Home తాజా వార్తలు సినీ ప్రముఖులతో మంత్రి తలసాని సమావేశం

సినీ ప్రముఖులతో మంత్రి తలసాని సమావేశం

Tollywood Meeting

 

సినిమా, టివి షూటింగ్‌లకు త్వరలోనే నిబంధనలతో కూడిన అనుమతుల మంజూరుకు తగిన చర్యలు తీసుకుంటామని రాష్ట్ర సినిమాటోగ్రఫీ శాఖ మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ వెల్లడించారు.

గురువారం హైదరాబాద్‌లోని ఎంసిహెచ్‌ఆర్‌డిలో సినిమా, టివి షూటింగ్‌లకు అనుమతులు, థియేటర్‌ల ఓపెనింగ్ తదితర అంశాలపై సినీ, టీవీ రంగాలకు చెందిన వివిధ అసోసియేషన్‌ల ప్రతినిధులతో మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్, హోం శాఖ ప్రిన్సిపల్ సెక్రటరీ రవిగుప్తా, ఫిలిం డెవలప్‌మెంట్ కార్పోరేషన్ ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ కిషోర్ బాబులు కలిసి సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా అసోసియేషన్ ప్రతినిధులు షూటింగ్ ప్రదేశాలలో, థియేటర్‌లలో ఏమేమి జాగ్రత్తలు తీసుకోవాలో తెలియజేస్తూ మంత్రికి వినతిపత్రాన్ని అందజేశారు. అలాగే ఇతర ప్రాంతాలు, రాష్ట్రాల నుండి వచ్చే ఆర్టిస్టులకు ప్రయాణంలో ఎదురయ్యే ఇబ్బందులను దృష్టిలో ఉంచుకొని ప్రత్యేక పాసులు మంజూరు చేయాలని కోరారు.

రాత్రి వేళల్లో కర్ఫ్యూ అమలు చేస్తున్న కారణంగా షూటింగ్ ముగిసిన అనంతరం రాత్రి సమయాలలో ఆర్టిస్టులు, సిబ్బంది తమ గమ్య స్థానాలకు చేరుకునేందుకు ఇబ్బందులు ఎదురయ్యే అవకాశం ఉందని పేర్కొనగా… పోలీసు శాఖకు దరఖాస్తు చేస్తే ఈ పాస్‌లు మంజూరు చేయనున్నట్లు హోం శాఖ ప్రిన్సిపల్ సెక్రెటరీ రవిగుప్తా వివరించారు. ఈ సమావేశంలో సినీ రంగ ప్రతినిధులు ప్రస్తావించిన పలు అంశాలపై లోతుగా చర్చించారు. థియేటర్‌లను తెరిచిన అనంతరం ఎదురయ్యే సమస్యలు కూడా చర్చకు వచ్చాయి. షూటింగ్ ప్రాంతాలలో తీసుకోవాల్సిన వ్యక్తిగత జాగ్రత్తలు, ఏర్పాట్లపై కూడా చర్చించడం జరిగింది. ప్రభుత్వం సూచించే మార్గదర్శకాలను తూచ తప్పకుండా పాటిస్తామని సమావేశంలో పాల్గొన్న సినీ, టీవీ రంగ ప్రతినిధులు స్పష్టం చేశారు.

మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ మాట్లాడుతూ సినీ రంగానికి చెందిన ఏ విషయమైనా ప్రభుత్వం అన్ని రకాల సహాయ సహకారాలు అందిస్తుందని అన్నారు. అసోసియేషన్ ప్రతినిధులు అందజేసిన సూచనలు, వినతులను ముఖ్యమంత్రి దృష్టికి తీసుకెళ్ళి త్వరలోనే ఒక నిర్ణయం తీసుకోనున్నట్లు మంత్రి తెలిపారు. సమావేశంలో షూటింగ్‌లకు అనుమతులు, థియేటర్ ఓపెనింగ్ అంశాలే కాకుండా సినిమా థియేటర్‌లకు ప్రత్యేక విద్యుత్ టారీఫ్, ఫ్లెక్సి టికెటింగ్ ధరలు, ఆన్‌లైన్ టికెటింగ్ విధానం, కళాకారులకు పెన్షన్‌లు, తెల్లరేషన్ కార్డులు తదితర అంశాలపై చర్చ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ ఈ అంశాలను సినీ పరిశ్రమ అభివృద్ధికి ప్రభుత్వం రూపొందిస్తున్న బెస్ట్ పాలసీలో పొందుపరచడం జరుగుతుందని మంత్రి వివరించారు.

