Home జాతీయ వార్తలు బంగ్లాదేశ్ జిహాదిస్థాన్‌గా మారింది

బంగ్లాదేశ్ జిహాదిస్థాన్‌గా మారింది

Taslima Nasrin slams Bangladesh govt
హిందువులను మూడోతరగతి పౌరులుగా
చూస్తున్నారు: తస్లీమానస్రీన్

న్యూఢిల్లీ: బంగ్లాదేశ్‌లో హిందువులపై దాడుల్ని ప్రముఖ రచయిత్రి తస్లీమానస్రీన్ తీవ్రంగా ఖండించారు. బంగ్లాదేశ్ జిహాదిస్థాన్‌గా మారిందని ఆమె అన్నారు. ఛాందసవాదానికి మదర్సాలు జన్మస్థలాలుగా మారాయన్నారు. షేఖ్ హసీనా ప్రభుత్వం మతాన్ని రాజకీయ లబ్ధి కోసం వాడుకుంటున్నారని ఆమె విమర్శించారు. బంగ్లాదేశ్‌లో హిందువులు, బౌద్ధులు మూడో తరగతి పౌరులుగా చూడబడుతున్నారని ఆమె ఆవేదన వ్యక్తం చేశారు. బంగ్లాదేశ్‌లో దుర్గాపూజ మండపాలు, హిందూ ఆలయాలపై వారం రోజులుగా మతోన్మాదులు దాడులు జరుపుతున్న విషయం తెలిసిందే. దుర్గాపూజ సందర్భంగా ఖురాన్‌ను అవమానించారన్న ఆరోపణలతో మతోన్మాద మూకలు దాడులను ప్రారంభించాయి.

ప్రస్తుత, గత ప్రభుత్వాలన్నీ ఇస్లాంను ప్రభుత్వ మతంగా భావిస్తూ హిందువులు, బౌద్ధులను మూడో తరగతి పౌరులుగా మార్చాయని తస్లీమా విమర్శించారు. బంగ్లాదేశ్‌కు చెందిన తస్లీమా తన నవల ‘లజ్జ’లో ఇస్లాంను అవమానించారని మతోన్మాదులు ఆరోపించారు. ఆమెకు మరణ దండన విధిస్తామని హెచ్చరించారు. దాంతో, 1994 నుంచి తస్లీమా స్వదేశానికి దూరంగా ఉంటున్నారు. లజ్జను బంగ్లాదేశ్‌లో నిషేధించారు. 1993లో తాను రాసిన లజ్జలో ఓ హిందూ కుటుంబంపై ముస్లిం మతోన్మాదులు దాడికి పాల్పడటాన్ని ప్రస్తావించానని, అలాంటి సంఘటనలు నేటికీ జరుగుతున్నాయని ఆమె గుర్తు చేశారు. హిందువులు ఆ దేశాన్ని ఖాళీచేసి వెళ్లిపోవాలన్న లక్షంతోనే మతోన్మాదులు దాడులకు పాల్పడుతున్నారని ఆమె మండిపడ్డారు. దేశ విభజన సమయంలో అక్కడ హిందువులు 30 శాతం ఉండగా,ఇప్పుడది 9 శాతానికి పడిపోయిందని ఆమె తెలిపారు.