Home ఎడిటోరియల్ నీట్‌పై తమిళుల పోరాటం!

నీట్‌పై తమిళుల పోరాటం!

Tamil nadu assembly passes bill against NEET         వైద్య విద్యలో ప్రవేశం కోసం కేంద్ర ప్రభుత్వం జాతీయ స్థాయిలో ప్రవేశపెట్టిన నీట్ (నేషనల్ ఎలిజిబిలిటీ కమ్ ఎంట్రెన్స్ టెస్ట్) పరీక్షతో తమిళనాడు చేస్తున్న పోరాటం ఫెడరల్ చైతన్యాన్ని ప్రతిబింబిస్తున్నది. కేంద్రం ఏ నిర్ణయం తీసుకుంటే దానికి మౌనంగా తలొగ్గడం రాష్ట్రాల వెన్నెముకను విరిచేస్తుంది. కేంద్ర నిర్ణయంలోని మంచి చెడులను తరచి చూసి అది తమ ప్రజల ప్రయోజనాలకు విరుద్ధమనిపిస్తే దానిని శక్తి మేరకు ప్రతిఘటించడమే రాష్ట్రాల విధి విధానం కావాలి. నీట్ పరీక్ష, ప్రత్యేక కోచింగ్ తీసుకోగల సంపన్నుల పిల్లలకే అనువైనదని, పేదల గ్రామీణ బలహీన వర్గాల పిల్లల ఆశలను అది చిదిమేస్తుందని భావించి దానిని ఆది నుంచీ తమిళనాడు ఎదిరిస్తున్నది. వాస్తవానికి తమిళనాడులో రాష్ట్ర స్థాయి మెడికల్ ప్రవేశ పరీక్ష కూడా లేదు. 12 వ తరగతిలో మంచి మార్కులు తెచ్చుకున్న వారికి వైద్య విద్యలో ప్రవేశం కల్పించే పద్ధతి అక్కడ నీట్‌కు ముందు అమల్లో ఉంది. అటువంటి అర్హతను సంపాదించుకున్న అనిత అనే దళిత విద్యార్థిని నీట్‌ను సవాల్ చేస్తూ వేసిన కేసును సుప్రీంకోర్టు 2017లో కొట్టి వేసింది. దానితో తీవ్ర నిరాశకు గురైన అనిత ఆత్మహత్య చేసుకుంది.

అప్పటి నుంచి తమిళనాడు ప్రజలు నీట్‌కు వ్యతిరేకంగా ఉద్యమిస్తున్నారు. వారి ఆకాంక్షను అర్థం చేసుకున్న అక్కడి ప్రభుత్వాలు నీట్‌కు వ్యతిరేకంగా అసెంబ్లీలో తీర్మానాలు ఆమోదించి పంపడం ప్రారంభమైంది. ఇంతకు ముందున్న అన్నా డిఎంకె ప్రభుత్వం కూడా శాసన సభ చేత తీర్మానం చేయించింది. అయితే రాష్ట్రపతి ఆమోదం లభించక అది వమ్ము అయిపోయింది. అందుచేత తమిళనాడు అసెంబ్లీ నీట్‌కు వ్యతిరేకంగా ఎన్ని తీర్మానాలు చేసినా అవి నిష్ఫలమవుతున్నాయి. నీట్ కారణంగా తమిళనాడులో ఇంత వరకు 15 మంది విద్యార్థులు ఆత్మహత్య చేసుకున్నారు. ఈ ఏడాది నీట్ పరీక్ష జరిగిన సందర్భంగా అక్కడ నిన్న మొన్నటి లోనే ముగ్గురు విద్యార్థులు ప్రాణాలు తీసుకున్నారు.దీనితో ముఖ్యమంత్రి స్టాలిన్ ఆత్మహత్యలు చేసుకోవద్దంటూ ప్రజలకు ప్రత్యేక విజ్ఞప్తి చేశారు. వైద్య విద్యలో ప్రవేశానికి విద్యార్థులకున్న పరిమితమైన అవకాశాలను కూడా నీట్ కాలరాస్తున్నదని, కేంద్ర ప్రభుత్వం రాతి గుండెతో వ్యవహరిస్తున్నదని, అది ఎంతకీ దిగి రావడం లేదని ఈ సందర్భంగా చేసిన ప్రకటనలో స్టాలిన్ పేర్కొన్నారు. నీట్‌ను కేంద్ర ప్రభుత్వం రద్దు చేయక తప్పని పరిస్థితిని సృష్టిస్తామని కూడా ఆయన శపథం చేశారు.

