Home కరీంనగర్ ఇది ఏనాటి నుండో స్వచ్ఛ గ్రామం

ఇది ఏనాటి నుండో స్వచ్ఛ గ్రామం

కరీంనగర్ జిల్లాలో కనీస సౌకర్యాలు లేని గ్రామం రామచంద్రాపూర్. మొత్తం 2000 జనాభా ఉన్న ఆ గ్రామంలో ఇవాళ ప్రతీ ఇంటికీ మరుగుదొడ్లు ఉన్నాయి.
ramchandrapuramపర్యావరణం, పారిశుధ్యం పట్ల శ్రద్ధ తీసుకున్నందుకు ‘శుభ్రం’ అవార్డు అందుకున్నారు. సమిష్టినాయకత్వం ద్వారా మార్పులు తీసుకువచ్చి, ప్రాథమిక స్థాయిలో గ్రామీణ పరిపాలను సమూలంగా మార్చేసిన కొత్తతరం నాయకుడు భానుప్రకాశ్ ఆ ఊరి మాజీ సర్పంచ్ ఈ గ్రామంలో 30 మంది యువతీయువకులు ఈయన నాయకత్వంలో భారత్ నిర్మాణ్ వాలంటీర్లుగా గ్రామాభివృద్ధికి కృషిచేస్తున్నారు.
1999 రామచంద్రాపూర్ గ్రామంలో సరైన రవాణా సౌకర్యాలు లేవు. కరీంనగర్‌కి వెళ్లే ప్రధాన రహదారికి చేరుకోవాలంటే పది కిలోమీటర్లు నడిచిపోవాల్సిందే! మధ్యలో రామాలయం దగ్గరున్న పెద్ద వాగును కూడా దాటి పోవాలి. ప్రైమరీ పాఠశాల తప్ప చిన్నారులకు వేరే విద్యావకాశాలు లేవు. అలాంటి సమయంలో వకుళాభరణం భానుప్రకాష్ రామచంద్రాపూర్‌లో సుప్రజ సేవా సమితిని ఏర్పాటు చేశారు.
గ్రామంలోని ప్రైమరీ స్కూల్‌ని ఉన్నత పాఠశాలగా మార్పించి పదోతరగతి వరకు తమ గ్రామంలోనే చదువుకునే అవకాశం కల్పించారు. ‘అక్షర యజ్ఞం’ పేరుతో రాత్రి పాఠశాలలు ఏర్పాటుచేసి 18 ఏళ్లలోపు వారికి ప్రత్యేక క్లాసులు నిర్వహించి, డ్రాప్ అవుట్స్‌ని స్కూల్‌కి పంపే ఏర్పాట్లు చేశారు. స్కూల్‌కి టీచర్ల కొరత ఉన్నప్పుడు గ్రామస్థుల భాగస్వామ్యంతో ప్రైవేట్ టీచర్లను నియమించి విద్యార్థుల చదువుకు ఆటంకం లేకుండా చూశారు. ఫలితంగా రామచంద్రాపూర్ పాఠశాలలో పదోతరగతిలో 100శాతం ఉత్తీర్ణత సాధించారు. ఇదే పాఠశాలలో చదివిన 50 మంది నేడు బిటెక్, బిఇడి, ఎంసిఎ, ఎంబిఎ చదివేస్థాయికి ఎదిగి రెడ్డీల్యాబ్స్ లాంటి సంస్థల్లో ఉద్యోగాలు చేస్తున్నారు.
విద్యార్థులకు సాంకేతికపరిజ్ఞానం
ramchandrapuram2భారత్ నిర్మాణ్ వాలంటీర్లు పర్యవేక్షణలో మధ్యాహ్న భోజన పథకం సక్రమంగా అమలయ్యేలా చూస్తున్నారు. స్కూల్ ప్రారంభానికి ముందు తరువాత విద్యార్థులకు ప్రత్యేక క్లాసులు నిర్వహించి చదువులో వెనుకబడకుండా చూస్తున్నారు. ప్రముఖ సాఫ్ట్‌వేర్ కంపెనీ ఇంటెల్ సంస్థ గ్రామీణ అభివృద్ధి కోసం అపార్ట్ చేస్తున్న కృషిని అభినందిస్తూ భారత్ నిర్మాణ్ వాలంటీర్ల కోసం ల్యాప్‌ట్యాప్‌లు ఉచితంగా అందజేశారు. దానిలో భాగంగా రామచంద్రాపూర్ గ్రామానికి కూడా ఒక ల్యాప్‌ట్యాప్ అందింది. దీని ద్వారా భారత్ నిర్మాణ్ వాలంటీర్లు విద్యార్థులకు లెక్కలు, ఇంగ్లీష్ సులభంగా బోధించే ప్రయత్నం చేస్తున్నారు. ప్రత్యేకంగా రూపొందించిన సాఫ్ట్‌వేర్ ద్వారా ఆ సిలబస్‌ని విద్యార్థులకు అందిస్తున్నారు.
