ అని పేర్కొన్నారు. రాజ్యాంగం నిర్మాణాత్మకమైనదని, అది నిరంకుశత్వానికి, అరాజకత్వానికి తావులేదని స్పష్టంగా పేర్కొందని ప్రధాన న్యాయమూర్తి ఈ సందర్భంగా అభిప్రాయపడ్డారు.
ఆర్టికల్ 239ఎఎపై తీర్పు : ఢిల్లీ హోదా, అధికారాలకు సంబంధించిన వివాదాస్పద అంశాలపై వ్యాఖ్యానించే ఆర్టికల్ 239ఎఎపై రాజ్యాంగ ధర్మాసనం తీర్పు స్పష్టతనిచ్చింది. ఒకవేళ కేంద్ర ప్రభుత్వానికి, ఢిల్లీ ప్రభుత్వానికి మధ్య రచ్చ ఏర్పడితే ఇద్దరు లేక ముగ్గురు న్యాయమూర్తులతో కూడిన ధర్మాసనం తీర్పు చెబుతుందని పేర్కొంది. లెఫ్టినెంట్ గవర్నర్ నామమాత్ర అధిపతి (నోటా టైటులర్ హెడ్) అయినప్పటికీ అతడు మంత్రి మండలికి ప్రతికూలంగా వ్యతిరేక వైఖరిని అనుసరించకూడదని తీర్పులో పేర్కొన్నారు. స్వతంత్రంగా నిర్ణయాలు తీసుకునే అధికారం లెఫ్టినెంట్ గవర్నర్‌కు లేదని కూడా తీర్పు పేర్కొంది.ప్రజావ్యవస్థ, పోలీస్, భూవ్యవహారాలు అనే మూడు విషయాలు తప్పించి మిగతా విషయాలపై ఢిల్లీ శాసన సభకు పాలనాధికారం ఉందని తెలిపింది. న్యాయమూర్తి డివై చంద్రచూడ్ 175 పేజీల తీర్పును, న్యాయమూర్తి అశోక్ భూషణ్ 123 పేజీల తీర్పును రాశారు. మొత్తం మీద రాజ్యాంగ ధర్మాసనం ఢిల్లీ విషయంలో కేంద్రీకృత విధానాన్ని వ్యతిరేకించింది. సంతుల సమాఖ్య విధానం ఉండాలని పేర్కొంది. అన్ని అధికారాలను కేంద్రం స్వాహా చేయకూడదని, రాష్ట్రాలకు స్వేచ్ఛ ఉండాలని, కేంద్రం అనవసరంగా జోక్యం చేసుకోకూడదని స్పష్టం చేసింది.
ఢిల్లీకిచ్చిన తీర్పునే అనుసరించాలి: పుదుచ్చేరి సిఎం
ఢిల్లీ లెఫ్టినెంట్ గవర్నర్ అధికారాలకు సుప్రీంకోర్టు తీర్పు కళ్లెం వేయడంతో అదే పద్ధతిని తమ కేంద్రపాలిత ప్రాంతానికి వర్తింపచేయాలని పుదుచ్చేరి ముఖ్యమంత్రి వి. నారాయణస్వామి డిమాండ్ చేశారు. ఒకవేళ ఆ తీర్పును ఉల్లంఘిస్తే న్యాయ చర్యలు చేపడతామని హెచ్చరించారు. పుదుచ్చేరిలో ముఖ్యమంత్రి నారాయణస్వామి, లెఫ్టినెంట్ గవర్నర్ కిరణ్ బేడీతో అధికారాల విషయంలో చాలా కాలంగా విభేదిస్తున్నారు. సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పును పుదుచ్చేరిలో అనుసరించకుంటే కోర్టు ధిక్కారణ పిటిషన్ వేస్తామన్నారు.
ఘన విజయం: ఆప్ : ఢిల్లీ ప్రభుత్వానికి, లెఫ్టినెంట్ గవర్నర్‌కు మధ్య ఏర్పడిన తగాదాలో సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పును ఆమ్ ఆద్మీ పార్టీ(ఆప్) బుధవారం స్వాగతించింది.‘ ఇది ప్రజలకు, ప్రజాస్వామ్యానికి లభించిన ఘన విజయం’ అని ఢిల్లీ సిఎం అరవింద్ కేజ్రీవాల్ ట్వీట్ చేశారు. కాగా ఢిల్లీ ఉపముఖ్యమంత్రి మనీశ్ సిసోడియా ఈ తీర్పు చారిత్రకమైనదని పేర్కొన్నారు. ఢిల్లీ ప్రజల తరఫున సుప్రీంకోర్టుకు కృతజ్ఞతలు తెలుపుకుంటున్నానని ఆయన విలేకరులతో అన్నారు.
కాంగ్రెస్ ప్రతిస్పందన : కాంగ్రెస్ ఢిల్లీని 15 ఏళ్లు పాలించి(19982013) ఎంతో అభివృద్ధిని అందించింది’ అని ఢిల్లీ కాంగ్రెస్ చీఫ్ అజయ్ మకెన్ అన్నారు. ఇదిలా ఉండగా సుప్రీం కోర్టు తీర్పుతో ఆప్ గెలుపొందడంపై ఢిల్లీ మాజీ ముఖ్యమంత్రి షీలా దీక్షిత్ పెద్దగా ప్రాధాన్యత ఇవ్వలేదు. తాను ఢిల్లీ ముఖ్యమంత్రిగా (19982013) ఉనప్పుడు ప్రభుత్వానికి, లెఫ్టినెంట్ గవర్నర్‌కు మధ్య అభిప్రాయభేదాలుండేవని, కానీ ఎన్నడూ తగాదా ఏర్పడలేదని అన్నారు.
అధికారాలను స్వాహా చేయరాదు: వామపక్షాలు
ఆమ్ ఆద్మీ పార్టీ ప్రభుత్వం విధాన నిర్ణయాల్లో లెఫ్టినెంట్ గవర్నర్ కలుగజేసుకోవడంపై సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పును వామపక్షాలు స్వాగతించాయి. ఎన్నికైన ప్రభుత్వాల అధికారాలను స్వాహా చేయరాదని సుప్రీంకోర్టు తీర్పు మరోసారి స్పష్టం చేసిందన్నాయి. సిపిఐ(ఎం) ప్రధాన కార్యదర్శి సీతారాం ఏచూరి ‘సుప్రీంకోర్టు తీర్పు లెఫ్టినెంట్ గవర్నర్ల అధికార దుర్వినియోగాన్ని మరోసారి వెలుగులోకి తెచ్చింది’ అన్నారు. ‘ఈ తీర్పు ఓ రాష్ట్రానికి సంబంధించినదే అయినప్పటికీ అన్ని రాష్ట్రాల గవర్నర్లు, లెఫ్టినెంట్ గవర్నర్లకు వర్తింపజేయాలి. దీనిని కేంద్ర ప్రభుత్వం కూడా గుర్తించాలి’ అని సిపిఐ నాయకుడు డి. రాజా చెప్పారు