ఇదే సమయంలో నీట్‌ను ప్రభావితం చేయగల ఒక వ్యాజ్యం మద్రాస్ హైకోర్టులో దాఖలైంది. ఈ పిటిషన్‌ను మంగళవారం నాడు హైకోర్టు విచారణకు తీసుకున్నది. అంత వరకు రాష్ట్రాల జాబితాలో గల విద్యను కేంద్ర, రాష్ట్రాలకు అధికారముండే ఉమ్మడి జాబితాలో చేర్చుతూ ఎమర్జెన్సీ కాలంలో తీసుకు వచ్చిన రాజ్యాంగ సవరణను ఈ పిటిషన్ సవాలు చేసింది. పిటిషనర్ అభ్యర్థనను హైకోర్టు మన్నిస్తే విద్య తిరిగి రాష్ట్రాల జాబితాకే పరిమితమవుతుంది. అప్పుడు రాష్ట్రాలు నీట్‌ను తిరస్కరించే స్వేచ్ఛను పొందుతాయి. అలాగే జాతీయ విద్యా విధానాన్ని కూడా అవి త్రోసిపుచ్చవచ్చు. ఈ పిటిషన్‌ను మద్రాస్ హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి సంజీవ్ బెనర్జీ అధ్యక్షతన గల ధర్మాసనం విచారణకు తీసుకున్నది. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు రెండింటికీ నోటీసులు జారీ చేసింది. 8 వారాల్లో సమాధానం చెప్పాలని ఆదేశించింది. ఈ వ్యాజ్యంలో తమకు అనుకూలమైన తీర్పు రాగలదనే విశ్వాసంతోనే ముఖ్యమంత్రి స్టాలిన్ కేంద్రం దిగొచ్చేలా చేస్తామని తన ప్రకటనలో పేర్కొన్నారని భావించడానికి ఆస్కారం కలుగుతున్నది. విద్య ఉమ్మడి జాబితాలో ఉన్నప్పటికీ ఇటువంటి సున్నితమైన విషయాల్లో కేంద్రం విజ్ఞతతో వ్యవహరించి రాష్ట్రాల అభిప్రాయాలను బట్టి నడుచుకోడం మంచి సంప్రదాయమవుతుంది.

కాని ఎవరి అభిప్రాయాన్ని, సలహాను తీసుకోకుం డా ఏకపక్షంగా నిరంకుశ నిర్ణయాలు తీసుకునే చరిత్ర దండిగా ఉన్న ప్రధాని మోడీ ప్రభుత్వం రాష్ట్రాలను సంప్రదించి మెజారిటీ అభిప్రాయాన్ని స్వీకరిస్తుందని ఎంత మాత్రం అనుకోలేము. విద్య పై రాష్ట్ర ప్రభుత్వాల అదుపు కోల్పోలేదని, అది ఉమ్మడి జాబితాలోనే ఉందని, కేంద్ర జాబితాలోకి వెళ్లిపోలేదని డాక్టర్ ఎళియన్ నాగనాథన్ పిటిషన్‌ను విచారణకు తీసుకున్న సందర్భంలో మద్రాస్ హైకోర్టు ధర్మాసనం అభిప్రాయపడడం గమనించవలసిన విషయం. విద్యను రాష్ట్రాల జాబితా నుంచి తొలగిస్తూ 1976లో చేసిన 42వ రాజ్యాంగ సవరణ రాజ్యాంగం మౌలిక నిర్మాణ సిద్ధాంతానికి ఉల్లంఘన అని డా. నాగనాథన్ తన పిటిషన్‌లో వాదించారు. స్టాలిన్ ప్రభుత్వం నియమించిన ఎకె రంగరాజన్ కమిటీ కూడా నీట్ పరీక్ష కోచింగ్ సదుపాయాలుండే సంపన్నుల పిల్లలకే అనుకూలమైనదని అభిప్రాయపడింది. నీట్‌ను కేంద్రం రద్దు చేసినా, చేయకపోయినా దానిని ఎదుర్కోగల సామర్థాన్ని అన్ని వర్గాల పిల్లలకు కల్పిస్తూ తగిన ఉచిత కోచింగ్ సదుపాయాలను రాష్ట్ర ప్రభుత్వాలు ఏర్పాటు చేయడం అవసరం.

Tamil nadu assembly passes bill against NEET