Home తాజా వార్తలు అసెంబ్లీ రద్దుపై డికె అరుణ పిటిషన్ కొట్టివేసిన సుప్రీం

అసెంబ్లీ రద్దుపై డికె అరుణ పిటిషన్ కొట్టివేసిన సుప్రీం

Supreme dismisses petition on dissolution of Assembly

డికె అరుణకు సుప్రీంలో చుక్కెదురు

అసెంబ్లీ రద్దుపై పిటిషన్‌ను కొట్టివేసిన ధర్మాసనం

మన తెలంగాణ / న్యూఢిల్లీ, హైదరాబాద్ : రాష్ట్ర అసెంబ్లీని రద్దు చేయడాన్ని సవాలు చేస్తూ కాంగ్రెస్‌కు చెందిన డి.కె. అరుణ దాఖలు చేసిన పిటిషన్‌ను సుప్రీంకోర్టు శుక్రవారం కొట్టివేసింది. గతంలో హైకోర్టులో ఇదే అంశంతో ఆమె పిటిషన్‌ను దాఖలు చేయగా ధర్మాసనం కొట్టివేయడంతో సుప్రీంకోర్టును ఆశ్రయించారు. దీనిపై విచారణ జరిపిన జస్టిస్ ఏకె సిక్రీ, జస్టిస్ అశోక్ భూషణ్‌లతో కూడిన సుప్రీంకోర్టు ధర్మాసనం శుక్రవారం కొట్టివేసింది. శాసనసభ్యురాలిగా ఉన్న తనకు అసెంబ్లీని రద్దు చేయడంపై ప్రభుత్వంనుంచి ఎలాంటి సమాచారం ఇవ్వలేదని, ప్రజలు ఓటు వేసి తనను ఐదేళ్ళ కాలవ్యవధికి ఎన్నుకున్నప్పటికీ తొమ్మిది నెలల ముందుగానే రద్దు చేయడంతో తన హక్కులకు భంగం వాటిల్లిందని ఆమె తన పిటిషన్‌లో పేర్కొన్నారు. పిటిషనర్ తరఫున సీనియర్ న్యాయవాది నిరూప్‌రెడ్డి తన వాదనలను వినిపిస్తూ శాసనసభను సమావేశ పర్చకుండానే ప్రభుత్వం ఏకపక్షంగా అసెంబ్లీని రద్దుచేసే నిర్ణయం తీసుకున్నదని పేర్కొన్నారు. ఓటర్లుగా పేర్లను నమోదు చేసుకునేందుకు కటాఫ్ తేదీ వాస్తవానికి వచ్చే ఏడాది జనవరి 1 అని కేంద్ర ఎన్నికల సంఘం పేర్కొన్నప్పటికీ దాన్ని సవరించి ఈ ఏడాది జనవరి 1వ తేదీని కటాఫ్‌గా పేర్కొనిందని, ఈ కారణంగా సుమారు ఇరవై లక్షల మంది ఓటర్లుగా వారి పేర్లను నమోదు చేసుకునే అవకాశాన్ని కోల్పోయారని తెలిపారు.

ప్రతీ ఏటా రెండు కటాఫ్ తేదీలు ఉన్నట్లయితే ఈ సమస్యకు పరిష్కారం దొరుకుతుందని, ఈ దిశగా ఆలోచించిన కేంద్ర ప్రభుత్వం బిల్లును ప్రతిపాదించినప్పటికీ అది పెండింగ్‌లో ఉందని, అందువల్ల సుప్రీంకోర్టు తన విచక్షణాధికారంతో తగిన ఆదేశాలను జారీ చేయాలని అభ్యర్థించారు. తెలంగాణ ప్రభుత్వం తరఫున హాజరైన సీనియర్ న్యాయవాది ముకుల్ రోహతగీ, అసెంబ్లీని రద్దుచేసే అధికారం మంత్రిమండలికి ఉన్నదని, తన విచక్షణాధికారం మేరకే అసెంబ్లీని రద్దు చేయాలని మంత్రివర్గం నిర్ణయం తీసుకున్నదని వివరించారు. మంత్రిమండలి తీసుకున్న ఏకగ్రీవ నిర్ణయం మేరకు అసెంబ్లీ రద్దు చేసినట్లు గవర్నర్‌కు స్వయంగా ముఖ్యమంత్రి లిఖితపూర్వకంగా తెలియజేశారని, ఆ తర్వాత ఎన్నికల కమిషన్ సైతం ఎన్నికల నిర్వహణకు షెడ్యూలు ప్రకటించిందని పేర్కొన్నారు. ఇరు తరఫున వాదనలు విన్న ధర్మాసనం& కేంద్ర ఎన్నికల సంఘం ఇప్పటికే షెడ్యూలు ప్రకటించి ఎన్నికల సన్నద్ధతకు సంబంధించిన సమీక్ష ప్రక్రియను కూడా పూర్తిచేసినందున ఈ పిటిషన్‌ను కొట్టివేస్తున్నట్లు స్పష్టం చేసింది.

Supreme dismisses petition on dissolution of Assembly

Telangana Letest News