Friday, April 19, 2024

అఫ్ఘానిస్థాన్‌లో కొత్త అధ్యాయం

- Advertisement -
- Advertisement -

Taliban Attacks

భారతదేశం ఇప్పుడు కోవిద్ 19తో పోరాడుతోంది. కరోనా సంక్షోభంలో ఇతర విషయాల గురించి ఆలోచించే తీరిక కూడా దొరకడం లేదు. అంతర్జాతీయంగా చోటుచేసుకుంటున్న అనేక మార్పులపై మన దృష్టిపోవడంలేదు. కాని చాలా ముఖ్యమైన మార్పు లు చోటు చేసుకుంటున్నాయి. అమెరికా, తాలిబాన్ల మధ్య శాంతి ప్రక్రియ కీలకదశకు చేరుకుంది. మరోవైపు అఫ్ఘానిస్థాన్‌లో హింసాకాండ తగ్గడం లేదు. అఫ్ఘానిస్థాన్ ప్రభుత్వంపై, అంటే అమెరికా మద్దతు ఉన్న అఫ్ఘానిస్థాన్ ప్రభుత్వంపై తాలిబాన్ల దాడులు ఆగడం లేదు.

ఇటీవల అక్కడ కూడా కరోనా శరవేగంగా విస్తరిస్తోంది. ఒకవైపు కరోనా, మరోవైపు హింసాకాండల మధ్య ప్రజలు చిక్కుకుపోయారు. మన పొరుగున ఉన్న దేశంలో జరుగుతున్న ఈ పరిణామాల పట్ల కన్నేసి ఉంచవలసిన అవసరం ఎంతైనా ఉంది. అమెరికా తరఫున అఫ్ఘానిస్థాన్‌లో ప్రత్యేక రాయబారి కూడా అఫ్ఘానిస్థాన్ జాతీయుడే. జాల్మాయ్ ఖలీల్జాద్ ఆయన పేరు. ఖలీల్జాద్ భారతదేశానికి ఇటీవల ఒక విజ్ఞప్తి చేశాడు. అఫ్ఘానిస్థాన్‌లో ఇప్పుడు సంధి దశ నడుస్తోందని, ఈ నేపథ్యంలో భారతదేశం అఫ్ఘానిస్థాన్ పట్ల చురుకుగా వ్యవహరించాలని కోరాడు. కాబూల్ లో మే 12వ తేదీన ఒక ఆసుపత్రిపై భయంకరమైన దాడి జరిగింది.

ఈ దాడిని భారతదేశం తీవ్రంగా ఖండించింది. అత్యంత అమానుషమైన, అనాగరికమైన దాడిగా పేర్కొంది. భారత విదేశాంగా శాఖ ఈ దాడిని ఖండిస్తూ తల్లులు, పసిపిల్లలు, నర్సులు, అమాయక పౌరులపై జరిగిన ఈ దాడి మానవత్వంపై జరిగిన దాడిగా అభివర్ణించింది. అఫ్ఘానిస్థాన్‌లో ఏం జరుగుతున్నదో మనం అర్థం చేసుకుని తగిన విధంగా ప్రతిస్పందించవలసి ఉంది. అఫ్ఘానిస్థాన్‌లో ఇప్పుడు విభిన్న గ్రూపుల మధ్య సంఘర్షణ జరుగుతోంది. ముఖ్యంగా మెజారిటీ పష్తూన్లది. అఫ్ఘానిస్థాన్‌లో దక్షిణాది నుంచి మధ్య అఫ్ఘానిస్థాన్ వరకు పష్తూన్లు అత్యధికంగా ఉన్నారు.

ఈ పష్తూన్ జనాభాకు తాలిబాన్లు ప్రాతినిధ్యం వహిస్తున్నామని చెబుతారు. మిగిలిన ఉత్తర అఫ్ఘానిస్థాన్ ప్రాంతాల్లో మైనారిటీ తెగలున్నాయి. తాలిబాన్ ప్రభుత్వాన్ని అమెరికా పడగొట్టిన తర్వాతి నుంచి ఏర్పడిన వివిధ ప్రభుత్వాలు ఈ మైనారిటీ తెగలకే అధిక ప్రాముఖ్యం ఇస్తూ వచ్చాయనే ఆరోపణ కూడా ఉంది. అయితే, ఇప్పుడున్న అఫ్ఘానిస్థాన్ అధ్యక్షుడు గనీ, ఆయనకు ముందు పనిచేసిన అధ్యక్షుడు కర్జాయ్ ఇద్దరు కూడా పష్తూన్లే. ఈ ఇద్దరు నాయకులను అఫ్ఘాన్ ప్రజలు అమెరికా కీలుబొమ్మలుగా మాత్రమే చూస్తున్నారు.

