Home ఎడిటోరియల్ అటకెక్కనున్న ఉపాధ్యాయ విద్య

అటకెక్కనున్న ఉపాధ్యాయ విద్య

teachers

 

మన దేశ విద్యారంగం ముఖ్యంగా పాఠశాల విద్య నాణ్యత లేనిదనే ముద్రను మూటగట్టుకున్న విషయం తెలిసిందే. నాణ్యమైన ఉపాధ్యాయులు లేకపోవడమే అందుకు ప్రధాన కారణమనే చర్చ కూడా వుంది. జాతీయ విద్యా విధానం 2019 ముసాయిదాలో పాఠశాల ఉపాధ్యాయుల గురించి పెద్ద చర్చే చేశారు. ఉపాధ్యాయులకు ఉండాల్సిన విద్యార్హతలు, నియామకాల విధానం, ప్రమోషన్ అవకాశాలు, పని పద్ధతులు వగైరా చాలా విషయాలు క్రోడీకరించబడినవి. బహుళ విభాగాలు గల విశ్వవిద్యాలయాలు లేదా కళాశాలల్లో విషయపరంగా, బోధనా విధానంలో అత్యున్నత నాణ్యమైన శిక్షణతో నాలుగు సంవత్సరాల ఇంటిగ్రేడెడ్ బ్యాచిలర్ ఆఫ్ ఎడ్యుకేషన్ డిగ్రీ అర్హత గల వారే పాఠశాల ఉపాధ్యాయులుగా అర్హులవుతారు. ప్రీప్రైమరీ నుండి సెకండరీ వరకు వివిధ దశలు, సబ్జెక్టుల వారీగా ఆర్ట్, స్పోర్ట్, ఒకేషనల్‌తో సహా అన్ని సబ్జెక్టులకు అవసరమైన శిక్షణ పొందిన వారే కావాలి.

బిఇడితో పాటు టీచర్ ఎలిజిబిలిటీ టెస్ట్ (టిఇటీ) నేషనల్ టెస్టింగ్ ఏజన్సీ (ఎన్‌ఎటి) ద్వారా పొందిన స్కోరింగ్ ఉపాధ్యాయ నియామకాలకు అనివార్యం. టీచర్స్ రిక్రూట్‌మెంటుకి నిర్వహించే రాత పరీక్షలో పొందే మెరిట్ తో పాటు తరగతి గదిలో డెమో, ఇంటర్వూలో లభించే మార్కుల ఆధారంగానే ఉపాధ్యాయులుగా ఎంపిక కాగలరు. ఫౌండేషనల్ (ప్రీప్రైమరీ-1, 2 తరగతులు), ప్రిపరేటరీ (3, 4, 5 తరగతులు) పాఠశాలల్లో పని చేసే వారిని జనరలిస్ట్ టీచర్స్ అని; మిడిల్ (6, 7, 8 తరగతులు), సెకండరీ (9, 10, 11, 12 తరగతులు) స్కూల్స్‌లో పని చేసే వారిని సబ్జెక్టు టీచర్స్ అంటారు. వీరితో పాటు స్పెషల్ ఎడ్యుకేషన్ టీచర్స్, ఆర్ట్ టీచర్స్, ఒకేషనల్ ఎడ్యుకేషన్ టీచర్స్ అన్ని స్థాయిల పాఠశాలల్లోనూ ఉండాలని పేర్కొన్నారు.

ముసాయిదా నివేదికలో చెప్పిన విషయాలు, చేసిన సిఫార్సులు చూస్తుంటే ఉపాధ్యాయుల గురించి చాలా గొప్ప శ్రద్ధాసక్తులు కనబరుస్తున్నట్లు వుంది. అంత బిల్డప్ అవసరమా అనేది ప్రశ్న. నర్సరీ, కెజి, ప్రైమరీ తరగతులకు, సెకండరీ క్లాసులకు ఒకే విద్యార్హతలు, ఒకే స్థాయి కల్గిన వారిని ఉపాధ్యాయులుగా నియమించడం సమంజసమేనా? బి.ఇడిలో ఫౌండేషనల్, ప్రిపరేటరీ, మిడిల్, సెకండరీ సబ్జెక్టులు ప్రత్యేకంగా వున్నా విద్యార్హత (నాలుగేళ్ళ బి.ఇడి) స్థాయి ఒకటే. క్వాలిఫికేషన్ ఒకటే అయినా హోదాల్లో తేడాలు (జనరల్ టీచర్, సబ్జెక్ట్ టీచర్ వగైరా) చూపించారు. సమాన విద్యార్హత గనుక జీతం సమానంగా ఉండాలనే సిఫార్సు మాత్రం చేయలేదు.

