Home ఎడిటోరియల్ తమిళ తెర నిరసన గళం

తమిళ తెర నిరసన గళం

tamil2

తమిళనాట సినిమా మాధ్యమం సామాజిక, రాజకీయ, సాంస్కృతిక రంగాలకు ప్రాతినిధ్యం వహించడం ఈనాటిది కాదు. ఆర్య సంస్కృతిని కట్టడి చేసేందుకు ఎందరో మహానుభావులు ప్రజానీకంలో తమ భావజాల వ్యాప్తికి సినిమాను వాహకంగా చేసుకున్నారు. ద్రవిడ మున్నేట్ర కజగం వ్యవస్థాపకుడు, స్వాతంత్య్రానంతరం తొలి కాంగ్రెస్ ఏతర తమిళనాడు ముఖ్యమంత్రి అయిన అన్నాదురై తన ఆలోచనా సరళిని జనాలకు చేరవేసేందుకు ఎన్నో సినిమాలకు కథ, మాటలు కూర్చారు. ఆయన శిష్యులైన ఎం. కరుణానిధి, నెడుంజెళియన్, మురసోలి మారన్‌లు కూడా సాంస్కృతిక పోరులో భాగంగా చిత్రసీమను తమదిగా చేసుకున్నారు. 
మెరుగైన చలనచిత్ర నిర్మాణంలోనే కాకుండా సామాజిక బాధ్యతను స్వీకరించడంలోనూ తమిళ చిత్రసీమ ముందుందని చెప్పవచ్చు. సినిమాల ద్వారా ప్రేక్షకులకు వినోదాన్ని పంచి డబ్బు కూడబెట్టుకొనే ఫక్తు వ్యాపార చట్రం పరిధి దాటిరాని తెలుగు తెరగణం సాటి తమిళ శ్రేణుల నుంచి తెలుసుకోవలసింది ఎంతో ఉంది.
తమిళనాట సినిమా మాధ్యమం సామాజిక, రాజకీయ, సాంస్కృతిక రంగాలకు ప్రాతినిధ్యం వహించడం ఈనాటిది కాదు. ఆర్య సంస్కృతిని కట్టడి చేసేందుకు ఎందరో మహానుభావులు ప్రజానీకంలో తమ భావజాల వ్యాప్తికి సినిమాను వాహకంగా చేసుకున్నారు. ద్రవిడ మున్నేట్ర కజగం వ్యవస్థాపకుడు, స్వాతంత్య్రానంతరం తొలి కాంగ్రెస్ ఏతర తమిళనాడు ముఖ్యమంత్రి అయిన అన్నాదురై తన ఆలోచనా సరళిని జనాలకు చేరవేసేందుకు ఎన్నో సినిమాలకు కథ, మాటలు కూర్చారు. ఆయన శిష్యులైన ఎం.కరుణానిధి, నెడుంజెళియన్, మురసోలి మారన్‌లు కూడా సాంస్కృతిక పోరులో భాగంగా చిత్రసీమను తమదిగా చేసుకున్నారు. ముఖ్యమంత్రులయిన మక్కల్ బిలగం, ఎం.జి.రామచంద్రన్, పులిచ్చితలైవి, జయలలిత సినిమా తారలేనని చెప్పనవసరం లేదు. ఎం.జి.రామచంద్రన్‌ను ఓ ప్రజానాయకుడిగా నిలబెట్టేందుకు తగిన కథానాయక పాత్రలను కరుణానిధి, మురసోలి మారన్‌లు తీర్చిదిద్దారు. పొగ, మధ్యపానం చేయని, సామాన్య జనానికి సహకరించే పాత్రలో ఎంజిఆర్ ఎన్నో సినిమాల్లో నటించాడు. తొలుత కాంగ్రెస్ పార్టీ సభ్యుడైన ఎంజిఆర్ 1954లో కరుణానిధి సహవాస బలంతో డిఎంకెలో చేరి తమిళనాడుకు 1977 నుండి 87 దాకా పదేళ్లపాటు ముఖ్యమంత్రి కాగలిగారు. సినిమా హీరోయిన్ అయిన జయలలిత రామచంద్రన్ చేయిబట్టుకొని సినిమాల్లోకి, ఆ తర్వాత రాజకీయరంగంలో తెరంగేట్రం చేసి 1991 2016 మధ్యకాలం 14ఏళ్లపాటు తమిళనాడుకు ముఖ్యమంత్రి అయ్యారు. అయితే వీరిద్దరి కాలంలో తమిళ, ద్రవిడ సంస్కృతికి పెద్దగా ఒరిగిందేమీ లేదు. కేంద్రంలో ఉన్న ప్రభుత్వాలకు అనుకూలం గా మెదలుతూ తమ పాలన సాగించారు.