వీరిద్దరు అమెరికా ఏం చెబితే అది చేసేవారనే ఆరోపణలున్నాయి. అంతేకాదు, అఫ్ఘానిస్థాన్ పాలనాయంత్రాంగంలో, అనేక ప్రభుత్వంసంస్థల్లో మైనారిటీ తెగలే ప్రాబల్యం వహించేలా మార్పు లు తెచ్చారనే ఆరోపణ చాలా బలంగాఉంది. ఈ ప్రభుత్వ సంస్థల్లో పష్తూన్లు చాలా తక్కువగా ఉన్నారని అంటున్నారు. మరో విషయమేమంటే, ఇండియా, పాకిస్తాన్ ల మధ్య జరుగుతున్న ప్రాక్సీ యుద్ధానికి కొనసాగింపు అఫ్ఘానిస్థాన్‌లో జరుగుతుందని కూడా కొందరి అభిప్రాయం. పాకిస్థాన్ గూఢచర్య సంస్థ ఇంటర్ సర్వీసెస్ ఇంటెలిజెన్స్‌కు అఫ్ఘానిస్థాన్‌లో చాలా బలమైన నెట్‌వర్క్ ఉంది.

చాలా బలమైన సంబంధాలున్నాయి. పాకిస్థాన్‌లో మిలిటరీ తాలిబాన్లకు మద్దతిచ్చిందన్నది బహిరంగ రహస్యం. అక్కడి అనేక ఉగ్రవాద ముఠాలకు పాకిస్థాన్ మిలిటరీ సహాయ సహకారాలు అందిస్తోంది. మరోవైపు భారతదేశం అఫ్ఘానిస్థాన్‌లోని ప్రభుత్వానికి బలంగా మద్దతిస్తోంది. ప్రజాస్వామ్యబద్ధంగా ఏర్పడిన ప్రభుత్వం ఇది. ఈ పరిస్థితి సెప్టెంబరు 11 ఉగ్రవాద దాడులకు ముందు నుంచి కూడా ఉంది. తాలిబాన్ వ్యవస్థను పడగొట్టడానికి అప్పట్లో ప్రయత్నాలు జరిగాయి. నార్తరన్ ఎలయన్స్‌కు మానవీయ సహకారం మాత్రమే కాదు, అప్పట్లో సైనికపరమైన సహాయం కూడా అందించడం జరిగింది.ఈ నార్తరన్ అలయెన్సే తర్వాత, అంటే తాలిబాన్ ప్రభుత్వం కూలిపోయిన తర్వాత అఫ్ఘానిస్థాన్‌లో ప్రభుత్వంఏర్పాటు చేసింది.

కాని ఇప్పుడు పరిస్థితులు మారుతున్నాయి. అమెరికా ఇప్పుడు అక్కడి నుంచి తప్పుకోవాలని అనుకుంటోంది. అమెరికా తప్పుకుంటే అక్కడ అఫ్ఘానిస్థాన్ ప్రభుత్వం అత్యంత బలహీనపడిపోతుంది.అఫ్ఘానిస్థాన్ ప్రభుత్వం నిలబడి ఉందంటే అమెరికా సైన్యం అక్కడ ఉండడం వల్లనే. పాశ్చాత్య దేశాలు క్రమంగా తమ సైన్యాలను వెనక్కు ఉపసంహరించుకున్నాయి. దాంతో పాటు అఫ్ఘాని స్థాన్‌లో తాలిబాన్లు కూడా క్రమంగా బలపడ్డారు. ఇప్పుడు అఫ్ఘానిస్థాన్ మూడు వంతులు తాలిబాన్ల అదుపులో ఉంది. ఇటీవల జరిగిన ఎన్నికలు చాలా వివాదాస్పదమయ్యాయి.

అధ్యక్ష పదవికి పోటీపడిన ఇద్దరు నేతలు, అష్రఫ్ గనీ, అబ్దుల్లా అబ్దుల్లా ఇద్దరు కూడా దేశానికి తామే అధ్యక్షులమంటూ ప్రమాణ స్వీకారాలు చేశారు. ఒకవైపు అఫ్ఘానిస్థాన్‌లో పౌర రాజకీయాధికారం రెండు శిబిరాలుగా విడిపోయి ఉంది. మరోవైపు అమెరికా సహాయసహకారాలు చివరి దశకు చేరుకున్నాయి. ఇప్పుడు అఫ్ఘానిస్థాన్ ప్రభుత్వానికి భవిష్యత్తు చీకటిగా కనిపిస్తోంది. అమెరికా శాంతి చర్చలు తాలిబాన్‌తో చేసింది, ఈ చర్చల్లో అఫ్ఘానిస్థాన్ ప్రమేయం లేనేలేదు. ఈ చర్చలు ఎలా జరిగినప్పటికీ, ప్రభుత్వంలో తాలిబాన్లను తీసుకోకుండా ఎలాంటి పరిష్కారమూ సాధ్యమయ్యే పరిస్థితి లేదు.