ఆరోగ్యం
భారత్ నిర్మాణ్ వాలంటీర్ల సహాయంతో వివిధ సంస్థలు ఇక్కడ ఆరోగ్య శిబిరాలు ఏర్పాటుచేస్తూ, గ్రామీణుల్లో ఆరోగ్య చైతన్యాన్ని కలిగించారు.
నేత్రదానంలో ప్రథమం
సంపూర్ణ నేత్రదానం గ్రామంగా దేశంలోనే మొదటిస్థానం పొందింది.
మహిళల ఆరోగ్యంపై అవగాహన కలిగించే కార్యక్రమాలు నిర్వహించి వందశాతం ఆసుపత్రిల్లోనే ప్రసవం జరిగేలా గర్భిణీ స్త్రీలను మోటివేట్ చేయడంలో బిఎన్‌విలు విజయం సాధించారు. అంగన్‌వాడీ కార్యకర్తలతో కలిసి, ప్రతీ సంవత్సరం సామూహిక శ్రీమంతాలు చేస్తున్నారు.
ఆశావర్కర్స్, అంగన్‌వాడీల సమన్వయంతో భారత్ నిర్మాణ్ వాలంటీర్లు మహిళలు ఆరోగ్యం పట్ల తీసుకోవాల్సిన జాగ్రత్తలపై అవగాహన కార్యక్రమాలు, స్కూల్‌లో విద్యార్థుల కోసం హెల్త్‌క్యాంప్‌లు నిర్వహిస్తున్నారు.
మద్యం షాపు తొలగింపు
మద్యపానం మాన్పించడానికి చైతన్య సదస్సు నిర్వహించి తాగుడువల్ల కలిగే అనారోగ్య, సామాజిక సమస్యలను గ్రామీణులకు వివరిస్తున్నారు. స్ఫూర్తిపొందిన ప్రజలంతా ఏకమై రామచంద్రాపూర్‌లో మద్యం షాపును తొలగించారు.
రామచంద్రాపూర్ ప్రజల దాహం తీర్చే ఏకైక వనరు మోయతుమ్మెద వాగు మాత్రమే! గ్రామస్థులంతా కలిసి వాగులో బోర్లు, ఓపెన్ వెల్స్ వేసి పైప్‌ల ద్వారా గ్రామంలోని ఇంటింటికీ నీళ్లను అందిస్తున్నారు. వాగులోని ఇసుక పొరల్లో సహజంగానే ఫిల్టర్ అయిన నీళ్లు గ్రామస్థులకు అందుతున్నాయి. దీనికి తోడు ప్రజల భాగస్వామ్యంతో , పంచాయతీ సహకారంతో 2010లో రెండున్నర లక్షల వ్యయంతో మినరల్ వాటర్ ప్లాంట్‌ని కూడా ఏర్పాటు చేసుకున్నారు. 3 రూపాయలకే ఇరవై లీటర్ల మంచి నీళ్లు గ్రామస్థులందరికీ అందుతున్నాయి.
వంట గ్యాసు ఉన్నప్పటికీ ప్రతీఇంట్లో పొగరాని పొయ్యిలను స్వచ్ఛంద సంస్థల సాయంతో ఏర్పాటు చేశారు. నెడ్‌కాప్ సాయంతో కొన్ని కుటుంబాలు బయోగ్యాస్, గోబర్‌గ్యాస్ ప్లాంట్‌లు ఏర్పాటు చేసుకున్నారు.
వందశాతం మరుగుదొడ్లు
ramchandrapuram3ఈ గ్రామానికి డ్రైనేజీ సిస్టం లేకపోయినప్పటికీ ప్రతి ఇంట్లో మొక్కలను పెంచుతూ వాడిన నీటిని మొక్కలకు పారేలా చేస్తున్నారు. ఇంకుడు గుంతలు తవ్వి వాన నీటిని పొదుపు చేస్తున్నారు. ప్రతీ వీధి చివర చెత్తబుట్టలను ఏర్పాటు చేశారు. ఎక్కువ చెత్తను కంపోస్టు ఎరువుగా తయారు చేయ డం ద్వారా దానిని కూడా సద్వినియోగం చేస్తున్నారీ గ్రామస్థులు. ప్రతీ ఇంటికీ వ్యక్తిగత మరుగుదొడ్డిని ఏర్పాటు చేసుకోవడంలో గ్రామస్థులకు బిఎన్‌విలు సహకరించారు. ఫలితంగా వందశాతం మరుగుదొడ్లు ఉన్న గ్రామంగా గుర్తింపు పొంది నిర్మలగ్రామ పురస్కారం పొందింది.
