Home తాజా వార్తలు అనుమానాస్పదంగా పులి మృతి

అనుమానాస్పదంగా పులి మృతి

Tiger

 

మంచిర్యాల : పత్తి చేనులో పత్తి పంటలకు వేసే క్రిమిసంహారక మందు తిని పులి మృతి చెందగా ఆదివారం మహారాష్ట్ర, తెలంగాణ అటవీ అధికారులు సంయుక్తంగా పులి కళేబరాన్ని స్వాధీనం చేసుకున్నారు. కొమురంభీం ఆసిఫాబాద్‌జిల్లా సిర్పూర్(టి) మండల సరిహద్దులో గల చంద్రాపూర్ జిల్లా పొడుసా గ్రామ సమీపంలోని పత్తి చేనులో ఆనుమానస్పదంగా మృతి చెందిన పులి కళేబరాన్ని స్వాధీనం చేసుకున్నారు. మహారాష్ట్ర, తెలంగాణకు చెందిన అటవీ అధికారులు ఆదివారం ఉదయం పులి కళేబరాన్ని పరిశీలించి నాలుగు రోజుల క్రితమే క్రిమిసంహారక మందు ప్రభావం వల్లనే మరణించి ఉంటుందని అనుమానిస్తున్నారు.

ఒక వేళ వేటగాళ్లు ఉచ్చు బిగించి ఉన్నట్లయితే పులి చర్మం పైన గాయాలు కనిపించేవని ఎలాంటి గాయాలు లేకపోవడంతో క్రిమిసంహారక మందు ప్రభావంతోనే మృతి చెందిందని విచారణ జరుపుతున్నారు. ఇటీవలి కాలంలో మహారాష్ట్ర సరిహద్దులోని పెంచికల్‌పేట, బెజ్జూర్, సిర్పూర్(టి) అడవుల్లో పులుల సంచారం పెరిగింది. ఆదివారం బెజ్జూర్ మండలంలోని ఏటిగూడ అటవీ ప్రాంతంలో పులి దాడి చేయగా రెండు ఎద్దులు మరణించినట్లు అటవీ అధికారులు గుర్తించారు.

అదే విధంగా పెంచికల్‌పేట అడవుల్లో పులుల సంచారాన్ని గుర్తించిన అటవీ అధికారులు ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సూచించారు. వారం రోజుల క్రితం పులి దాడిలో 11 పశువులు మృతి చెందిన విషయం విధితమే. కాగా మహారాష్ట్రలోని తడోబా టైగర్ జోన్ నుంచి తెలంగాణలోని కవ్వాల్ టైగర్ జోన్‌లోకి పులుల వలసలు పెరిగాయి. కొన్ని సందర్బాల్లో పులులు వేటగాళ్ల ఉచ్చుకు బలవుతుండగా మరికొన్ని ఇతర కారణాల వల్ల మృత్యువాత పడుతున్నాయి.

Suspiciously the Tiger died