Home జాతీయ వార్తలు తౌక్టేతో నౌకా విధ్వంసం

తౌక్టేతో నౌకా విధ్వంసం

Tauktae death toll jumps as navy recovers victims

 

జాడతెలియని 38 మంది వర్కర్లు
ఇప్పటికీ మృతులు 37 మంది
కొట్టుకుపోయిన నౌకకోసం గాలింపు 

ముంబై : తౌక్టే తుపాన్‌తోంది. ముంబై తీరంలో నిలిపివుంచిన ఒఎన్‌జిసికి చెందిన నౌక కొట్టుకుపోయి దీనిలోని వర్కర్లు 37 మంది మృతి చెందారు. ఇక ఈ ఆయిల్ ఫీల్డ్ నౌకకు చెందిన 38 మంది వర్కర్లు గల్లంతు అయ్యారు. వారి జాడ తెలియడం లేదు. నౌకాదళ అధికారులు ప్రత్యేక బృందాలతో వారి కోసం గాలిస్తున్నారు. ఇప్పటికి పలు రాష్ట్రాలలో మండు వేసవి నెల మేలో భారీ వర్షాలు, మబ్బులు ఈదురుగాలుల వాతావరణాన్ని సృష్టించిన తుపాన్ తాకిడితో రెండు నౌకలు సముద్రంలోకి కొట్టుకుపోయ్యాయి. భారతీయ నౌకాదళానికి చెందిన నౌకలు రాత్రంతా తమ అన్వేషణ సాగించాయి. గురువారం రాత్రికి వర్కర్లు సజీవంగా ఉన్నారనే అంశంపై స్పష్టత రాలేదు.

వారు సముద్రంలో కొట్టుకుపోయి ఉంటారనే అనుమానాలు బలపడుతున్నాయి. దీనితో ఒఎన్‌జిసికి చెందిన ఈ నౌకల వర్కర్ల కుటుంబాలలో పెను విషాదం నెలకొంది. నౌకాదళానికి చెందిన సిబ్బంది గురువారం ఉదయం కూడా సముద్రంపై ఏరియల్ సర్వే నిర్వహించాయి. వర్కర్లను ఏ స్థితిలో ఉన్నా రక్షించేందుకు తాము చేపట్టిన సహాయక చర్యలను ముమ్మరం చేశాయి. ముంబై తీరానికి నౌకాదళానికి చెందిన హెలికాప్టర్లు రంగంలోకి దిగాయి. తౌక్టే తుపాన్‌తో పి 305 నౌక సోమవారం కొట్టుకుపోయింది. ఇందులోని 37 మంది చనిపోయారు. ఇక 38 మంది జాడతెలియకుండా పోయింది. ఇప్పటివరకూ ఈ నౌకకు చెందిన 186 మందిని నౌకాదళం సకాలంలో రక్షించి ఒడ్డుకు తీసుకురాగలిగింది.

కెప్టెన్ పట్టించుకోలేదని ఆరోపణలు
తౌక్టే తుపాన్ గురించి వారం రోజుల ముందుగానే పలు హెచ్చరికలు అందాయి. అయితే సురక్షిత ప్రాంతానికి నౌకను తీసుకుపోయేందుకు కెప్టెన్ బల్విందర్‌సింగ్ అంగీకరించలేదని ఈ నౌకకు చెందిన చీఫ్ ఇంజనీర్ రెహ్మన్ తెలిపారు. నౌక కొట్టుకుపోయిన తరువాత ప్రాణాలతో బయటపడ్డ వారిలో ఆయనా ఉన్నారు. తుపాన్ దశలో పలు హెచ్చరికలు ఉన్నప్పటికీ సముద్రపు అలలు ఉవ్వేత్తున ఎగిసిపడుతున్నప్పటికీ తీరం వెంబడి నౌకలో సిబ్బంది ఎందుకు ఉంది? వారు సురక్షిత ప్రాంతాలకు ఎందుకు వెళ్లలేదు? అనే విషయంపై తాము దర్యాప్తు చేపడుతామని ముంబై పోలీసు అధికారులు గురువారం తెలిపారు.

ఇప్పటికే ప్రమాద మరణాల నివేదికను (ఎడిఆర్) నమోదు చేసుకున్నారు. వరుసగా నాలుగో రోజు కూడా నౌకాదళ సిబ్బంది సముద్రంలో గాలింపులు చేపట్టిందని అధికారులు తెలిపారు. ఐఎన్‌ఎస్ కొచి, ఐఎన్‌ఎస్ కోల్‌కతా, ఐఎన్‌ఎస్ బియాస్, ఐఎన్‌ఎస్ బెత్వా, ఐఎన్‌ఎస్ తేగ్, సర్వేక్షక హెలికాప్టర్లతో , ఛేతక్, ఎఎల్‌హెచ్ , సీకింగ్ హెలికాప్టర్లతో గాలింపు తీవ్రతరం చేశారు. నౌకాదళపు మరో యుద్ధ నౌక ఐఎన్‌ఎస్ తల్వార్ ఇప్పుడు ఈ గాలింపు సహాయక చర్యలకు సంబంధించి పూర్తి స్థాయి ప్రత్యక్ష సమన్వయకర్తగా ఉంది. గుజరాత్ తీరంలో దీనిని నిలిపివుంచారు.

గుజరాత్‌లో 53కు చేరిన మృతుల సంఖ్య
తౌక్టే తుపాన్ ప్రభావంతో సంభవించిన దుర్ఘటనలలో గుజరాత్‌లో మరణించిన వారి సంఖ్య ఇప్పుడు 53కు చేరుకుంది. రాష్ట్రంలోని వివిధ ప్రాంతాలలో ఈ మరణాలు సంభవించాయని అధికారులు తెలిపారు. పలు చోట్ల గోడలు కూలడంతో వాటి కింద పడి పలువురు చనిపొయ్యారు. సోమవారం రాత్రి ఉనా టౌన్ వద్దతుపాన్ తీరం దాటింది. దాదాపు 28 గంటల పాటు పెను విధ్వంసం సృష్టించింది. తరువాత బలహీనపడింది. తుపాన్ ప్రభావిత ప్రాంతాలలో ప్రధాని మోడీ ఏరియల్ సర్వే చేపట్టారు. తక్షణ సాయంగా గుజరాత్‌కు వేయి కోట్ల రూపాయలను ప్రకటించారు.

Tauktae death toll jumps as navy recovers victims