Tuesday, April 23, 2024

స్వేచ్ఛాయుత దృష్టికోణం

- Advertisement -
- Advertisement -

అంతర్జాతీయ సాహిత్య ప్రపంచంలో తస్లీమా నస్రీన్ పేరు తెలియని వారుండరు. ఆమె బంగ్లాదేశ్ లోని మైమెన్సింగ్ నగరంలో 1962లో జన్మించారు.1984 లో మెడిసిన్ పట్టా పుచ్చుకొని, బంగ్లా రాజధాని ఢాకాలోని ఆసుపత్రులలో ప్రసూతి నిపుణురాలుగా, మత్తు వైద్యురాలుగా పని చేసారు.తన మెడిసిన్ చదువుల కాలంలోనే ఆమె బలమైన స్త్రీ వాద రచయిత గా రూపొందారు.పిదప కవిత్వమూ, నవలలు, వ్యాసాలు ప్రచురించారు. ఆమె ప్రచురించిన ‘లజ్జ’ (Shame,1993 ) నవల హిందూ ముస్లింల మధ్య ఉద్విగ్నతలను ప్రమాదకరంగా రెచ్చగొట్టే విధంగా వుందని బంగ్లాదేశ్ ప్రభుత్వం 1994 లో నిషేధించింది. ఆమె లౌకిక, స్వేచ్చాయుత దృష్టికోణం ముస్లిం పక్షపాత మతతత్వ ధోరణులను బహువిధాలుగా ఎండగట్టింది. ఎన్నో చర్చలు, వాదోపవాదాలు రగిల్చింది.

దాంతో కోపోద్రిక్తులైన బంగ్లాదేశ్ లోని సంప్రదాయవాదులు దైవదూషణ చేసినందుకు గాను ఆమెను ఉరి తీయాలని ఆందోళనలు చేసారు. దాంతో తస్లీమా నస్రీన్ రహస్యంగా బంగ్లాదేశ్ ను వదిలి స్వీడన్‌లో తలదాచుకున్నారు. ఆ తర్వాత బంగ్లాదేశ్ ప్రభుత్వం ఆమె ఆత్మకథలు/ ‘అమర్ మేయెబెల’ (My Childhood, 2002)ను; ‘ఉతల్ హవా’(wild wind)ను 2002లో, ‘క’ (Speak up) ను 2003లో నిషేధించింది. పశ్చిమ బెంగాల్‌లో ముద్రితమైన ‘ద్విఖండిత’ను కూడా బెంగాల్ ప్రభుత్వం నిషేధించి, 2005లో ఆ నిషేధాన్ని ఎత్తివేసింది. మొత్తం గా ఏడు భాగాలుగా తస్లీమా ఆత్మకథనాలు ముద్రితమైనాయి. వివాదాస్పదమయ్యాయి. తస్లీమా ఇప్పటివరకు 30 పుస్తకాలు ముద్రించారు.20 కు పైగా భాషలలోకి ఆమె పుస్తకాలు అనువాదం అయ్యాయి. పశ్చిమ బెంగాల్ ప్రభుత్వం నుంచి 1992,2000 సంవత్సరాలకు గాను ఆనంద పురస్కారం; 1994లో యూరోపియన్ పార్లమెంట్ నుండి సాక్రోవ్ పురస్కారం, 1994లో ఫ్రాన్స్ ప్రభుత్వం నుండి మానవ హక్కుల పురస్కారం, 1994లో స్వీడన్ ప్రభుత్వం నుండి కుర్ట్ టుకులోస్కీ పురస్కారం వంటి అనేక అంతర్జాతీయ పురస్కారాలు పొందారు. బెల్జియం (1995), పారిస్ (2005), ఫ్రాన్స్ (2011) వంటి దేశాల యూనివర్సిటీల నుంచి గౌరవ డాక్టరేట్ లు పొందారు. ఈ కవితలు ఆమె రాసిన కవితా సంపుటుల నుంచి సంగ్రహించినవి.స్త్రీల హక్కులు, మతతత్వ నిరంకుశత్వాన్ని ప్రశ్నించి, నిలదీసే రచయిత్రిగా పేరు పొందిన తస్లీమా నస్రీన్ ఒక ప్రత్యేక గొంతుకతో స్త్రీల ఆంతరంగిక ప్రేమ,నిరీక్షణ, ఘర్షణ, ఆశ, నిరాశ, స్వేచ్ఛాయుత భావ ప్రకటన వంటి విషయాలను ఈ కవితలలో నిర్భయంగా వ్యక్తపరిచారు. తస్లీమా నస్రీన్ లోఆలోచనలు పరుచుకున్న ఈ కవితలు మన మనసులను కదిలిస్తాయి. కల్లోల పరుస్తాయి.

