Home తాజా వార్తలు మూడోసారి మంత్రి పదవి

మూడోసారి మంత్రి పదవి

Talasani Srinivas Yadav

 

ఏడుసార్లు పోటీ.. ఐదుసార్లు గెలుపు
32 ఏళ్ళ రాజకీయ జీవితం

నగరం నుంచి తలసానికి చోటు

మనతెలంగాణ/సిటీబ్యూరో: శ్రీనన్న అంటూ నగర ప్రజల్లో సుస్థిర స్థానాన్ని సంపాదించుకున్న తలసాని శ్రీనివాస్ యాదవ్ మూడవసారి రాష్ట్ర మంత్రిగా బాధ్యతలను చేపట్టారు. మధ్యతరగతి కుటుంబం నుంచి మంత్రిగా ఎదిగిన ఆయనకు రాష్ట్రంలో బిసి నాయకుడిగా పేరున్నది. తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావం అనంతరం జరిగిన రాష్ట్ర రెండవ మంత్రి మండ లిలో శ్రీనివాస్ యాదవ్‌ను పశుసంవర్థక శాఖను కేటాయించారు. తెలం గాణ రాష్ట్ర మొదటి క్యాబినెట్‌లోనూ ఆయన సినిమాటోగ్రఫీ, ఎనిమల్ హస్‌బండ్రీ శాఖకు మంత్రిగా ఉన్నారు. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోనూ శ్రీనివాస్ యాదవ్ కార్మిక శాఖకు మంత్రిగా  పనిచేశారు. ఇప్పటి వరకు 5 సార్లు ఎంఎల్‌ఎగా ఎన్నికయ్యారు. మూడు మార్లు సికింద్రాబాద్ నుంచి రెండుమార్లు సనత్‌నగర్ అసెంబ్లీ నియోజకవర్గం ఎంఎల్‌ఎగా విజ యం సాధించారు. అయితే, తెలంగాణలో రెండుమార్లు, ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌లో ఒక మారు మంత్రిగా బాధ్యతలను చేపట్టారు. మొత్తం ఏడు సార్లు అసెంబ్లీ ఎన్నికల్లో పోటీచేసిన ఆయన ఐదుమార్లు ఎంఎల్‌ఎగా ఎన్నికయ్య్రారు. రెండుమార్లు ఓటమిని చవిచూశారు.

ఆయన ఎదుగుదల
సికింద్రాబాద్ మోండా ప్రాంతానికి చెందిన సాధారణ మధ్యతరగతి కుటుంబమైన తలసాని వెంకటేశ్‌యాదవ్, లలితాభాయిలకు 6 అక్టోబర్ 1965లో శ్రీనివాస్‌యాదవ్ జన్మించారు. వెంకటేష్‌యాదవ్ మోండా మార్కెట్‌కు అధ్యక్షుడిగా పనిచేశాడు. తండ్రి నుంచి నాయకత్వ లక్షణాలను అలవరుచుకున్న ఆయన యుక్తవయస్సులోనే నాయకునిగా పేరుతెచ్చుకున్నాడు. 1986లో మోండా డివిజన్ నుంచి ఎంసిహెచ్‌కు కార్పోరేటర్‌గా పోటీచేశారు. అనంతరం 1994లో జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో సికింద్రాబాద్ నియోజకవర్గం నుంచి తన సమీప ప్రత్యర్థి మేరీ రవీంద్రనాథ్‌ను ఓడించి ఎంఎల్‌ఎగా మొదటిసారి గెలిపొందారు. 1999లోనూ గెలిచిన శ్రీనివాస్‌యాదవ్‌ను మొదటిసారిగా మంత్రి పదవి వరించింది. 2004లో జరిగిన ఎన్నికల్లో ఓడిపాయారు. అనంతరం జరిగిన 2008 ఉప ఎన్నికల్లో భారీ మెజారిటీ గెలుపొందారు. 2009లో జరిగిన ఎన్నికల్లో మరోమారు ఓటమిచెందారు. 1994,1999,2004,2008,2009 ఎన్నికల్లో సికింద్రాబాద్ నియోజక వర్గం నుంచి టిడిపి అభ్యర్థిగా వరుసగా పోటీచేశారు. 2014లో సనత్‌నగర్ నియోజకవర్గం నుంచి టిడిపి అభ్యర్థిగా విజయం సాధించారు

అనంతరం బంగారు తెలంగాణ నిర్మాణం కోసం తెలంగాణ రాష్ట్ర సమితిలో చేరి ముఖ్యమంత్రి కె. చంద్రశేఖర్‌రావు మంత్రిమండలిలో మంత్రిగా బాధ్యతలను చేపట్టారు. 2018లో జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో సనత్‌నగర్ నుంచి టిఆర్‌ఎస్ అభ్యర్థిగా ఎన్నికల్లో నిలిచి విజయం సాధించారు. ప్రస్తుతం ముఖ్యమంత్రి కెసిఆర్ మంత్రిమండలిలో పశుసంవర్థక శాఖ మంత్రిగా నియామకమయ్యారు.

32 ఏళ్ళుగా రాజకీయం
1986లో ఎంసిహెచ్‌కు జరిగిన ఎన్నికల్లో మొదటిసారిగా కార్పోరేటర్‌గా పోటీచేయడంతో రాజకీయాల్లోకి వచ్చారు. అనంతరం వరుసగా తెలుగుదేశం పార్టీలో ఉంటూ తనకంటూ ఓ ప్రత్యేక స్థానాన్ని నిలబెట్టుకున్నారు. యువత విభాగానికి అధ్యక్షుడిగా, హైదరాబాద్ నగర అధ్యక్షుడిగా, అధికార ప్రతినిధిగా విభిన్న భూమికలు పోషించిన తలసాని శ్రీనివాస్‌యాదవ్ బిసి వర్గానికి బలమైన నాయకుడిగా పేరును సంపాదించుకున్నాడు. ప్రస్తుతం టిఆర్‌ఎస్‌లో ముఖ్యమంత్రికి, పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కె. తారకరామారావుకు విధేయుడిగా పేరున్నది.

Talasani Srinivas Yadav is third time minister in charge