Home భద్రాద్రి కొత్తగూడెం అవినీతికి అడ్డాగా… తహసీల్దార్ కార్యాలయం

అవినీతికి అడ్డాగా… తహసీల్దార్ కార్యాలయం

Tahisildar's office to become corrupt,

ఏ పని కావాలన్నా డబ్బులు ముట్టాల్సిందే
కాసులు పడితేనే కాగితంపై కలం గీత పడుతుంది
సీతారామ ప్రాజెక్టులో న్యాయం జరిగిందెవరికీ
అక్రమ ఇసుక రవాణాకు రెవెన్యూ అండ
అంతా బాహాటంగానే చర్చించుకుంటున్న మండల ప్రజలు

మన తెలంగాణ/అశ్వాపురం : అశ్వాపురం మండల కార్యాలయం అవినీతికి కేరాఫ్ అడ్రస్‌గా మారిందని మండల ప్రజలు బాహాటంగానే చెప్పుకుంటున్నారు. ఏపని కావాలన్నా అటెండర్ నుంచి అధికారి వరకు డబ్బులు ముట్టజెప్పాల్సిందే, ఇందులో కూడా పనిని బట్టి రేటు ఉంటుంది. పైసలు ఇస్తేనే ఫైళ్లు కదులుతాయి. కాసులు చేతిలో పడితేనే కాగితంపై కలం గీత పడుతుంది. కులం నుంచి భూముల రికార్డుల వరకు ధ్రువీకరణ పత్రాలు కావాలంటే రూ.100 నుంచి రూ.10వేల వరకు లంచం ఇవ్వాల్సిందే. రెవెన్యూ రికార్డుల్లో తప్పులు సృష్టించేసేందుకు, సరి చేసేందుకు కాసులు కాజేసేది వీరే. ఇక్కడ పని చేసే అధికారులు ఖాళీ జేబులతో ఆఫీసుకు వచ్చి రోజు కనీసం రూ.2వేలు వేసుకుని ఇంటికి వెళ్లారంటే అతిశయోక్తికాదు. రాజు దగ్గర పని చేసే భటులే రోజుకూ అక్రమంగా ఇంత సంపాదిస్తే మరి రాజు ఎంత సంపాదిస్తాడో ఇట్టే అర్థమవుతుంది. అంతేకాకుండా సీతారామప్రాజెక్టు కాలువ నిర్మాణంలో భూములు పోని రైతుల తప్పుడు ధృవీకరణ పత్రాలు సృష్టించి వారి పేరు మీద వచ్చిన లక్షల రూపాయలను కూడా తహసీల్దార్ కార్యాలయం కాజేసినట్లు మండల ప్రజలు ఒకరికొకరు చర్చించుకుంటున్నారు.

డబ్బులు ముందు పని తర్వాత
రైతుల దగ్గర ముందు డబ్బులు తీసుకున్న కారణంగా అధికారుల్లో ఒకరికి ఒకరు పొసకకనే రైతుల పనులు పెండింగ్‌లో ఉంటున్నాయి. డబ్బులు ఇచ్చిన రైతులకు పాస్ బుక్కులు లేవని, వెబ్‌ల్యాండ్ పని చేయడం లేదని లేదా పని పూర్తి అయ్యింది.. కొన్ని రోజులు ఆగమని తమదైన శైలిలలో నచ్చజెపుతారు. ఓ అధికారి అయితే కార్యాలయానికి పనుల కోసం వచ్చేవారిని వరుస కలుపుకుని సంబోధిస్తూ డబ్బులు వసూలు చేస్తాడని స్థానికులు చెబుతున్నారు. పనులు కాక విసుగు చెందిన రైతులు గొడవ చేస్తే డబ్బులు తిరిగి ఇవ్వకుండా అప్పుపత్రం రాసి ఇస్తున్నట్లు తెలుస్తుంది. మండలంలో ఇసుక అక్రమ రవాణా యథేచ్ఛగా సాగుతుంది. ఇందుకు గాను ఇసుక వ్యాపారులు రెవెన్యూ కార్యాలయానికి నెలవారీ ముడుపులు అందిస్తున్నారన్న ఆరోపణలు ఉన్నాయి. ఇసుక రవాణాలో కొందరు మండల స్థాయి అధికారులు, అధికారి పార్టీ నేతల ప్రమేయం కూడా ఉందన్న అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. ఇసుక అక్రమ రవాణాను ఆయా గ్రామాల స్థానికులు అడ్డుకుంటున్నా రెవెన్యూ అధికారుల నుండి కనీస స్పందన లేకపోవటంతో ముడుపుల బాగోతంపై వస్తున్న విమర్శలకు బలాన్నిస్తున్నాయి. కొందరు అధికారుల అవినీతి దాహానికి ప్రభుత్వ ఖజానాకు భారీగా గండి పడుతుంది. సందట్లో సడేమియా అన్నట్లు కొందరు ప్రైవేటు వ్యక్తులు సైతం ఇసుక వ్యాపారులను బెదిరింపులకు పాల్పడుతూ వారి నుంచి అక్రమ వసూళ్లకు పాల్పడుతున్నారన్న ఆరోపణలు బహిరంగంగానే వినిపిస్తున్నాయి. ఇసుక అక్రమ వ్యాపారంలో రెవెన్యూ అధికారుల నిర్లక్ష వైఖరిపై మండల ప్రజలు మండిపడుతున్నారు. తప్పుడు ఇసుక ర్యాంపులను సృష్టించి మరీ అక్రమ ఇసుక తోలకాలకు పాల్పడుతున్నారంటే పరిస్థితి ఎంత వరకు వెళ్లిందో ఇట్టే అర్థమవుతుంది. అక్రమ ఇసుక వ్యాపారంతో రోజూవారీగా ప్రభుత్వ ఆదాయానికి సుమారు రూ.50వేలు గండి పడుతున్నట్లు అంచనా.
జీతం పెంచినా లంచం కోసం డిమాండ్
అధికారులు ప్రజలకు జవాబుదారీగా ఉండాలని, లంచం ఆశించకుండా ఉండాలంటే వారికి సరిపోయే విధంగా వేతనాలు ఉండాలని భావించిన ముఖ్యమంత్రి కెసిఆర్ ఉద్యోగుల వేతనాలు భారీగా పెంచారు. అయినా అవినీతి మరింత పెరిగిందనే విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. తహసీల్ కార్యాలయంలో ఉద్యోగులకు జీతం కన్నా లంచంపైనే మక్కువ ఎక్కువ. కార్యాలయంలో పని చేసే వారికే ఇంత మక్కువ ఉంటే ఇంక కార్యాలయమే తనది అనే వారికి ఎంత ఆశ ఉంటుందో ఇట్టే అర్థమవుతుంది.