1. మహిళలు, పద్యాలు/ ఎంతో బాధ ఒక మనిషిని స్త్రీగా మారిస్తే../ అదే బాధ – స్త్రీని కవిని చేస్తుంది./ ఒక పదాన్ని నిర్మించడానికి సంవత్సరం పడుతుంది,/ అదే ఒక కవితకు జీవితాంతం./ ఒక స్త్రీ కవి అయినప్పుడు../ ఆమె సంపూర్ణంగా స్త్రీ./ తన వేదనా హృదయం నుండి / ఒక పదం జనించేంతగా/ ఆమె పరిణతి చెందుతుంది,/ అప్పుడు ఆమెకు ఒక పదాన్ని/ ఎలా చూసుకోవాలో తెలుసు./ పద్యానికి జన్మనివ్వాలంటే ముందుగా/ నువ్వొక స్త్రీ అయి ఉండాలి./ నొప్పి తెలీని పదం పెళుసుగా ఉంటుంది,/ తాకినప్పుడు విరిగిపోతుంది./ వేదన యొక్క ఆనుపానులు / ఒక స్త్రీ కంటే ఎక్కువగా ఎవరికి తెలుసు?
2. నువ్వు ముందుకెళ్ళు అమ్మాయి !/ వాళ్ళంటారు- తేలిగ్గా తీసుకోండని …/ అంటారు – శాంతించండని …/ అంటారు-మాట్లాడటం ఆపమని…/ అంటారు- నోరుమూసుకోని కూర్చోండని …/ అంటారు – తల వంచండని…/ అంటారు -ఏడుస్తూ ఉండండని, / కన్నీళ్లు కారనివ్వండని…/ బదులుగా మీరేం చేయాలి?/ నువ్వు ఇప్పుడు లేచి నిలబడాలి./ సరిగ్గా నిలబడాలి./ మీ వీపును నిటారుగా నిలబెట్టాలి./ తల పైకెత్తి…/ నువ్వు మాట్లాడాలి./ మనసు లోని మాట చెప్పాలి./ బిగ్గరగా మాట్లాడాలి./ అరవాలి./ నువ్వు బాగా బిగ్గరగా అరిస్తే / వాళ్ళు దాక్కోవడానికి పరిగెత్తాలి./ వాళ్ళంటారు -’నువ్వు సిగ్గులేనిదానివి!’/ అది విని ఒక్కసారి గట్డిగా నవ్వండి…/ వాళ్ళంటారు- ’నువ్వు శీలం లేనిదానివని!’/ అది విని ఇంకా గట్టిగా నవ్వండి…/ వాళ్ళంటారు-’నువ్వు చెడిపోయావని!’/ కాబట్టి నవ్వండి, ఇంకా బిగ్గరగా నవ్వండి…/ నువ్వు నవ్వడం విని, / వాళ్ళు అరుస్తారు../ ‘నువ్వు వేశ్యవి!’/ వాళ్ళలా అంటున్నప్పుడు,/ నీ తుంటిపై చేతులుంచి,/ గట్టిగా నిలబడి చెప్పు -/ ‘అవును, నేను వేశ్యను!’/ వాళ్ళు షాక్ అవుతారు./ వాళ్ళు అవిశ్వాసంతో చూస్తారు./ నువ్వింకా ఏమైనా చెపుతావేమోనని/ ఎదురుచూస్తారు./ వాళ్ళలో మగాళ్ళు ఎరుపుగా మారి చెమటలు కక్కుతారు./ వాళ్ళలో ఆడాళ్ళు/ నీలాంటి వేశ్య కావాలని కలలు కంటారు.