ఈ మధ్య కొందరు తమిళ సినీ ప్రముఖులు నోరు విప్పిన సంఘటనలతో మళ్లీ ఉత్తర భారత, హిందూవాద వ్యతిరేకత బయట పడింది. వీరి మాటలు కేంద్రప్రభుత్వానికి, హిందూ ఛాందసవాదులకు ఇంపుగా లేకపోవడంతో ప్రతీకారదాడులకు రంగం సిద్ధమైంది.
తమిళవార పత్రిక ఆనంద వికటన్‌కు క్రమంగా రాసే నటుడు కమల్‌హాసన్ తన శీర్షికలో హిందూత్వ వాదుల హింసాధోరణిని దుయ్యబట్టారు. హిందూ ధర్మ వ్యాప్తికి పనిచేసే సంస్థలు హద్దులు దాటి తీవ్రవాదబాటను ఎంచుకున్నాయి. ధర్మ విమర్శకులను, వ్యతిరేకులను లక్షంగా చేసుకొని ప్రాణహానికి సైతం పూనుకుంటున్నాయని అన్నాడు. తమిళనాడుకు ఆర్య సంస్కృతిని ఎదుర్కొన్న చరిత్ర ఉంది. తిరిగి ఆ సామాజిక సంస్కరణ ఉద్యమం పునరుజ్జీవం పొందడానికి కాలం దగ్గర పడిందని ఆయన అన్నాడు.
ఒక టివి ఇంటర్వూలో కమల్‌హాసన్ మహాభారతంపై చేసిన వ్యాఖ్యలు సైతం వివాదాస్పదమైనాయి. మగవాళ్లు జూదమాడుతూ ఆడదాన్ని పావుగా వాడుకున్నారని అన్న ఆయన మాటలు పురాణాలను కించపరచే విధంగా ఉన్నాయని చెన్నై న్యాయస్థానంలో ఓ కేసు కూడా వేశారు. ఈ మధ్య ఓ వేదిక నుండి కేంద్రప్రభుత్వాన్ని విమర్శిస్తూ వాణిజ్య ప్రయోజనాల కోసం వ్యవసాయాన్ని ధ్వంసం చేస్తున్నారని, పురాణాలను చరిత్రగా చిత్రీకరిస్తున్నారని పలికారు. పెద్దనోట్ల రద్దు సమయంలో కేంద్రప్రభుత్వం చర్యను వెనకేసుకువచ్చిన కమల్‌హాసన్ ఈ మధ్యనే తన మాటను వెనక్కి తీసుకున్నాడు. నోట్ల రద్దు ప్రజా వ్యతిరేక చర్యగా అభివర్ణించాడు. రాజకీయ ప్రవేశంకోసం రంగం సిద్ధం చేసుకుంటున్న కమల్‌హాసన్ ఈ మధ్య కేరళ ముఖ్యమంత్రి పినరయి విజయన్‌ను కలిసిన నేపథ్యంలో
కమల్‌హాసన్ కమ్యూనిస్టులు రాసిచ్చిన డైలాగులను మాట్లాడుతున్నాడని పార్లమెంటు సభ్యుడు సుబ్రహ్మణ్యం స్వామి విమర్శించారు. మరో బిజెపి నాయకుడు కమల్‌హాసన్‌ను లష్కరే తోయిబా నాయకుడు హఫీజ్ సయీద్‌తో పోల్చాడు.
కన్నడ నేపథ్యంగల నటుడు ప్రకాశ్‌రాజ్ గౌరీలంకేశ్ హత్యతో కలతచెంది ప్రభుత్వంపై విరుచుకుపడ్డాడు. పత్రికా సంపాదకురాలైన గౌరీలంకేశ్ ప్రకాశ్‌రాజ్‌కు మిత్రురాలు. కొందరు గౌరీలంకేశ్ హత్యను సమర్థిస్తూ వ్యాఖ్యలు చేస్తుంటే ప్రధాని నరేంద్రమోడీ మౌనంగా ఎందుకున్నారని ప్రకాశ్ రాజ్ ప్రశ్నించాడు. ప్రధానిపై అలాంటి విలువ తగ్గించే వ్యాఖ్యలు చేయడంపట్ల ఆయనపై లక్నోలో ఓ వ్యాజ్యం వేశారు. దాంతో మరింత ముందుకొచ్చి మోడీ తనను మించిన నటుడని అనేదాకా ప్రకాశ్‌రాజ్ వెళ్లాడు. మరో సందర్భంలో ఉత్తరప్రదేశ్ ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్ గుడిపూజారో, రాష్ట్రానికి ముఖ్యమంత్రో అర్థం కావడం లేదన్నా రు.
