Wednesday, April 24, 2024

ఛానెళ్ల తీర్పు!

- Advertisement -
- Advertisement -

          Sushant Singh Rajput death case  చట్టాలు, న్యాయస్థానాలు చేయాల్సిన పనిని మీడియా, పితృస్వామిక సమాజమే చేసేస్తే ఆ ‘పగభగ’ కు ఆహుతైపోయేవారి మానసిక స్థితి ఎలా ఉంటుందో ఊహించడం సాధ్యమయ్యే పనేనా? మొన్న జూన్ నెలలో ఆత్మహత్య చేసుకున్న యువ హిందీ నటుడు సుశాంత్ సింగ్ రాజ్‌పుట్ సహచరి, ఆయన తోటి నటి రియా చక్రవర్తి ప్రస్తుతం ఇదే విచిత్ర విషాద స్థితిలో ఉన్నారనడం అబద్ధం కాని, అతిశయోక్తి కాని కాదు. బీహార్ రాష్ట్రానికి చెందిన 34 ఏళ్ల సుశాంత్, బెంగాల్‌కు చెందిన 28 సంవత్సరాల రియా సహజీవనం ప్రారంభించి ఏడాది అయింది. సుశాంత్ మానసిక అస్థిమితత్వంతో బాధపడుతున్నట్టు, దానిని బయటికి చెప్పుకుంటే సినిమా రంగంలో అవకాశాలు కోల్పోతాననే భయంతో గోప్యత పాటిస్తూ వచ్చినట్టు వెల్లడైంది.

అంతటి సున్నిత స్థితిలోని సహచరుని రియా చక్రవర్తి ఎంతో బాధ్యతతో, ప్రేమతో చూసుకుంటూ వచ్చారని తెలిసింది. అయితే ఆమె, ఆమె కుటుంబం తమ కుమారుడిని తమకు కాకుండా చేశారనే దురభిప్రాయాన్ని పెంచుకున్న సుశాంత్ తండ్రి యువ నటుడి ఆత్మహత్య అనంతరం రియాను, ఆమె సోదరుడిని, తలిదండ్రులను దోషులుగా పేర్కొంటూ పాట్నా పోలీసులకు ఫిర్యాదు చేశారు. బీహార్ ప్రస్తుతం అసెంబ్లీ ఎన్నికల రంగస్థలంగా మారినందున ఈ కేసుకు అమిత ప్రాధాన్యం ఏర్పడింది. బీహారీ అయిన సుశాంత్‌ను ముంబై చలన చిత్ర రంగం వేధించిందనే కోణం కూడా పనిలో పనిగా ముందుకు దూసుకొచ్చింది. దీనితో సుశాంత్ ఆత్మహత్యపై సుప్రీంకోర్టు ఆదేశాల మేరకు సిబిఐ దర్యాప్తు మొదలైంది. ఒకవైపు సిబిఐ, ఇంకో వైపు కేంద్రం ఆధీనంలోని ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్, మాదక ద్రవ్యాల నియంత్రణ బోర్డు రంగంలోకి దిగాయి.

