Home తాజా వార్తలు ప్లాస్మాదానం చేసి ప్రాణదాతలు కావాలి

ప్లాస్మాదానం చేసి ప్రాణదాతలు కావాలి

Tamilisai celebrated Raksha with plasma donors

 

హైదరాబాద్: ప్లాస్మాదానం చేసి ప్రాణదాతలు కావాలని గవర్నర్ తమిళిసై సౌందరరాజన్ పిలుపునిచ్చారు. ప్లాస్మాదాతలు జీవిత రక్షకులని ఆమె ప్రశంసించారు. సోమవారం రక్షాబందన్‌ను పురస్కరించుకొని రాజ్‌భవన్‌లోని ఐకానిక్ దర్భార్‌హాల్‌లో 13 మంది ప్లాస్మాదాతలను గవర్నర్ సన్మానించారు. ప్లాస్మాదాతలకు రాఖీలు, స్వీట్లు పంచి శాలువాలతో సత్కరించిన గవర్నర్ రక్షాబందన్‌ను ప్రత్యేకంగా జరుపుకున్నారు. కోవిడ్ 19తో పోరాడిన అనుభవాలు, ప్లాస్మాను దానం చేయడానికి గల కారణాలను గవర్నర్‌కు ప్లాస్మాదాతలు వివరించారు. వారి అనుభవాలను విన్న గవర్నర్ వారిపై ప్రశంసలు కురిపించారు. ఈ సందర్భంగా గవర్నర్ మాట్లాడుతూ ప్రభుత్వం ఆస్పత్రులు అందిస్తున్న సేవలు అమోఘమైనవన్నారు. వైద్యులు ఆదర్శవంతమైన పద్ధతిలో చికిత్స అందిస్తున్నారన్నారు.

కోవిడ్ 19 నుంచి కోలుకున్న రోగులకు, ప్లాస్మా దాతలకు ప్రభుత్వ ఆస్పత్రుల్లో విజయవంతంగా చికిత్స చేసినందుకు గవర్నర్ వారిని అభినందించారు. వైద్యుల నిబద్ధత, నిస్వార్థ సేవలకు తాను వందనం చేస్తున్నట్టు ఆమె తెలిపారు. కరోనా బారిన పడిన వారి ప్రాణాలను కాపాడుకోవడానికి ప్లాస్మా బ్యాంకు ఏర్పాటులో ప్రయత్నాలు చేయాలని గవర్నర్ తమిళిసై సౌందరరాజన్ పిలుపునిచ్చారు. ప్రజలు భయపడాల్సిన అవసరం లేదని, లక్షణాలుంటే పరీక్షలు చేయించుకోవాలని ఆమె పిలుపునిచ్చారు. ఇతరుల ప్రాణాలను కాపాడటానికి ప్లాస్మాను దానం చేయాలని గవర్నర్ సూచించారు. ఈ కార్యక్రమంలో డాక్టర్లతో పాటు పలువురు అధికారులు పాల్గొన్నారు.

Tamilisai celebrated Raksha with plasma donors