Home తాజా వార్తలు ఆ పార్టీ నాయకులకే ఇష్టంలేదు

ఆ పార్టీ నాయకులకే ఇష్టంలేదు

Talasani Srinivas Yadav

మనతెలంగాణ/హైదరాబాద్: ప్రజాస్వామ్యం గాంధీభవన్‌లో పుట్టినట్లు కాంగ్రెస్‌ ఎంఎల్‌ఏ భట్టివిక్రమార్క వ్యవహరిస్తున్నారని రాష్ట్ర పశు సంవర్థక శాఖమంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ విమర్శించారు. ప్రజాస్వామ్యవిలువలను కాపాడలేని కాంగ్రెస్‌కు విలువలగురించి మాట్లాడే నైతిక హక్కు ఉందాని ఆయన ప్రశ్నించారు. సోమవారం టిఆర్‌ఎస్ శాసనసభపక్షం కార్యాలయంలో మంత్రి తలసాని మీడియాతో మాట్లాడుతూ కాళేశ్వరం ప్రాజెక్టు నిర్మాణం ఓ అద్భుతంగా చరిత్రలో మిగిలిపోతుందనే ఈర్షతో కాంగ్రెస్‌నాకుడు భట్టివిక్రమార్క అసత్యఆరోపణలు చేస్తున్నారని దుయ్యబట్టారు. ఒక ఇంజనీర్ మాదిరిగా వేలాదిగంటలు కాళేశ్వరం నిర్మాణం కోసం శ్రమించిన ముఖ్యమంత్రి కెసిఆర్‌ను విమర్శించే నైతికహక్కు భట్టివిక్రమార్కకు లేదన్నారు. ప్రాణహిత, చేవెళ్లప్రాజెక్టు నిర్మిస్తామని గొప్పలు చెప్పి కనీసం తట్టెడు మట్టినికూడా తీయని కాంగ్రెస్‌నాయకులు తెలంగాణ నీటి ప్రాజెక్టుల నిర్మాణంగురించి ఎందుకు మాట్లాడుతున్నారని ప్రశ్నించారు. సిఎల్‌పినాయకుడిగా భట్టిని ఎన్నికోవడం ఆపార్టీలోని నాయకులకు ఇష్టం లేకపోవడంతోనే కోమటి రెడ్డిలాంటి సీనియర్ నాయకులు పార్టీని వీడటానికి సిద్ధం అవుతున్నారనీ, కాంగ్రెస్ శాసన సభ్యులు టిఆర్‌ఎస్‌లో స్వచ్ఛందంగా కలుస్తున్నారని తలసాని చెప్పారు.

దీక్షకు కూర్చున్న భట్టి రాహుల్ గాంధీ చెప్పాడని దీక్ష విరమిస్తే, రాహుల్ గాంధీచెప్పలేదని ఆపార్టీనాయకులే ప్రకటించారని మంత్రి ఎద్దేవా చేశారు. 24 గంటలు విద్యుత్ సరఫరాచేస్తే టిఆర్‌ఎస్‌లో చేరుతామన్న జానారెడ్డి మాపార్టీలో చేరకుండానే ఓడిపోయారని విమర్శించారు. గురుకులా ఏర్పాటు గురించి కాంగ్రెస్ ఎప్పుడైనా ఆలోచించిందాని తలసాని ప్రశ్నించారు. తెలంగాణ ముఖ్యమంత్రి అన్నివర్గాల ప్రజలకు నాణ్యమైన ఉన్నత విద్యను అందించేందుకు నిరంతరం శ్రమిస్తున్నారని చెప్పారు. ముఖ్యమంత్రి కెసిఆర్ ఫెడరల్ ఫ్రంట్‌కోసం కేంద్రంప్రభుత్వం దిగిపోవాలని సిఎం కెసిఆర్ ఎప్పుడూచెప్పకున్నా బిజెపినాయకుడు లక్ష్మణ్ అసత్యప్రచారం చేస్తున్నారని నిందించారు. దేశంలోని కనీస నీటి వనరులను వాడుకునేందుకు ప్రాంతీయపార్టీలన్నీ ఏకంకావాలని సిఎం కెసిఆర్ పిలుపు ఇచ్చారని ఆయన ఈ సందర్భంగా గుర్తు చేశారు. పార్లమెంట్ ఎన్నికల అనంతరం ఎంపిటిసి,జెడ్‌పిటిసి ఎన్నికల్లో గులాబీ జెండామాది అని ప్రజలు తీర్పు ఇచ్చారని చెప్పారు. హైదరాబాద్ ఉగ్రవాదుల అడ్డాని కొత్తగా మంత్రిపదవిలోకి వచ్చిన కిషన్‌రెడ్డి అనడం సరికాదన్నారు. హైదరాబాద్ ప్రతిష్టతను తక్కువచేసి కిషన్‌రెడ్డి చేసిన వ్యాఖ్యానాలకు ప్రజలు సరైన సమయంలో సమాధానం చెపుతారన్నారు.

ఉమ్మడి రాష్టంలో తెలంగాణ అభివృద్ధిని నిర్లక్షంచేసి ఆంధ్రప్రాంత అభివృద్ధికోసం పనిచేసిన కాంగ్రెస్ నాయకులు తెలంగాణలో అభివృద్ధి జరుగుతుంటే జీర్ణించుకోలేకపోతున్నారని దుయ్యబట్టారు. మాపార్టీ నుంచి కొండా విశ్వేశ్వరరెడ్డి,భూపతిరెడ్డి, ఎంఎల్‌సి రాములును కాంగ్రెస్‌లో చేర్చుకున్న నాయకులకు ఇతరపార్టీలను విమర్శించే నైతిక హక్కులేదన్నారు. ఇతరరాష్ట్రాల ముఖ్యమంత్రులతో కలిసిమెలిసి ఉండాలనే ఆలోచనతో మహారాష్ట్ర, ఆంధ్రప్రదేశ్‌ముఖ్యమంత్రులను కాళేశ్వరం ప్రారంభోత్సవానికి ఆహ్వానిస్తున్నారని తెలిపారు. ప్రతిపక్షాల ఆలోచనావిధానాలు మారితే వారిని కూడా కాళేశ్వరం ప్రాజెక్టు ప్రారంభోత్సవానికి ఆహ్వానిస్తామన్నారు.

Talasani Srinivas Yadav Fires On Mallu Bhatti Vikramarka