Home జాతీయ వార్తలు కర్నాటకపై నేడు సుప్రీం రూలింగ్

కర్నాటకపై నేడు సుప్రీం రూలింగ్

Supreme Court

న్యూఢిల్లీ : 15 మంది కర్నాటక అసమ్మతి ఎమ్మెల్యేల పిటిషన్లపై బుధవారం (నేడు) సుప్రీంకోర్టు తమ ఆదేశాలను వెలువరిస్తుంది. ప్రస్తుత కర్నాటక సంకీర్ణ ప్రభుత్వ సంక్షోభంలో అత్యున్నత న్యాయస్థానం కీలకం కానుంది. తాము రాజీనామాలను సరైన పద్థతిలో సమర్పించామని, వాటిని ఆమోదించేలా కర్నాటక స్పీకర్ కెఆర్ రమేష్‌కుమార్‌కు ఆదేశాలు వెలువరించాలని రెబెల్ ఎమ్మెల్యేలు పిటిషన్లు వేశారు. దీనికి సంబంధించి ఎమ్మెల్యేలు, దీనికి ప్రతిగా స్పీకర్, కర్నాటక ముఖ్యమంత్రి హెచ్‌డి కుమారస్వామిల వాదనలపై విచారణ ప్రక్రియ మంగళవారం ముగిసింది. దీనితో ప్రధాన న్యాయమూర్తి రంజన్ గొగోయ్‌తో కూడిన ధర్మాసనం ఈ కేసుకు సంబంధించి తమ నిర్థిష్ట ఆదేశాలను బుధవారం వెలువరించనుంది. ఎమ్మెల్యేల తరఫున సీనియర్ న్యాయవాది ముకుల్ రొహత్గీ తమ వాదన సంపూర్తి దశలో ప్రస్తుత యధాతథ స్థితి కొనసాగించాలని అభ్యర్థించారు.

మంగళవారంతో ఈ యధాతథస్థితి గడువు ముగుస్తుంది. ఎమ్మెల్యేల రాజీనామాలు లేదా వారిపై అనర్హత వేటు విషయాలలో స్పీకర్ ఎటువంటి చర్య తీసుకోకుండా సుప్రీంకోర్టు నిరోధించింది. గురువారం రాష్ట్ర అసెంబ్లీలో కుమారస్వామి ప్రభుత్వ బలపరీక్ష జరగనుంది. ఈ దశలో సుప్రీంకోర్టు ధర్మాసనం ఎమ్మెల్యేల రాజీనామాలపై స్పీకర్ చర్యకు ఎటువంటి ఆదేశాలు వెలువరిస్తుందనేది కీలకంగా మారింది. రాజీనామాల విషయంలో ఎమ్మెల్యేల నుంచి ఒత్తిడి ప్రక్రియ తన విధి నిర్వహణకు భంగకరంగా ఉంటుందని స్పీకర్ తమ పిటిషన్‌లో తెలియచేసుకున్నారు.
పిటిషన్ల విచారణనే కుదరదు : సిఎం
రాజీనామాల అంశంపై ఎమ్మెల్యేల పిటిషన్ విచారణ అర్హతను ముఖ్యమంత్రి సవాలు చేశారు. ప్రస్తుతం ఎమ్మెల్యేల రాజీనామాతో ప్రభుత్వం మైనార్టీలో పడిందని, దీనిని పరిగణనలోకి తీసుకునే ధర్మాసనం స్పందించాలని వారి తరఫు న్యాయవాది అభ్యర్థించారు. అధికార సంకీర్ణ పక్షం విప్ ప్రాతిపదికన 15 మంది ఎమ్మెల్యేలపై స్పీకర్ ఎటువంటి నిర్ణయం తీసుకున్నా, వారిని సభకు హాజరు కాకుండా ఆదేశాలు వెలువరించినా పరిస్థితి ఏమిటనేది తెలియచేయాలని న్యాయవాది కోరారు. మైనార్టీ ప్రభుత్వం ఉందనేది గమనించాలని తెలిపారు. స్పీకర్ నిర్ణయం తీసుకోవాలని పేర్కొంటూ రెండు మధ్యంతర ఉత్తర్వులు వెలువరించాల్సిన అత్యవసర ప్రాతిపదిక ఈ కేసులో లేదని సిఎం కుమారస్వామి తరఫు న్యాయవాది పేర్కొన్నారు. స్పీకర్ స్వయంగా నిర్ణ యం తీసుకునే అవకాశం కల్పించాల్సి ఉందని ఆయన తరఫు సీనియర్ న్యాయవాది రాజీవ్ ధావన్ సూచించారు. గడువులోగానే నిర్ణయం తీసుకోవాలని స్పీకర్ వ్యవస్థను ఆదేశించవచ్చా? అని ప్రశ్నించారు. రాజీనామాలు ప్రత్యేక పరిస్థితులలో వెలువడ్డాయి. సరైన విధివిధానాలకు అనుగుణంగా లేవు.ఈ దశలో సాయంత్రం ఆరుగంటల్లోగా స్పీకర్ అది చేయాలని ఇది చేయకూడదనే ఆదేశాలను న్యాయస్థానం వెలువరించడం కుదరదని తేల్చిచెప్పారు.