యువహీరో విజయ్ నటించిన ‘మెర్సల్’ సినిమా మరో వివాదానికి దారితీసింది. కేంద్రప్రభుత్వం ప్రవేశపెట్టిన డిజిటల్ ఇండియాపై, వస్తు, సేవల పన్నుపై వ్యతిరేకత తెలిపేరీతిలో సంభాషణలు ఆ చిత్రంలో ఉన్నాయనేది దానికి కారణం. విజయ్ క్రైస్తవుడు కాబట్టి ప్రధాని మోడీపై ఆయనకు గౌరవం లేదని బిజెపి నాయకుడు హెచ్.రాజా వ్యాఖ్యానించాడు, ఇంటర్నెట్ లో మెర్సల్ సినిమా చూశానని హెచ్.రాజా ప్రకటించడంతో అది మరో వివాదానికి తెరలేపింది. ఒక బాధ్యత గల పౌరుడైన రాజా సినిమాను పైరసీలో చూడడం తప్పుపని అని హీరో విశాల్ ప్రకటించాడు. మర్నాడే హీరో విశాల్‌కు సంబంధించిన చిత్రనిర్మాణ కార్యాలయంపై జిఎస్‌టి అధికారుల తనిఖీ జరిగింది. పన్ను ఎగ్గొట్టాడని అధికారులు ఆయనపై అభియోగం మోపారు. ఢిల్లీలోని జంతర్‌మంతర్‌వద్ద తమిళ రైతులు చేసిన ఆందోళన అందరికీ తెలిసిందే. సంఘీభావంగా తమిళ చలన చిత్రరంగ ప్రముఖులు స్వయంగా ఢిల్లీ వెళ్లి రైతులను కలిసి ఆందోళనలో పాల్గొన్నారు. తమిళ చిత్ర నిర్మాతల మండలికి అధ్యక్షుడైన నటుడు విశాల్ ఈ బృందానికి నాయకత్వం వహించాడు. ప్రకాశ్‌రాజ్ కూడా ఇందులో పాల్గొన్నాడు.
ఉత్తరభారత పెత్తనాన్ని, ఆర్య సంస్కృతి దాడిని వ్యతిరేకించేతత్వం తమిళనాడు డిఎన్‌ఎలోనే ఉంది. పెరియార్ రామస్వామి బ్రాహ్మణత్వానికి బద్ద వ్యతిరేకి. స్వాతంత్య్రానికి పూర్వమే ద్రవిడ కజగం ఏర్పాటు చేసి సామాజిక మార్పుకు కృషి చేశాడు. ఆయన భావజాలంలోంచి పుట్టి, చివరకు ఆయన్ని విభేదించిన అన్నాదురై 1967లో తమిళనాడు ముఖ్యమంత్రి అయ్యారు. 20ఏళ్ల కాంగ్రెస్ పాలనను కూలదోసిన తమిళభాష, ద్రవిడ సంస్కృతుల అభిమానం ఓట్ల రూపంలో పాలనకు ఇంకా సహకరిస్తోంది.
దక్షిణ భారతదేశంపై కేంద్రపెత్తనాన్ని ప్రశ్నించేవారి వాదనలో న్యాయముంది. 2014 ఎన్నికల్లో బిజెపి దేశవ్యాప్తంగా 282 సీట్లు సాధించింది. దక్షిణ భారతంలో ఆ పార్టీ లెక్కలు తీస్తే పెత్తనానికి అర్థం లేదనే విషయం బయటపడుతుంది. తెలంగాణ, ఆంధ్రప్రదేశ్, కర్నాటక, తమిళనాడు, కేరళ కలిసి పార్లమెంటు సీట్లు 129 ఉన్నాయి. వాటిలో బిజెపికి దక్కినవి 21మాత్రమే. అందులో కర్నాటకలోని 17 సీట్లు మినహాయిస్తే మిగతా మూడురాష్ట్రాల్లో 4స్థానాలే. కర్నాటకలో సైతం కాంగ్రెస్ కేవలం 2శాతం ఓట్ల భేదంతో తన సీట్లు కోల్పోయింది. దేశవ్యాప్తంగా 83.41కోట్ల ఓటర్లుండగా దక్షిణం లో 18 కోట్ల ఓట్లు ఉన్నాయి. ఉత్తరప్రదేశ్, మధ్యప్రదేశ్ ఓట్లు కలిపితే 18కోట్ల పైమాటే. దక్షిణాది నాలుగు రాష్ట్రాల్లో 2014 లోక్‌సభ ఎన్నికల్లో పోలయిన ఓట్లు 13.64 కోట్లు కాగా అందులో బిజెపికి వచ్చినవి 1కోటి 13లక్షలు మాత్రమే. దాదాపు 8% గా భావించాలి.
అతివాద ధోరణులను, ప్రభుత్వ అలసత్వాన్ని ప్రశ్నించే గొంతుకలను తొక్కివేయాలనుకునే సందర్భం లో బిజెపి, దాని అనుబంధ సంస్థలు ఈ గణాంకాలను పరిశీలించవలసిన అవసరం ఉంది. వాపును బలంగా భావిస్తే పరిణామాల తీవ్రత మరింత పెరుగుతుంది.