Thursday, April 25, 2024

భారత్‌కు ‘సవాల్’

- Advertisement -
- Advertisement -

T20 match between India and New Zealand

ఆత్మవిశ్వాసంతో కివీస్, నేడు తొలి టి20

జైపూర్: సుదీర్ఘ విరామం తర్వాత సొంత గడ్డపై టీమిండియా ఒక సిరీస్‌కు సిద్ధమైంది. భారత్‌-న్యూజిలాండ్ జట్ల మధ్య జరుగనున్న మూడు మ్యాచ్‌ల ట్వంటీ20 సిరీస్‌కు బుధవారం తెరలేవనుంది. జైపూర్ వేదికగా ఈ మ్యాచ్ జరుగనుంది. రెండు జట్లు కూడా కొత్త కెప్టెన్ల సారథ్యంలో బరిలోకి దిగుతున్నాయి. విరాట్ కోహ్లి టి20 కెప్టెన్సీ బాధ్యతల నుంచి తప్పుకోవడంతో రోహిత్ శర్మ జట్టు పగ్గాలు అప్పగించారు. ఇక న్యూజిలాండ్ కూడా టిమ్ సౌథి సారథ్యంలో సిరీస్‌కు సిద్ధమైంది. ఎడతెరిపి లేని క్రికెట్‌ను ఆడుతున్న రెగ్యూలర్ కెప్టెన్ కేన్ విలియమ్సన్ టి20 సిరీస్‌కు దూరమయ్యాడు. అతని స్థానంలో టిమ్ సౌథి కెప్టెన్సీ చేపట్టనున్నాడు. గతంలో కూడా సౌథి కివీస్ టి20 జట్టుకు కెప్టెన్‌గా ఉన్నాడు. ఇక రోహిత్ శర్మ కూడా పలు సిరీస్‌లలో టీమిండియాకు కెప్టెన్‌గా వ్యవహరించాడు. ఇక క్రికెట్ దిగ్గజం రాహుల్ ద్రవిడ్ టీమిండియా ప్రధాన కోచ్‌గా ఈ సిరీస్‌తోనే బాధ్యతలు చేపట్టనున్నాడు. దీంతో అందరి దృష్టి రాహుల్, రోహిత్‌లపైనే నిలిచింది.

ప్రతీకారం తీర్చుకుంటుందా?

ఇక ప్రపంచకప్‌లో భాగంగా జరిగిన సూపర్12 మ్యాచ్‌లో న్యూజిలాండ్ చేతిలో భారత్ ఘోర పరాజయం చవిచూసింది. ఈ ఓటమితో భారత్ సెమీఫైనల్‌కు చేరకుండానే టోర్నమెంట్ నుంచి వైదొలగాల్సి వచ్చింది. ఇక వరల్డ్‌కప్‌లో కివీస్ చేతిలో ఎదురైన పరాజయానికి బదులు తీర్చుకోవాలనే లక్షంతో టీమిండియాకు సమరానికి సిద్ధమైంది. సొంత గడ్డపై సిరీస్ జరుగుతుండడం భారత్‌కు అతి పెద్ద ఊరటగా చెప్పొచ్చు. తొలి మ్యాచ్‌లోనే గెలిచి ప్రత్యర్థి జట్టును ఆత్మరక్షణలో పడేయాలనే పట్టుదలతో భారత్ ఉంది. బ్యాటింగ్, బౌలింగ్ విభాగాల్లో ఇరు జట్లు కూడా సమతూకంగా కనిపిస్తున్నాయి. ఇక వరల్డ్‌కప్‌లో కివీస్ ఫైనల్లో ఓటమి పాలు కావడంతో ఆ షాక్ నుంచి ఇంకా బయటపడలేక పోతోంది. ఈ సిరీస్ కివీస్‌కు సవాల్ వంటిదేనని విశ్లేషకులు అంటున్నారు. భారత్‌ను ఓడించాలంటే కివీస్ అసాధారణ ఆటను కనబరచక తప్పదు.

ఓపెనర్లే కీలకం..

ఇక ఈ మ్యాచ్‌లో టీమిండియాకు ఓపెనర్లు రోహిత్ శర్మ, లోకేశ్ రాహుల్‌లు కీలకంగా మారారు. వీరిద్దరే ఓపెనర్లుగా దిగే అవకాశాలున్నాయి. వరల్డ్‌కప్‌లో ఇద్దరు కూడా బాగానే ఆడారు. దీంతో ఈసారి కూడా వీరిపై జట్టు భారీ ఆశలు పెట్టుకుంది. ఒంటిచేత్తో మ్యాచ్ ఫలితాన్ని తారుమారు చేసే సత్తా వీరికుంది. ఇద్దరిలో ఏ ఒక్కరూ నిలదొక్కుకున్నా జట్టుకు భారీ స్కోరు కష్టమేమీ కాదు. ఇక విరాట్ కోహ్లి లేక పోవడం టీమిండియాకు కాస్త ఎదురుదెబ్బగానే చెప్పొచ్చు. కోహ్లి ఉంటే బ్యాటింగ్ ఇంకా బలంగా ఉండేది. అయితే యువ ఆటగాళ్లు సూర్యకుమార్ యాదవ్, శ్రేయస్ అ్యర్, ఇషాన్ కిషన్, రిషబ్ పంత్, వెంకటేశ్ అయ్యర్, రుతురాజ్ గైక్వాడ్ తదితరులతో టీమిండియా బ్యాటింగ్ చాలా బలంగా ఉంది.

