Thursday, April 25, 2024

రాజాసింగ్‌ను తక్షణం అరెస్ట్ చేయాలి: తమ్మినేని

- Advertisement -
- Advertisement -

Tammineni Veerabhadram Comments on Raja Singh

హైదరాబాద్: ఉత్తరప్రదేశ్ ఎన్నికల్లో యోగి ఆదిత్యనాథ్‌కు ఓట్లు వేయని వారి ఇండ్లపై జేసీబీలు, బుల్‌డోజర్లతో దాడులు చేస్తామంటూ బెదిరించిన తెలంగాణ బిజెపి ఎంఎల్‌ఎ టి రాజాసింగ్‌ను తక్షణమే అరెస్ట్ చేయాలని సిపిఎం రాష్ట్ర కార్యదర్శి తమ్మినేని వీరభద్రం డిమాండ్ చేశారు. యోగీ శత్రువులంతా ఒక్కటే, ఆయనను ఎన్నికల్లో ఓడించాలని చూస్తున్నారనీ, ఆయనకు వ్యతిరేకంగా ఓటేసినట్లు కనిపిస్తున్నదని రాజాసింగ్ వ్యాఖ్యానించారని మంగళవారం ఒక ప్రకటనలో తెలిపారు. ‘యూపీలో రెండో దశ ఎన్నికల పోలింగ్ ముగిసింది. ఇంకా ఐదు దశలున్నాయి. ఇప్పటికే జేసీబీలు, బుల్‌డోజర్లు తెప్పించాం. ఎవరైనా యోగీకి వ్యతిరేకంగా ఓటేస్తే వాటితో తొక్కిస్తాం. అలా ఓటేయాలనకునే వారు ఉత్తరప్రదేశ్‌లో ఉండరు. రాష్ట్రం విడిచి వెళ్లిపోవాల్సిందే’ అని రాజాసింగ్ వ్యాఖ్యానించారని పేర్కొన్నారు. ఇంత బాహాటంగా చట్టబద్ధంగా ఎన్నికైన ఎంఎల్‌ఎ బెదరిస్తూ మాట్లాడటం చట్ట విరుద్ధమని తెలిపారు.

ఎవరికైనా ఓటేసుకోండి, కానీ పరిపాలన బిజెపి చేస్తుందంటూ గతంలో కేంద్ర హోంమంత్రి అమిత్‌షా వ్యాఖ్యానించారని గుర్తు చేశారు. అనేక రాష్ట్రాల్లో అదే జరుగుతున్నదనీ, బిజెపిని ఓడించినా, గెలిపించినా, ఎంఎల్‌ఎలను ప్రలోభపెట్టి, బెదిరించి, డబ్బులిచ్చి కొనుగోలు చేసి బిజెపి పాలిస్తున్నదని వివరించారు. ఇప్పుడు రాజాసింగ్ ఏకంగా యోగీకి వ్యతిరేకంగా ఓట్లు వేయొద్దని బహిరంగంగా మాట్లాడితే పోలీసులు ఏం చేస్తున్నారని ప్రశ్నించారు. తక్షణమే ఎలక్షన్ కమిషన్ స్పందించి రాజాసింగ్‌పై అవసరమైన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. బిజెపికి వ్యతిరేకంగా మాట్లాడుతున్న కెసిఆర్ ప్రభుత్వం రాజాసింగ్ వ్యాఖ్యలను సుమోటోగా స్వీకరించి కేసు నమోదు చేయాలని డిమాండ్ చేశారు. వెంటనే అరెస్టు చేసి జైలులో పెట్టాలని కోరారు. రెచ్చగొట్టే వ్యాఖ్యలు చేసిన రాజాసింగ్‌పై ఎన్నికల కమిషన్ స్పందించి చట్టపరమైన చర్యలు తీసుకోవాలని కోరారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News