Home తాజా వార్తలు రెవెన్యూ అధికారులు క్షేత్రస్థాయిలో పర్యటించి సమస్యలు తెలుసుకోవాలి

రెవెన్యూ అధికారులు క్షేత్రస్థాయిలో పర్యటించి సమస్యలు తెలుసుకోవాలి

Talasani held meeting with revenue, ghmc, housing officials

 

డబుల్ బెడ్ రూం ఇళ్లు, జెఎన్‌ఎన్‌యూఆర్‌ఎం కింద నిర్మించిన ఇళ్ల కేటాయింపుల్లో నిబంధనలను పాటించాలి

మనతెలంగాణ/హైదరాబాద్: రెవెన్యూ అధికారులు క్షేత్రస్థాయిలో పర్యటించి ప్రజల సమస్యలను తెలుసుకొని వాటి పరిష్కారానికి కృషి చేయాలని రాష్ట్ర పశుసంవర్ధక, మత్స్య, పాడి పరిశ్రమల అభివృద్ధి శాఖల మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ ఆదేశించారు. శనివారం రెవెన్యూ, జీహెచ్‌ఎంసి, హౌసింగ్ శాఖల అధికారులతో సమీక్ష నిర్వహించారు. ఈ సమావేశంలో కలెక్టర్ శర్మన్, బల్దియా కమిషనర్ లోకేష్ కుమార్, సికింద్రాబాద్, హైదరాబాద్ ఆర్డీఓ లు వసంత, వెంకటేశ్వర్లు, హౌసింగ్ ఎస్‌ఈ కిషన్, ఈఈ వెంకటదాసు రెడ్డి, పలువురు తహసీల్దార్‌లు పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ప్రజలు తమ సమస్యల పరిష్కారం కోసం కార్యాలయాలకు వచ్చినప్పుడు సమస్యలపై సత్వరమే స్పందించాలని ఆయన ఆదేశించారు. వారంలో రెండు రోజుల పాటు అదేవిధంగా ప్రభుత్వం నిర్మించిన డబుల్ బెడ్ రూం ఇళ్లు, జెఎన్‌ఎన్‌యూఆర్‌ఎం కింద నిర్మించిన ఇళ్ల కేటాయింపు విషయంలో ప్రభుత్వ నిబంధనలను ఖచ్చితంగా అమలు చేయాలని ఆయన స్పష్టం చేశారు.

10 రోజుల్లో అర్హులకు డబుల్ బెడ్ రూం ఇళ్లను కేటాయించాలి
ఇళ్ల కేటాయింపులోమధ్యవర్తుల ప్రమేయాన్ని సహించేది లేదన్నారు. హైదరాబాద్ రెవెన్యూ డివిజన్ పరిధిలోని 8 ప్రాంతాలు, సికింద్రాబాద్ రెవెన్యూ డివిజన్ పరిధిలోని 8 ప్రాంతాలలో జెఎన్‌ఎన్‌యూఆర్‌ఎం కింద 3,422 ఇళ్లను నిర్మించగా అందులో 2,158 ఇళ్లను లబ్ధిదారులకు కేటాయించడం జరిగిందన్నారు. ఇంకా 1264 ఇళ్ల కేటాయింపు పెండింగ్‌లో ఉందన్నారు. ఆర్డీఓ లేదా సీనియర్ అధికారుల పర్యవేక్షణలో తగిన విచారణ జరిపి నిబంధనల ప్రకారం అర్హులను గుర్తించి 10 రోజుల్లోగా మిగిలిన ఇళ్లను లబ్ధిదారులకు కేటాయించాలని ఆయన ఆదేశించారు. ప్రభుత్వం కోట్లాది రూపాయలు ఖర్చు చేసి పేద ప్రజల కోసం డబుల్ బెడ్ రూం ఇళ్లను నిర్మించిందని, వాటిని పూర్తిస్థాయిలో లబ్ధిదారులకు కేటాయించకపోవడం వలన తీవ్ర ఇబ్బందులకు గురవుతున్నారన్నారు. సంబంధిత తహసీల్దార్‌లు క్షేత్రస్థాయిలో తగిన విచారణ జరిపి 10 రోజుల్లో అర్హులకు డబుల్ బెడ్ రూం ఇళ్లను కేటాయించేలా చర్యలు తీసుకోవాలని ఆయన ఆదేశించారు.

ప్రభుత్వ స్థలాలపై సమగ్ర నివేదికను రూపొందించాలి
అదేవిధంగా ఎక్కడెక్కడ ప్రభుత్వ స్థలాలు ఉన్నాయో గుర్తించి వాటి సమగ్ర సమాచారంతో నివేదికను రూపొందించి నెల రోజుల్లో అందజేయాలని తహసీల్దార్‌లను మంత్రి శ్రీనివాస్‌యాదవ్ ఆదేశించారు. అదేవిధంగా సనత్ నగర్ నియోజకవర్గ పరిధి రాంగోపాల్ పేటలోని గైదన్ బాగ్‌లో సరైన సౌకర్యాలు లేక, ఇరుకు ఇళ్లలో నిరుపేదలు నివసిస్తున్నారని మంత్రి తెలిపారు. వారికి డబుల్ బెడ్ రూం ఇళ్లను నిర్మించేందుకు 4 రోజుల్లో సమగ్ర సర్వే నిర్వహించి ప్రణాళికలను సమర్పించాలని సికింద్రాబాద్ ఆర్డీఓ వసంత, తహసీల్దార్ బాలశంకర్‌లను ఆదేశించారు.

నాలాల వెంట నివసిస్తున్న వారికి అవగాహన..
జీహెచ్‌ఎంసి దేవాదాయ శాఖ, రెవెన్యూ స్థలాలకు సంబంధించి పలు కేసులు కోర్టుల్లో సంవత్సరాలుగా కొనసాగుతున్నాయని వాటిపై ప్రత్యేక దృష్టి సారించి త్వరితగతిన పరిష్కారం అయ్యే విధంగా చర్యలు తీసుకోవాలని అధికారులను మంత్రి ఆదేశించారు. సనత్ నగర్ నియోజకవర్గ పరిధిలోని అంబేద్కర్ నగర్, బండ మైసమ్మ నగర్ తదితర ప్రాంతాల్లో కోర్టు కేసుల కారణంగా డబుల్ బెడ్ రూం ఇళ్ల నిర్మాణం నిలిచిపోయిందని, వీలైనంత త్వరగా కేసులు పరిష్కరించి ఇళ్ల నిర్మాణ పనులు చేపట్టేలా చర్యలు తీసుకోవాలని అధికారులను మంత్రి శ్రీనివాస్ యాదవ్ ఆదేశించారు. నాలాల వెంట అక్రమంగా ఇళ్లను నిర్మించుకొని నివసిస్తున్నారని, ప్రభుత్వం ప్రత్యామ్నాయ స్థలాన్ని కేటాయించేందుకు సిద్ధంగా ఉందని మంత్రి వివరించారు. నాలాల వెంట నివసిస్తున్న వారికి ఈ విషయంపై అవగాహన కల్పించి ఖాళీ చేసే విధంగా చర్యలు తీసుకోవాలని అధికారులను ఆదేశించారు. ప్రభుత్వం అమలు చేస్తున్న వివిధ పథకాల గురించి, లబ్ధిదారుల ఎంపిక తదితర సమాచారం ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు ఇతర ప్రజాప్రతినిధులకు కచ్చితంగా తెలియజేయాలని అధికారులను ఆదేశించారు.

Talasani held meeting with revenue, ghmc, housing officials