తమ ప్రభుత్వాన్ని కూల్చివేసేందుకు ఎమ్మెల్యేలు వేటకు దిగినట్లుగా ప్రయత్నాలు జరుగుతున్నాయని, ఈ అస్థిరత చర్యలకు ఉతం కల్పించడం తగదని సిఎం వాదనలో తెలిపారు. నిజానికి ఇటువంటి పిటిషన్లను ధర్మాసనం విచారణకు స్పీకరించాల్సిన పనిలేదన్నారు. గత ఏడాది బిఎస్ యడ్యూరప్ప ప్రభుత్వ ఏర్పాటు సమయంలో బలపరీక్ష దశలో జరిగిన పరిణామాలను స్పీకర్ తరఫు న్యాయవాది ఎఎం సింఘ్వీ తెలిపారు. అప్పుడు సుప్రీంకోర్టు నుంచి స్పీకర్‌కు ఎటువంటి ఆదేశాలు వెలువడలేదనేది గుర్తించాలన్నారు. ఇప్పటి పరిస్థితి కొనసాగాలనే ఇంతకు ముందటి ఆదేశాలను సుప్రీంకోర్టు ఉపసంహరించుకుని, తమ విధుల నిర్వహణకు అనువైన వాతావరణం కల్పించాలని స్పీకర్ అభ్యర్థించారు. బుధవారం నాటికి స్పీకర్ స్వయంగా ఎమ్మెల్యేల రాజీనామాపై ఎటువంటి చర్యలు తీసుకోవాలనేది ఖరా రు చేసుకుంటారని, అయితే ఇంతకు ముందు యధాతథ స్థితి ఉత్తర్వులను సవరించాల్సి ఉందని ఆయన తరఫు న్యాయవాది కోరారు.
స్పీకర్ తొక్కిపెట్టే ధోరణి : ఎంఎల్‌ఎలు
ప్రజా ప్రతినిధుల రాజీనామాలు తన వద్దకు వచ్చినప్పుడు స్పీకర్ వాటిని తొక్కిపెట్టడానికి వీల్లేదని, వెంటనే నిర్ణయం తీసుకోవల్సి ఉందని , లేకపోతే పక్షపాత ధోరణికి దిగినట్లే అవుతుందని ఎమ్మెల్యేల తరఫు న్యాయవాది స్పష్టం చేశారు. దీనిని ప్రతివాదులు వ్యతిరేకించారు. స్పీకర్ ఒక విధంగానే వ్యవహరించాలనే ఆదేశాలు వెలువరించాలనడం ఎంత వరకు సబబు అని ప్రశ్నించారు. స్పీకర్ అనర్హత వేటుకు దిగవచ్చునని తెలిపే ప్రాతిపదికలు , గత తీర్పులు లేవని అయితే తక్షణం కాకపోయినా త్వరితగతిన రాజీనామాలు ఆమోదించాలనే అంశంపై న్యాయస్థానం నుంచి స్పష్టత ఉందని, సంబంధిత నిర్థారణలు రికార్డులలో ఉన్నాయని రెబెల్ ఎమ్మెల్యేల న్యాయవాది తెలిపారు. త్రిపక్షాలకు చెందిన అత్యంత సీనియరు న్యాయవాదుల తీక్షణ వాదనల దశ ముగిసిన తరువాత బుధవారం సుప్రీంకోర్టు ఆదేశాలు వెలువడనున్నాయి.

supreme court to hear rebel mlas plea today