Friday, April 26, 2024

టీమిండియా అగ్రస్థానం మరింత పదిలం

- Advertisement -
- Advertisement -

దుబాయి: అంతర్జాతీయ క్రికెట్ మండలి (ఐసిసి) తాజాగా ప్రకటించిన టి20 ర్యాంకింగ్స్‌లో టీమిండియా తన అగ్రస్థానాన్ని కాపాడుకుంది. ఆస్ట్రేలియాతో సొంత గడ్డపై జరిగిన సిరీస్‌లో భారత్ 21 తేడాతో జయకేతనం ఎగుర వేసిన విషయం తెలిసిందే. ఈ సిరీస్ సాధించడంతో టీమిండియా తన టాప్ ర్యాంక్‌ను మరింత పదిలం చేసుకుంది. ప్రస్తుతం భారత్ 268 రేటింగ్ పాయింట్లతో అగ్రస్థానంలో కొనసాగుతోంది. కిందటి ర్యాంకింగ్స్‌లో ఇంగ్లండ్ కంటే భారత్ ఒకే ఒక పాయింట్ ఆధిక్యంలో నిలిచింది. ఈసారి మాత్రం ఇంగ్లండ్‌పై ఏడు పాయింట్ల ఆధిక్యాన్ని అందుకుంది. ఇక పాకిస్థాన్‌తో జరిగిన సిరీస్‌లో ఇంగ్లండ్ రెండు మ్యాచుల్లో ఓటమి పాలుకావడంతో దాని ప్రభావం రేటింగ్ పాయింట్లపై పడింది. తాజా ర్యాంకింగ్స్‌లో ఇంగ్లండ్ 261 పాయింట్లతో రెండో స్థానంలో నిలిచింది. ఇక సౌతాఫ్రికా, పాకిస్థాన్‌లు చెరో 258 పాయింట్లతో సమంగా నిలిచాయి. అయితే ఆడిన మ్యాచ్‌లను పరిగణలోకి తీసుకుని సౌతాఫ్రికాకు మూడో ర్యాంక్‌ను కేటాయించాడు. ఇక పాకిస్థాన్‌కు నాలుగో ర్యాంక్ లభించింది. న్యూజిలాండ్ 252 పాయింట్లతో ఐదో స్థానాన్ని దక్కించుకుంది. ప్రపంచ ఛాంపియన్ ఆస్ట్రేలియా మాత్రం 250 పాయింట్లతో ఆరో స్థానానికి పరిమితమైంది. భారత్‌తో జరిగిన సిరీస్‌లో ఓటమి పాలుకావడం ఆస్ట్రేలియా ర్యాంకింగ్స్‌పై ప్రభావం చూపించింది. ఇక వెస్టిండీస్ ఏడో, శ్రీలంక 8వ ర్యాంక్‌లో నిలిచాయి. బంగ్లాదేశ్, అఫ్గానిస్థాన్ 9, 10 ర్యాంక్‌లను సొంతం చేసుకున్నాయి.
సూర్యకుమార్‌కు మూడో ర్యాంక్
మరోవైపు ప్లేయర్స్ ర్యాంకింగ్స్‌లో మహ్మద్ రిజ్వాన్ (పాకిస్థాన్) బ్యాటింగ్ విభాగంలో అగ్రస్థానాన్ని కాపాడుకున్నాడు. రిజ్వాన్ ప్రస్తుతం 825 పాయింట్లతో టాప్ రాంక్‌లో నిలిచాడు. ఐడెన్ మార్‌క్రామ్ (సౌతాఫ్రికా) 792 రేటింగ్ పాయింట్లతో రెండో ర్యాంక్‌ను దక్కించుకున్నాడు. ఇక ఆస్ట్రేలియా సిరీస్‌లో మెరుగైన బ్యాటింగ్‌ను కనబరిచిన భారత బ్యాటర్ సూర్యకుమార్ యాదవ్ ఒక స్థానాన్ని మెరుగు పరుచుకుని మూడో ర్యాంక్‌కు చేరుకున్నాడు. సూర్యకుమార్ 780 పాయింట్లతో టాప్3లో చోటు సంపాదించాడు. ఇక పాకిస్థాన్ కెప్టెన్ బాబర్ ఆజమ్ ఒక ర్యాంక్‌ను కోల్పోయి నాలుగో స్థానంలో నిలిచాడు. డేవిడ్ మలాన్ (ఇంగ్లండ్) ఐదో ర్యాంక్‌ను సొంతం చేసుకున్నాడు. బౌలింగ్ విభాగంలో జోష్ హాజిల్‌వుడ్ (ఆస్ట్రేలియా) 785 పాయింట్లతో టాప్ ర్యాంక్‌ను నిలబెట్టుకున్నాడు. తబ్రెస్ షంసి (సౌతాఫ్రికా) రెండో, ఆదిల్ రషీద్ (ఇంగ్లండ్) మూడో ర్యాంక్‌లో నిలిచారు. భారత సీనియర్ బౌలర్ భువనేశ్వర్ కుమార్ తొమ్మిదో ర్యాంక్‌కు పడిపోయాడు.

Suryakumar Yadav climbs to 3rd spot in ICC T20 Rankings

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News