Saturday, April 20, 2024

ధోనీ బాటలోనే సురేశ్ రైనా

- Advertisement -
- Advertisement -

Suresh Raina Retires from All Formats

న్యూఢిల్లీ: మహేంద్ర సింగ్ ధోనీ బాటలోనే అతని శిష్యుడు సురేశ్ రైనా నడిచాడు. భారత అత్యుత్తమ క్రికెటర్లలో ఒకడిగా పేరు తెచ్చుకున్న సురేశ్ రైనా కూడా శనివారం అంతర్జాతీయ క్రికెట్‌కు రిటైర్మెంట్ ప్రకటించాడు. 2005లో అంతర్జాతీయ కెరీర్‌కు శ్రీకారం చుట్టిన రైనా టీమిండియా అత్యుత్తమ బ్యాట్స్‌మన్‌లలో ఒకడిగా నిలిచాడు. సుదీర్ఘ కెరీర్‌లో రైనా జట్టుకు ఎన్నో చిరస్మరణీయ విజయాలు అందించాడు. మూడు ఫార్మాట్‌లలో రైనా టీమిండియాకు ప్రాతినిథ్యం వహించాడు. తాను ఎంతో అభిమానించే ధోనీ క్రికెట్‌కు రిటైర్మెంట్ ప్రకటించడం షాక్‌కు గురి చేసిందని, తాను కూడా అతని బాటలోనే పయనించాలని నిర్ణయించినట్టు తెలిపాడు. ఇక తన రిటైర్మెంట్ అంశాన్ని రైనా శనివారం రాత్రి ఇన్‌స్టాగ్రామ్ ద్వారా ప్రకటించాడు. సుదీర్ఘ కాలం పాటు సాగిన కెరీర్‌లో ఎన్నో చిరస్మరణీయ జ్ఞాపకాలు తనకు ఉన్నాయన్నాడు.

ఇక తనను వెన్నుతట్టి ప్రోత్సహించిన సహచర క్రికెటర్లకు, కెప్టెన్లకు, అభిమానులకు, కుటుంబ సభ్యులకు సదా రుణపడి ఉంటానని తెలిపాడు. పరిమిత ఓవర్ల క్రికెట్‌లో రైనా మంచి పేరు తెచ్చుకున్నాడు. ఎన్నో మ్యాచుల్లో టీమిండియాకు ఒంటిచేత్తో విజయాలు సాధించి పెట్టాడు. అయితే కెరీర్ టెస్టుల్లో పెద్దగా ప్రభావం చూపలేక పోయాడు. 18 టెస్టు మ్యాచుల్లో టీమిండియాకు ప్రాతినిథ్యం వహించిన రైనా 768 పరుగులు సాధించాడు. అయితే వన్డేల్లో మాత్రం మెరుగైన ఆటతో ఆకట్టుకున్నాడు. రైనా కెరీర్‌లో 226 వన్డేలు ఆడాడు. ఇందులో 5615 పరుగులు చేశాడు. ఇక వన్డేల్లో రైనా ఐదు సెంచరీలు, మరో 36 అర్ధ శతకాలు నమోదు చేశాడు. ఇక 78 అంతర్జాతీయ ట్వంటీ20 మ్యాచుల్లో కూడా టీమిండియాకు ప్రాతినిథ్య వహించాడు. టి20 కెరీర్‌లో రైనా 1600 పరుగులు సాధించాడు. ఇదిలావుండగా మూడు ఫార్మాట్‌లలోనూ సెంచరీలు సాధించిన క్రికెటర్‌గా రైనా రికార్డు సాధించాడు.

డబుల్ షాక్

ధోనీ రిటైర్మెంట్‌తో షాక్‌కు గురైన క్రికెట్ అభిమానులకు సురేశ్ రైనా మరో షాక్ ఇచ్చాడు. తన అభిమాన క్రికెటర్ ధోనీ బాటలోనే నడుస్తూ అంతర్జాతీయ క్రికెట్‌కు వీడ్కోలు పలుకుతున్నట్టు ప్రకటించాడు. ప్రస్తుతం రైనా కూడా ఐపిఎల్‌లో చెన్నై సూపర్ కింగ్స్‌కు ప్రాతినిథ్యం వహిస్తున్న విషయం తెలిసిందే. ఈ జట్టుకు ధోనీ కెప్టెన్‌గా, రైనా వైస్ కెప్టెన్‌గా కొనసాగుతున్నారు. ఇలా ఇద్దరు ఒకటే రోజు అంతర్జాతీయ క్రికెట్‌కు వీడ్కోలు పలకడం అరుదైన ఘట్టంగా మారింది. ఇక రైనాకు కూడా అభినందనలు వెల్లువెత్తాయి. టీమిండియాకు అతను అందించిన సేవలను గుర్తు చేసుకుంటూ సోషల్ మీడియాలో పోస్ట్‌లు పెట్టారు.

Suresh Raina Retires from All Formats

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News