సమావేశంలో చర్చించిన అంశాలు, నిర్ణయాలపై నివేదిక రూపొందించి ముఖ్యమంత్రి ఆమోదం కొరకు పంపించడం జరుగుతుందని తలసాని శ్రీనివాస్ యాదవ్ పేర్కొన్నారు. ఈ సమావేశంలో సీనియర్ స్టార్ అక్కినేని నాగార్జున, దర్శకులు రాజమౌళి, ఎన్.శంకర్, త్రివిక్రమ్ శ్రీనివాస్, నిర్మాతలు సి.కళ్యాణ్, కె.ఎస్.రామారావు, డి.సురేష్ బాబు, ‘మా’ అధ్యక్షుడు నరేష్, దామోదర్ ప్రసాద్, సుప్రియ, టివి ఛానళ్ల ప్రతినిధులు బాపినీడు, జెమిని కిరణ్, ఎగ్జిబిటర్స్ ప్రతినిధులు విజయేందర్ రెడ్డి, సునీల్ నారంగ్, తెలంగాణ రాష్ట్ర ఫిలిం ఛాంబర్ ఆఫ్ కామర్స్ అధ్యక్షులు మురళి మోహన్, ఫిలిం డెవలప్ మెంట్ కార్పోరేషన్ మాజీ చైర్మన్ రాంమోహన్ రావు తదితరులు పాల్గొన్నారు.

ఎవరైతే చురుగ్గా ఉన్నారో వాళ్లనే పిలిచాం…
సినీ ప్రముఖులతో సమావేశం జరిగిన అనంతరం మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ విలేకరులతో మాట్లాడుతూ “లాక్‌డౌన్ తర్వాత షూటింగ్‌లు ఎలా ప్రారంభించాలన్న అంశంపై విధి విధానాలను తయారు చేశాం. షూటింగ్‌లు పునః ప్రారంభంపై చర్చలు జరిగాయి. 24 క్రాఫ్ట్‌లకు సంబంధించిన అంశాలను కూలంకషంగా మాట్లాడుకున్నాం. ఈ అంశాలన్నింటినీ ముఖ్యమంత్రి కెసిఆర్ దృష్టికి తీసుకెళ్తా. షూటింగ్‌లకు ఎప్పుడు అనుమతి ఇస్తామో తెలియజేస్తాం.

పోస్ట్ ప్రొడక్షన్ పనులకు ఇబ్బంది లేదు కాబట్టి ఇప్పటికే వాటికి అనుమతులు ఇచ్చాం. ఇప్పుడప్పుడే థియేటర్లు తెరిస్తే కొన్ని సమస్యలు వస్తాయి. థియేటర్లు తెరవాల్సిన సమయం వచ్చినప్పుడు వాటిపై చర్చిస్తాం. ఇక సినీ ప్రముఖలతో జరిగిన సమావేశాలకు ఎవరైతే చురుగ్గా ఉన్నారో వాళ్లనే పిలిచాం. ఇది దర్శకులు, నిర్మాతలు, ఎగ్జిబిటర్స్‌కు సంబంధించిన అంశం. అందుకే వాళ్లతో మాట్లాడాం. అందరినీ పిలిచి సమావేశం పెట్టాలని ఎవరైనా అంటే నాకు ఎలాంటి అభ్యంతరం లేదు. ఆ సమావేశానికి కూడా వచ్చి మాట్లాడతా”అని అన్నారు.

కళాకారుల పెన్షన్‌కు జాబితా సిద్ధం చేస్తాం…
‘మా’ అధ్యక్షుడు నరేష్ మాట్లాడుతూ “సిఎం కెసిఆర్, మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్‌కు మేమెంతో రుణపడి ఉన్నాం. కళాకారుల పెన్షన్‌కు కూడా జాబితా సిద్ధం చేసి పంపిస్తాం. అన్ని జాగ్రత్తలు తీసుకుంటూ త్వరలోనే షూటింగ్‌లు ప్రారంభిస్తాం. ఈ సమావేశంలో విధానపర నిర్ణయాలు తీసుకున్నారు. ఇవి ముఖ్యమంత్రి పరిశీలనకు వెళ్తాయి. ఆయన ఓకే చేసి అనుమతి ఇస్తే మిగిలిన జాగ్రత్తలు ఫిలిం ఛాంబర్, మూవీ ఆర్టిస్ట్ అసోసియేషన్, ఇతర సంస్థలు కలిసి తీసుకుంటాయి.

దేశమంతా ఒకేసారి థియేటర్లు తెరవమని కోరాం…
ప్రముఖ నిర్మాత డి.సురేష్‌బాబు మాట్లాడుతూ “చిత్ర పరిశ్రమపై కరోనా లాక్‌డౌన్ ప్రభావం ఎంతో ఉంది. ఇక అన్ని జాగ్రత్తలతోనే షూటింగ్స్ ప్రారంభమవుతాయి. కొన్ని నెలలు షూటింగ్స్ జరిగిన తర్వాత థియేటర్లు తెరుస్తారు. దేశమంతా ఒకేసారి థియేటర్లు తెరవమని కోరాం”అని అన్నారు. సీనియర్ స్టార్ నాగార్జున మాట్లాడుతూ “ప్రభుత్వం చాలా త్వరగా స్పందించింది. మాకు కావాల్సినవన్నీ చేశారు. వాళ్లు అనుమతులు ఇవ్వడం పెద్ద కష్టం కాదు. కానీ అంతా మా చేతుల్లోనే ఉంది. మేము క్రమశిక్షణతో, జాగ్రత్తగా సినిమా షూటింగ్స్ ఎలా మొదలు పెట్టాలి? అని ఆలోచించాలి. మాతోనే కాదు ఇండస్ట్రీలోని అన్ని వర్గాలతో మంత్రి చర్చిస్తున్నారు”అని పేర్కొన్నారు.

Talasani discussed cine welfare with Cine officials