Friday, April 26, 2024

కేంద్రం సీల్డ్ కవర్ సూచనను తిరస్కరించిన సుప్రీంకోర్టు

- Advertisement -
- Advertisement -

న్యూఢిల్లీ: అదానీ గ్రూప్‌-హిండెన్‌బర్గ్ అంశాన్ని పరిశీలించేందుకు ఏర్పాటుచేసే కమిటీకి నిపుణుల పేర్లను సీల్డ్ కవర్‌లో స్వీకరించాలన్న కేంద్ర ప్రభుత్వ సూచనను సుప్రీంకోర్టు శుక్రవారం తిరస్కరించింది. నిపుణుల కమిటీని తామే ఎంపికచేస్తామని, అదంతా పారదర్శకంగా జరుపుతామని భారత ప్రధాన న్యాయమూర్తి డివై. చంద్రచూడ్ నేతృత్వంలోని ధర్మాసనం తెలిపింది. ‘ఒకవేళ మేము ప్రభుత్వం నుంచే పేర్లను స్వీకరిస్తే, అది ప్రభుత్వం ఏర్పాటు చేసిన కమిటీ అనే అనుకుంటారు. కమిటీపై ప్రజలకు పూర్తి విశ్వాసం ఉండాలి’ అని ప్రధాన న్యాయమూర్తి అన్నారు.

హిండెన్‌బర్గ్- అదానీ ఉదంతంపై రిటైర్డ్ సుప్రీంకోర్టు జడ్జీ నేతృత్వంలో కమిటీని ఏర్పాటు చేస్తాం, సిట్టింగ్ సుప్రీంకోర్టు జడ్జీ నేతృత్వంలో మాత్రం కాదని సుప్రీంకోర్టు స్పష్టంచేసింది. అదానీ గ్రూప్ స్టాకులు భారీగా పతనమైన నేపథ్యంలో భారతీయ మదుపరుల ప్రయోజనాలు పరిరక్షించాల్సి ఉందని సుప్రీంకోర్టు ఫిబ్రవరి 10వ తేదీనే స్పష్టంచేసింది. అందుకు మాజీ జడ్జీ నేతృత్వంలో నిపుణుల కమిటీని ఏర్పాటుచేయాలని కేంద్రానికి సూచించింది. ఇటీవల అదానీ షేర్లు భారీగా నష్టపోయిన నేపథ్యంలో దాఖలైన పిల్స్‌ను సుప్రీంకోర్టు విచారణకు స్వీకరించింది. నిపుణుల కమిటీకి పేర్లను సీల్డ్ కవర్‌లో సమర్పిస్తామని న్యాయమూర్తులు పి.ఎస్. నర్సింహా, జెబి. పార్ధివాలతో కూడిన ధర్మాసనానికి కేంద్రం తెలిపింది.

స్టాక్ మార్కెట్‌ను నియంత్రించే ‘సెబీ’ తన నోట్‌ను సుప్రీంకోర్టుకు సమర్పించింది. అందులో షార్ట్ సెల్లింగ్‌ను నిషేధించడం లేక అప్పుగా తెచ్చిన షేర్లను అమ్మడాన్ని నిషేధించడంకు సానుకూలంగా లేమని పేర్కొంది. అదానీ గ్రూప్ కంపెనీ షేర్లు భారీగా పతనం కావడంపై ఇప్పటి వరకు నాలుగు ప్రజా ప్రయోజనాల వ్యాజ్యాలు(పిల్స్) దాఖలయ్యాయి. అదానీ గ్రూప్ స్టాక్ మ్యానిపులేషన్‌కు, మోసానికి పాల్పడిందని జనవరి 24న హిండెన్‌బర్గ్ రీసెర్చ్ నివేదికను విడుదల చేశాక ఈ పరిణామం చోటుచేసుకుంది. గౌతమీ అదానీ నేతృత్వంలోని కంపెనీలు ఇప్పటి వరకు 120 బిలియన్ డాలర్ల మార్కెట్ వాల్యూను కోల్పోయాయి.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News