తాలిబాన్ల సహకారం లేనిదే అఫ్ఘానిస్థాన్‌లో శాంతిభద్రతలతో సుస్థిర ప్రభుత్వం ఏర్పాటు చేయడం అసాధ్యమని ఇప్పుడు అమెరికా కూడా గుర్తించినట్లు కనిపిస్తోంది. తాలిబాన్లు తిరిగి బలపడడం భారతదేశానికి ఆందోళనకరమైన విషయం. కశ్మీరులో ఉగ్రవాద శక్తులకు సహాయపడే వారెవ్వరైనా సరే అఫ్ఘానిస్థాన్‌లో అధికారంలోకి రావడం భారత ప్రయోజనాలకు మంచిది కాదు. గతంలో తాలిబాన్లకు లష్కరె తయ్యిబ, జైషె ముహమ్మద్ వంటి గ్రూపులతో సత్సంబంధాలుండేవి. అయితే ఇప్పుడు తాలిబాన్లు తీవ్రవాద పంథా వదిలేసి ప్రధాన స్రవంతిలో భాగం కావాలనుకుంటున్నారనే వార్తలు కూడా వస్తున్నాయి. ఇటీవల గ్లోబల్ టెర్రరిజ కౌన్సిల్ ఒక సమావేశం నిర్వహించింది.

ఈ వేదికపై తాలిబాన్ ప్రతినిధి మాట్లాడుతూ తమ భూభాగం నుంచి ఇతర దేశాల్లో తీవ్రవాద కార్యకలాపాలను అనుమతించేది లేదని స్పష్టం చేశారు. అలాంటి కార్యకలాపాలను అడ్డుకునే చట్టం తీసుకువస్తామని అన్నారు. ఉమ్మడి ప్రయోజనాల ప్రాతిపదికన ఇరుగు పొరుగు దేశాలతో సత్సంబంధాలకు ప్రాధాన్యం ఇస్తామని కూడా ఆయన చెప్పాడు. ఈ పరిస్థితుల్లో భారతదేశం తన వ్యూహాలను, ఎత్తుగడలను మార్చుకోవలసిన అవసరం ఉంది. ఇప్పటి వరకు అమెరికా, తాలిబాన్ల మధ్య చర్చలను మనం వ్యతిరేకిస్తూ వచ్చాం.ఈ చర్చలను ఆపాలని ఒత్తిడి కూడా చేశాం. కాని ఇప్పుడు ఈ చర్చలు ఒక కొలిక్కి చేరుకున్న పరిస్థితి కనిపిస్తోంది. అఫ్ఘానిస్థాన్ నుంచి తప్పుకోవాలని అమెరికా తొందరపడుతోంది. తాలిబాన్లు ఇప్పుడు మరింత బలపడ్డారు. ఇంకా పాత విధానాన్నే కొనసాగించడం ఎంత వరకు ప్రయోజనకరమో ఆలోచించుకోవాలి. ఇప్పుడు పాకిస్థాన్‌తో తమ సంబంధాలను తాలిబాన్లు కూడా పునస్సమీక్షిస్తున్నట్లు వార్తలు వస్తున్నాయి. ఐయస్‌ఐ కార్యకలాపాల వల్ల తలెత్తే కల్లోలాన్ని గుర్తిస్తున్నారు. ఇలాంటి పరిస్థితుల్లో భారతదేశం ఈ పరిస్థితులను తనకు అనుకూలంగా మలచుకునే ప్రయత్నాలు చేయాలి. పాకిస్థాన్ అక్కడ చేసింది ఏమీ లేదు. ఉగ్రవాద శక్తులకు సహాయం చేసి వినాశం సృష్టించడం తప్ప.

కాని భారతదేశానికి గొప్ప సాఫ్ట్ పవర్ ఉంది. 3 బిలియన్ డాలర్లను అక్కడ భారతదేశం అందించింది. కోవిద్ 19తో పోరాడ్డానికి భారతదేశం అఫ్ఘానిస్థాన్‌కు వైద్య సహాయం, ఆహార పదార్థాలు పంపిస్తోంది. అఫ్ఘానిస్థాన్‌లోని అన్ని వర్గాలతో చర్చలు సంప్రదింపులు కొనసాగాలి. 90లో మాదిరి అంతర్యుద్ధం తలెత్తే సూచనలు కూడా కనిపిస్తున్నాయన్నది మరిచిపోరాదు. ఈ పరిస్థితుల్లో భారతదేశం ఆర్ధిక సహకారంద్వారా, మానవీయ సహాయంద్వారా, తన సాఫ్ట్ పవర్‌ద్వారా అక్కడ ప్రభావం వేయడానికి ప్రయత్నించాలి. అఫ్ఘాని స్థాన్‌లో స్థిరమైన, శాంతియుతమైన ప్రభుత్వం అనేది భారతదేశానికి చాలా అవసరం. ఉగ్రవాదులకు అవకాశం ఇవ్వని ప్రభుత్వం అక్కడ ఏర్పడడం మనకు చాలా అవసరం. అక్కడి పరిణామాలను నిశితంగా గమనించి తగిన విధంగా ప్రతిస్పందించవలసిన అవసరం ఉంది.

Taliban Attacks on Afghanistan

* రన్విజయ్ సింగ్ (ది క్వింట్)

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News