పూరిళ్లు లేని గ్రామం
రామచంద్రాపూర్ గ్రామ జనాభా 2,100 తెలంగాణలో పూరిళ్లు లేని గ్రామాలంటూ ఉంటే ఈ గ్రామం ముందు వరసలో ఉంటుంది. ఇందిర మ్మ ఇళ్ళ పథకం సంపూర్ణంగా విజయవంతం అయింది ఒక్కడే! 69 శాతం బిసిలు, 30 శాతం ఎస్‌సిలు, ఒక్క శాతం ఒసిలున్న ఈ గ్రామంలో అందరూ వ్యవసాయం మీదే ఆధారపడి బతుకుతున్నారు. విభిన్న సామాజిక వర్గాలున్నప్పటికీ గ్రామాభివృద్ధి కోసం అందరూ ఐక్యంగా పని చేయడం విశేషం. ఈ గ్రామం ముఖద్వారంలోనే కాకతీయుల కాలం నాటి రామాలయం ఉంది. 2001 వరకు ఈ దేవాలయంలోకి దళితులకు ప్రవేశం లేదు. భానుప్రకాష్ చొరవతో దేవాలయంలోకి ప్రవేశం కల్పించారు. గ్రామస్థుల సహకారంతో 33/11 కె.వి.సబ్‌స్టేషన్ ఏర్పాటు చేసుకున్నారు. దీని కోసం రైతులంతా కలిసి ఎకరం భూమి నిచ్చారు.
అందరి చూపు రాంచంద్రపూర్ వైపు…
తమ గ్రామాన్ని అభివృద్దిపరచుకోవడమేకాక తమ చుట్టూ ఉన్న గ్రామాల్లో కూడా చైతన్యం పెంచేలా రామచంద్రాపూర్ బిఎన్‌వి (భారత్ నిర్మాణ్ వాలంటీర్లు) లు కృషి చేస్తున్నారు.
ఆదిలాబాద్, కరీంనగర్ జిల్లాల్లోని 16 గ్రామాల్లో భారత వాలంటీర్లకు శిక్షణ నిచ్చే కార్యక్రమాలు నిర్వహించారు. ప్రభుత్వ సంక్షేమపథకాలకు లబ్ధిదారులను గుర్తించి వారికి అభివృద్ది ఫలాలు అందేలా కృషి చేయడానికి అక్కడి యువతను తీర్చిదిద్దే ప్రయత్నం చేశారు.
గ్రామ విధానమండలి :
దేశంలో ఎక్కడాలేని కొత్త విధానం భానుప్రకాష్ ఏర్పాటు చేశారు. అదే గ్రామ విధనమండలి, దీన్లో రాజకీయాలకతీతంగా గ్రామాభివృద్ధిపట్ల ఆసక్తివున్న 15 మంది సభ్యులు ఉంటారు. వీరికింద వివిధ కమిటీలు అభివృద్ది పనులను సమీక్షిస్తాయి.
వీరికి సహాయకులుగా బిఎన్‌విలు వ్యవహరిస్తారు. రామచంద్రాపూర్ గ్రామాభివృద్ధిలో గ్రామ విధన మండలి కూడా విశేష కృషి చేసింది. పాలకులు స్మార్ట్ సిటీలంటూ సింగపూర్ వైపు చూస్తుంటే, ఈ తెలంగాణ పల్లె సాధించిన ప్రగతిని చూడడానికి ఇతర రాష్ట్రాల ఐఎఎస్‌లు ఇక్కడికి వచ్చి ఈ స్మార్ట్ విలేజ్‌లో పాఠాలు నేర్చుకుంటున్నారు.
ఎన్‌ఐఆర్‌డి డైరెక్టర్ జనరల్ ఎంవీ రావు కూడా ఈ గ్రామం సందర్శించి వీరు చేస్తున్న కృషిని గుర్తించి ఇక్కడి ప్రభుత్వ పాఠశాల విద్యార్థుల కోసం కంప్యూటర్‌ని బహూకరించారు. ఇక్కడ ప్రతీ గడప అభివృద్ధికి నమూనాగా కనిపిస్తుంది.

– శ్యాంమోహన్ (9440595858)