3. ఆడది/ పుట్టుక : ప్రకృతిలో ఏ జీవి కూడా ప్రవృత్తిలో/ ఆడపిల్ల పుట్టడం / అవాంఛనీయమైనదిగా భావించదు./ మనుషులు మాత్రమే దీనిని వింతగా భావిస్తారు./ బాల్యం:/ ఆమె పుట్టినప్పటి నుండి,/ ఆమె తన ఇంటిలో ఒక మూలలో / పడి ఉండనివ్వండి./ ఎలా జీవించాలో నేర్చుకోనివ్వండి./ యుక్తవయస్సు : / నీ జుట్టును గట్టిగా ముడివేసి ఉంచు./ మీ కళ్ళని అటు , ఇటు తిప్పుతూ చూడొద్దు./ నీ పొంగుతున్న వక్షోజాలని జాగ్రత్తగా దాచుకో./ స్త్రీలను సంకెలలో/ ఉంచాల్సిన అవసరం ఉందని మనకు తెలుసు./ ఎక్కువలో ఎక్కువ/ ఇంటి ఆవరణలో తిరగడానికి/ వాళ్ళని అనుమతించవచ్చు../ అంతే – / యువ్వనం :/ పురుషులు కొత్త కన్యల కోసం చూస్తారు./ కాబట్టి వాళ్ళని నలిపేసి/ పోగులు పెట్టొచ్చు./ కొన్ని ప్రేమ పేరు మీద../ కొన్ని పెళ్ళి పేరు మీద../ వృద్ధాప్యం :/ బిగుతుగా నునుపుగా వున్న చర్మం / ముడతలు పడి ఉంటుంది./ బహిష్టు నొప్పి శాశ్వతంగా పోతుంది./ చెప్పిన కథకు సంబంధించిన తంతు / మళ్లీ బయటపడింది./ మరణం : / మేము ఈ ఈతిబాధల/ నుండి విముక్తి పొందాము./ ప్రకృతిలో ఏ జీవి కూడా ప్రవృత్తిలో/ ఆడదాని మరణం కోరుకోదు./

4. చౌకగా దొరికేవి/ ——————-బజారులో / స్త్రీలంత చౌకగా ఏదీ దొరకదు./ వాళ్ళు తమ రాత్రులను / నిద్ర లేకుండా గడుపితే../ వారి పాదాలకు చిన్న రంగు సీసా వస్తుంది./ వాళ్ళు చాలా అణకువగా/ వారానికి రెండుసార్లు/ తమ శరీర మాంసపు ముక్కలను/ బజారులో విక్రయిస్తే../ తమ చర్మాన్ని రుద్దుకోవడానికి కొన్ని సబ్బులను../ జుట్టుకి కొన్ని సుగంధ తైలాలను తెచ్చుకోగలరు./ ముక్కుకు ఆభరణం పెట్టుకుంటే,/ వాళ్ళు డ్బ్బై రోజులు లేదా అంతకంటే ఎక్కువ కాలం ఎవరెవరి పాదాలో నాకి వుంటారు./ పూర్తి మూడున్నర నెలలు వెచ్చిస్తే/ అది ఒక చారల చీర అవుతుంది./ ఇంట్లోని గజ్జికుక్క కూడా /అప్పుడప్పుడు వాళ్ళ మీద అరుస్తుంది../ కానీ ఆడాళ్ళ నోళ్ల మీద చవకగా / ఒకటి వచ్చింది../ అదే..తాళం ..!/ బంగారు తాళం..!!

పి.శ్రీనివాస్ గౌడ్
9949429449

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News