హైయ్యర్ క్వాలిఫికేషన్స్ గల వారు లోయర్ క్లాసులకు బోధించడానికి ఇష్టపడరని, అందువలన ప్రైమరీ స్కూల్స్‌లో ఇంటర్మీడియట్ + టిటిసి అర్హత గల వారినే సెకండరీ గ్రేడ్ టీచర్స్‌గా అనుమతించి బి.ఇడి క్వాలిఫికేషన్ వారిని నిషేధించిన అనుభవం కూడా వున్న విషయం తెలిసిందే. ఆర్ట్, క్రాఫ్ట్, మ్యూజిక్ వగైరా, ఒకేషనల్ టీచర్స్ నియామకాలకు కూడా బి.ఇడి విద్యార్హతనే ప్రపోజ్ చేయడం అతిగా వుంది. ప్రాథమిక తరగతులకు కూడా నాలుగేళ్ళ డిగ్రీ అర్హత గలవారే పాఠాలు చెప్పగలరనడం అతిశయోక్తి కాగలదు. అవసరమైన క్వాలిఫికేషన్స్, ట్రైనింగ్ కావాల్సిందే, వాటితో పాటు పరిపాలనా సామర్ధ్యాన్ని బట్టే ఉపాధ్యాయుల పని విధానం, నాణ్యమైన బోధన సాధ్యమవుతుందనే వాస్తవాన్ని గుర్తించాలి. కేంద్రీయ, నవోదయ విద్యాలయాల్లో పని చేస్తున్న టీచర్స్, మండల పరిషత్, జిల్లా పరిషత్ పాఠశాలల్లో పని చేస్తున్న ఉపాధ్యాయుల విద్యార్హతలు ఒకటే. కానీ వారిపైన ప్రశంసలు వీరిపైన విమర్శలు ఎందుకని?

నాలుగేళ్ళ బి.ఇడి అర్హత గల వారినే పాఠశాలల్లో ఉపాధ్యాయులుగా నియమించాలనే రికమండేషన్ అమల్లోకి వస్తే లాభాల కంటే నష్టాలు ఎక్కువ జరిగే అవకాశం వుంది. ఒకటి, ఉపాధ్యాయ ఉద్యోగాలకు ప్రతిభ గల వారి ప్రవేశం తగ్గిపోగలదు. నాలుగేళ్ళ డిగ్రీలుగా వున్న ఇంజనీరింగ్ తదితర ప్రొఫెషనల్ కోర్సులకు వుండే డిమాండ్ ఉపాధ్యాయ వృత్తికి వుండదు. ఒక ఏడాదిగా వుండే డిప్లొమా ఇన్ ఎడ్యుకేషన్ (టిటిసి) కోర్సును రెండేళ్లకు పెంచినపుడే ప్రవేశాలు తగ్గిపోయిన విషయం తెలిసిందే. రెండు, దళితులు, గిరిజనులు, బలహీన తరగతుల వారిలో అత్యధికులు డిగ్రీ దాక చదవలేక పదో తరగతి, పన్నెండో తరగతితోనే డ్రాపవుట్ అవుతున్నారు. అందువలన ఉపాధ్యాయ నియామకాల్లో రిజర్వుడ్ కేటగిరి వారి సంఖ్య తగ్గిపోవచ్చు. మూడు, నాలుగేళ్ళ బి.ఇడితోనే సరిపోదు, టెట్, ఎన్‌టిఎ స్కోరింగ్ ఉంటేనే ఉపాధ్యాయ ఉద్యోగానికి అప్లై చేసే అర్హత లభిస్తుంది.

