Friday, April 26, 2024

గవర్నర్ అధికారాలకు స్టాలిన్ కోత..

- Advertisement -
- Advertisement -

వీసీల నియామకాలకు తమిళనాడులో కొత్త బిల్లు
గవర్నర్ అధికారాలకు “స్టాలిన్” కోత
చెన్నై: విశ్వవిద్యాలయాల వైస్ ఛాన్సలర్ల నియామకంలో రాష్ట్ర గవర్నర్‌కు ఉన్న అధికారాలను తొలగించేలా తమిళనాడు ప్రభుత్వం చర్యలు చేపట్టింది. వర్శిటీల వీసీలను రాష్ట్ర ప్రభుత్వమే నియమించేలా తమిళనాడు విశ్వవిద్యాలయాల చట్టంలో సవరణలు చేస్తూ అసెంబ్లీలో బిల్లు తీసుకొచ్చింది. రాష్ట్ర విద్యాశాఖ మంత్రి కె. పొన్నుడి సోమవారం ఈ బిల్లును శాసన సభలో ప్రవేశ పెట్టారు. ఈ సందర్భంగా రాష్ట్ర ముఖ్యమంత్రి స్టాలిన్ బిల్లుపై మాట్లాడుతూ.. “సంప్రదాయం ప్రకారం రాష్ట్ర ప్రభుత్వంతో సంప్రదించి గవర్నర్ వర్శిటీల వైస్ ఛాన్సలర్లను నియమిస్తారు. అయితే గత కొన్ని సంవత్సరాలుగా గవర్నర్లు దాన్ని తమ ప్రత్యేక హక్కు అన్నట్టు వ్యవహరిస్తున్నారు. ఇది ప్రభుత్వాన్ని అగౌరవ పర్చడమే గాక, ప్రజాస్వామ్య విధానానికి విరుద్ధం. అంతేకాక, వైస్ ఛాన్సలర్ల నియామకం విషయంలో ప్రభుత్వానికి అధికారం లేకపోవడం ఉన్నత విద్యపై తీవ్ర ప్రభావం చూపిస్తోంది. విశ్వవిద్యాలయ పాలనా వ్యవహారాల్లోనూ గందరగోళం సృష్టిస్తోంది.” అని చెప్పుకొచ్చారు. ఈ సందర్భంగా 2010 మాజీ సీజేఐ మదన్‌మోహన్ పూంచీ నేతృత్వంలోని కమిషన్ ఇచ్చిన నివేదికను స్టాలిన్ ప్రస్తావించారు. యూనివర్శిటీల ఛాన్సలర్ పదవి నుంచి గవర్నర్‌ను తొలగించాలని ఆ కమిటీ సిఫార్సు చేసినట్టు గుర్తు చేశారు. “అంతెందుకు.. ప్రధాని నరేంద్ర మోడీ సొంత రాష్ట్రమైన గుజరాత్ లోనూ వీసీలను గవర్నర్ నేరుగా నియమించరు. రాష్ట్ర ప్రభుత్వ కమిటీ సిఫార్సు చేసిన ముగ్గురు అభ్యర్థుల్లో ఒకరిని వీసీగా ఎంచుకుంటారు.” అని స్టాలిన్ అన్నారు.

ఇదిలా ఉండగా, తమిళనాడులోని రాష్ట్ర, కేంద్ర, ప్రైవేట్ యూనివర్శిటీల వైస్ ఛాన్సలర్ల సదస్సు సోమవారం ప్రారంభమైంది. ఈ సదస్సును రాష్ట్ర గవర్నర్ ఆర్‌ఎన్ రవి ప్రారంభించారు. ఇదే సమయంలో స్టాలిన్ ప్రభుత్వం గవర్నర్ అధికారాల్లో కోత విధించేలా బిల్లు తీసుకురావడం గమనార్హం. అయితే ఈ బిల్లును ప్రతిపక్ష పార్టీలు, బిజేపీ, అన్నాడిఎంకె వ్యతిరేకించగా, పీఎంకే పార్టీ సమర్ధించింది.

Tamil Nadu passes bill to allow state to Appointed VC’s

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News