ఈ సిరీస్‌లో కొత్త ఆటగాళ్లకు అవకాశం ఇస్తారా లేదా అనేది ఇంకా తేలలేదు. రిషబ్‌కు విశ్రాంతి ఇవ్వాలని భావిస్తే ఇషాన్ కిషన్ తుది జట్టులోకి వస్తాడు. ఇక ఆల్‌రౌండర్ వెంకటేశ్‌కు తొలి మ్యాచ్‌లో ఛాన్స్ ఖాయంగా కనిపిస్తోంది. ఇక సీనియర్లు రవిచంద్రన్, భువనేశ్వర్‌లకు విశ్రాంతి ఇచ్చినా ఆశ్చర్యం లేదు. సిరాజ్, దీపక్ చాహర్, హర్షల్ పటేల్, యజువేంద్ర చాహల్, అవేశ్ ఖాన్, తదితరులతో బౌలింగ్ విభాగం చాలా బలంగా ఉంది. అంతేగాక అక్షర్ పటేల్, వెంకటేశ్‌ల రూపంలో మ్యాచ్ విన్నర్ ఆల్‌రౌండర్లు ఉండనే ఉన్నారు. ఇలా ంటి స్థితిలో సిరీస్‌లో టీమిండియా ఫేవరెట్‌గా కనిపిస్తోంది.

తక్కువ అంచనా వేయలేం..

మరోవైపు న్యూజిలాండ్‌ను కూడా తక్కువ అంచనా వేయలేం. సంచలన విజయాలకు మరో పేరుగా కివీస్‌ను పేర్కొనవచ్చు. అయితే వరల్డ్‌కప్ ఫైనల్లో ఆస్ట్రేలియా చేతిలో ఓటమి పాలు కావడంతో న్యూజిలాండ్ ఆత్మవిశ్వాసం సన్నగిల్లింది. అయినా ఆ షాక్ నుంచి బయటపడి మళ్లీ విజయాల బాట పట్టే సత్తా కివీస్‌కు ఉంది. బ్యాటింగ్, బౌలింగ్ విభాగాల్లో కివీస్ సమతూకంగా ఉంది. అయితే నిలకడలేమి జట్టుకు ప్రధాన సమస్యగా మారింది. అంతేగాక ఫైనల్లో అద్భుతంగా రాణించిన కేన్ విలియమ్సన్ సిరీస్‌కు అందుబాటులో లేకుండా పోయాడు. ఇది కూడా కివీస్‌కు కాస్త ఇబ్బంది కలిగించే అంశమే. అయితే మార్టిన్ గుప్టిల్, డారిల్ మిచెల్, టిమ్ సిఫర్ట్, నీషమ్, గ్లెన్ ఫిలిప్స్ తదితరులతో కివీస్ బ్యాటింగ్ బలంగానే ఉంది. అంతేగాక ట్రెంట్ బౌల్ట్, టిమ్ సౌథి, ఆడమ్ మిల్నె, జేమిసన్, ఫెర్గూసన్, సాంట్నర్ తదితరులతో బౌలింగ్ విభాగం కూడా పటిష్టంగా మారింది. ఇరు జట్లలోనూ ప్రతిభావంతులైన క్రికెటర్లకు కొదవలేదు. దీంతో సిరీస్ ఆసక్తికరంగా సాగడం ఖాయమనే చెప్పాలి.

జట్ల వివరాలు:

భారత్: రోహిత్ శర్మ (కెప్టెన్), కెఎల్.రాహుల్ (వైస్ కెప్టెన్), శ్రేయస్ అయ్యర్, సూర్యకుమార్ యాదవ్, రిషబ్ పంత్, అక్షర్ పటేల్, రవిచంద్రన్ అశ్విన్, దీపక్ చాహర్, భువనేశ్వర్ కుమార్, హర్షల్ పటేల్, అవేశ్ ఖాన్, యజువేంద్ర చాహల్, మహ్మద్ సిరాజ్, ఇషాన్ కిషన్, వెంకటేశ్ అయ్యర్, రుతురాజ్ గైక్వాడ్.

న్యూజిలాండ్: మార్టిక్ గుప్టిల్, డారిల్ మిచెల్, గ్లెన్ ఫిలిప్స్, మార్జ్ చాంప్‌మన్, జేమ్స్ నీషమ్, టిమ్ సిఫర్ట్, మిచెల్ సాంట్నర్, టిమ్ సౌథి (కెప్టెన్), ఫెర్గూసన్, జేమిసన్, ట్రెంట్ బౌల్ట్, ఐష్ సోధి, ఆడమ్ మిల్నె, టాడ్ ఆస్ట్‌లే.

 

 

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News