టీచర్ రిక్రూట్‌మెంట్ పరీక్ష వ్రాయాలి, క్లాస్ రూమ్ డెమోలో పాల్గోవాలి, ఇంటర్వూని ఎదుర్కోవాలి. డిగ్రీతోనే వయసు ఇరవై రెండు సంవత్సరాలు దాటుతుంది. ఆపైన టెట్, ఎన్‌టిఎ, రిక్రూట్‌మెంట్ పరీక్ష, డెమో, ఇంటర్వ్యూ అన్నీ ఒక సంవత్సరంలోనే పూర్తవుతాయని చెప్పలేం. అంతకాలం ఆగలేక వేరే వృత్తుల్లోకి జారుకునే అవకాశం ఉంటుంది. నాలుగు, అన్ని స్థాయిల ఉపాధ్యాయ ఉద్యోగార్థులు బహుళ విభాగాలు గల విశ్వవిద్యాలయాలు, కాలేజీల్లోని నాలుగేళ్ళ బి.ఇడి కోర్సులే చదవాల్సి వస్తే దేశ వ్యాప్తంగా వున్న బి.ఇడి, డైట్, పండిట్, పిఇటి తదితర ఉపాధ్యాయ విద్యా సంస్థలన్నీ మూతబడినట్లే. ఇటీవల పుట్టగొడుగుల్లా పుట్టుకొచ్చి సర్టిఫికెట్లు అమ్ముకుంటున్న పదిహేడు వేల సబ్-స్టాండర్డ్ టీచర్ ట్రెయినింగ్ ఇనిస్టిట్యూట్స్‌ను మూసేయాలనే సిఫారసు మంచిదే అనిపిస్తుంది. సబ్-స్టాండర్డ్ అనేది ప్రైవేటుతో పాటు ప్రభుత్వ సంస్థలకూ వర్తిస్తుంది. నాలుగేళ్ళ బి.ఇడి కోర్సును యూనివర్శిటీలు. మల్టీ డిసిప్లైన్ కాలేజీల్లోనే నిర్వహించాలనే సిఫార్సును కూడా ప్రైవేట్ కార్పొరేట్ సంస్థలే ఎగరేసుకుపోగలవు.

కనుక ప్రక్షాళన వంకతో, నాణ్యత పేరుతో ఉపాధ్యాయ విద్యను ఉట్టికెక్కించి సరికొత్త సమస్యలను సృష్టించడం అనవసరం. ప్రభుత్వరంగంలోని ఉపాధ్యాయ విద్యాసంస్థలను సకల సదుపాయాలతో ఆధునీకరించి, అవసరమైనంత ఫ్యాకల్టీతో బలోపేతం చేస్తే సరిపోతుంది. ప్రీప్రైమరీ నుండి సెకండరీ వరకు ఉపాధ్యాయులను నాలుగు కేడర్లుగా నియమిస్తే బాగుంటుంది. ప్రీప్రైమరీ టీచర్స్, ప్రైమరీ టీచర్స్ (1-5 తరగతులకు), గ్రాడ్యుయేట్ టీచర్స్ (6-10 తరగతులకు), పోస్ట్ గ్రాడ్యుయేట్ టీచర్సు (11-12 తరగతులకు)గా డెసిగ్నేషన్స్ ఉండాలి. పిపి టీచరుకి పదో తరగతి + పిపిటి ట్రెయినింగ్, ప్రైమరీ టీచర్సుకి పన్నెండో తరగతి + పిటి ట్రెయినింగ్, గ్రాడ్యుయేట్ టీచర్సుకి నాలుగేళ్ళ బి.ఇడి, పిజి టీచర్సుకి నాలుగేళ్ళ బి.ఇడి + పోస్ట్ గ్రాడ్యుయేషన్ అర్హతలుగా వుండాలి. ప్రీప్రైమరీ, ప్రైమరీ, గ్రాడ్యుయేట్ టీచర్లకు ఇన్-సర్వీసులో దూర విద్య ద్వారా బి.ఇడి, పిజి చదువుకుని ఫై కేడర్లకు ప్రమోషన్లు పొందే అవకాశం కల్పించాలి.

విద్యా విధానం ముసాయిదాలో అలాంటి అవకాశం లేదు. ఎడ్యుకేషనల్ అడ్మినిస్ట్రేటర్సుగా, టీచర్ ఎడ్యుకేటర్సుగా ప్రమోట్ కావచ్చనే నివేదికలోని సూచన వలన చాలా కొద్ది మందికే అవకాశం రావచ్చు. అలాంటి అరుదైన ప్రమోషన్లను, ఉపాధ్యాయుల జీతాల పెరుగుదలను మెరిట్ ప్రాతిపదికన నిర్ణయించాలనే సిఫారసు కూడా ప్రశ్నర్ధకంగానే వుంది. ఉపాధ్యాయుల నియామకాలు, పని విధానంకు సంబంధిచిన మరికొన్ని సిఫార్సులను కూడా పరిశీలించి వెంటనే ప్రత్యామ్నాయ ప్రతిపాదనలు చేయాల్సిన అవసరం ఎంతైనా వున్నది. ఇందుకోసం ఉపాధ్యాయులు, విద్యారంగ శ్రేయోభిలాషులు ఎంత త్వరగా స్పందిస్తే అంత మంచిది. లేకపోతే ముసాయిదాలోని సిఫార్సులు యథాతథంగా అమల్లోకి వస్తే పాఠశాల విద్య మరింత పతనమయ్యే ప్రరిస్థితి దాపురిస్తుంది.

Talk about school teachers in the Framework