ఆ ఆత్మహత్యకు సంబంధించే మాదక ద్రవ్యాల సేకరణ కేసులో రియా చక్రవర్తిని, ఆమె సోదరుడిని కూడా అరెస్టు చేశారు. ఆమె బెయిల్ విన్నపాన్ని స్పెషల్ కోర్టు తిరస్కరించింది. జాతీయ స్థాయి చానళ్లలోనూ, సామాజిక మాధ్యమాల్లోనూ రియాను వల వేసి సుశాంత్‌ను లోబరచుకున్న వలపు గత్తెగా, పైలాపచ్చీసుగా చిత్రిస్తూ దేశంలోని మిగతా సమస్యలన్నింటికంటే ఈ ఉదంతానికే అమిత ప్రాధాన్యమిస్తూ సాగుతున్న ప్రచారం ఆమెను, ఆమె కుటుంబాన్ని ఎంత బాధకు గురి చేసి ఉంటాయో వివరించనక్కర లేదు. వాస్తవానికి సుశాంత్ ఆత్మహత్య చేసుకున్న క్షణంలో రియా అతని వద్ద లేరు. తన సోదరిని రమ్మని కోరానని అందుచేత పుట్టింటికి వెళ్లవలసిందని సుశాంత్ సూచించడంతో ఆమె తలిదండ్రుల వద్దకు వెళ్లారు. సుశాంత్ సోదరి కూడా వచ్చి వెళ్లిపోయిన తర్వాత ఆయన ఆత్మహత్య చేసుకున్నాడు. మొత్తం కేసు దర్యాప్తులో ఉండగానే మీడియా, పురుష దురహంకార భావజాలం, స్త్రీ ద్వేషం కరడుగట్టిన సమాజం ఆమెను నేరస్థురాలిగా చేసి వేధిస్తున్న వైనాన్ని మహిళా హక్కుల కార్యకర్తలు, ప్రజాస్వామ్య ప్రియులు తీవ్రంగా తప్పుపట్టారు. రియా చక్రవర్తి, ఆమె కుటుంబం సుశాంత్ వద్ద విశేషంగా డబ్బు గుంజుకున్నారని, మాదక ద్రవ్యాలిచ్చి ఆత్మహత్యకు పురికొల్పారని ఆయన తండ్రి చేసిన ఆరోపణలనే రూఢి సాక్షాలుగా పరిగణించి మీడియా ఇలా రెచ్చిపోడం ఎంత మాత్రం సమంజసం కాదు.

సుశాంత్ నుంచి రియా ఖాతాలోకి చెప్పుకోదగిన స్థాయిలో డబ్బు బదిలీ అయిన దాఖలాలు కూడా లేవని ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ దర్యాప్తులో వెల్లడయినట్టు తెలుస్తున్నది. రియా వద్ద మాదక ద్రవ్యాలు కూడా పట్టుబడలేదు. అటువంటప్పుడు ఆమెను దోషిగా నిరూపించడం ప్రాసిక్యూషన్‌కు సాధ్యం కాదని నిపుణులు భావిస్తున్నారు. సుశాంత్, రియా ఆదర్శవంతమైన సహజీవనం గడిపారని, ఆమె మంచి వ్యక్తి, సున్నిత మనస్కురాలని అతడి మానసిక స్థితిని గ్రహించి చక్కగా చూసుకున్నారని వారిద్దరికి సన్నిహితులైన వారు చెప్పినట్టు హఫ్సింగ్టన్ పోస్టు వెల్లడించింది. ఇద్దరూ టెలివిజన్ నుంచి బాలీవుడ్‌కు ఎదిగిన వారే. రియా చక్రవర్తి తెలుగు సినిమా ‘తూనీగ తూనీగ’లో నటించి హిందీ చలన చిత్ర రంగానికి వెళ్లారు. ఆమె మొదట్లో ఎంటివికి విడియో జాకీగా పని చేశారు.

బయటి నుంచి వచ్చి ముంబై సినిమా రంగంలో క్రమక్రమంగా ఎదుగుతూ సుదీర్ఘ పరిచయం తర్వాత సహజీవనం మొదలుపెట్టిన ఇద్దరు నటీనటుల మధ్య వ్యక్తిగత సంబంధాల్లో ఉండగల సాన్నిహిత్యం గురించి లోతుగా తెలుసుకోకుండానే, న్యాయ స్థానం బయట అవాకులు, చవాకులు వ్యాప్తి చేస్తూ తీర్పులివ్వడం అనేది బాధ్యత గల సమాజం లక్షణం కాదు. బీహార్ ఎన్నికల్లో ఎలాగైనా తిరిగి గెలవాలనే లక్షంతో అధికారంలో ఉన్న రాజకీయ శక్తులు చేతికందిన ప్రతిదాన్ని అందుకు ఆయుధంగా వినియోగించే క్రమంలో అమాయక జీవితాలు బలైపోడం ఎంతమాత్రం సమర్థించదగినది కాదు. చట్టం వెలుగులో దర్యాప్తు సంస్థలు నిజానిజాలను నిగ్గు తేల్చిన తర్వాత న్యాయ స్థానం అన్ని కోణాల్లోనూ పరిశీలించి ఇచ్చే తీర్పు కోసం వేచి చూడడమే మంచి పద్ధతి అవుతుంది.

 

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News